ఎల్పీజీ ‘సబ్సిడీ ఎత్తివేత’పై భగ్గు | Sakshi
Sakshi News home page

ఎల్పీజీ ‘సబ్సిడీ ఎత్తివేత’పై భగ్గు

Published Wed, Aug 2 2017 1:15 AM

ఎల్పీజీ ‘సబ్సిడీ ఎత్తివేత’పై భగ్గు

► పార్లమెంట్‌ ఉభయ సభల్లో విపక్షాల నిరసన 
► యూపీఏ హయాం నాటి నిర్ణయమేనన్న ప్రభుత్వం


న్యూఢిల్లీ: గృహవినియోగ వంటగ్యాస్‌ సిలిండర్‌పై ప్రతి నెలా రూ. 4 పెంచి, మార్చి నాటికి సబ్సిడీని ఎత్తివేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై మంగళవారం పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాలు భగ్గుమన్నాయి. రాజ్యసభలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ, తృణమూల్‌ కాంగ్రెస్, లెఫ్ట్‌ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ అంశంపై చర్చకు డెరెక్‌ ఓబ్రియాన్‌(తృణమూల్‌) నోటీసు ఇచ్చారు.బ్యారల్‌ చమురు ధర 111 డాలర్ల నుంచి 48కు తగ్గినా ప్రభుత్వం మాత్రం వంటగ్యాస్‌ ధరలు పెంచుతోందని మండిపడ్డారు.

చర్చకు డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ తిరస్కరించడంతో విపక్షాలు వెల్‌లోకి దూసుకెళ్లాయి. దీంతో కురియన్‌ సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. తిరిగి సమావేశమయ్యాక విపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలను చంపుతోందని అన్నారు. పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వివరణ ఇస్తూ.. సబ్సిడీల ఎత్తివేత కోసం నెలనెలా ధరలు పెంచాలని 2010 జూన్‌లో అప్పటి యూపీఏ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించే తాజా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 

మరోపక్క.. ప్రభుత్వ నిర్ణయం దారుణమని లోక్‌సభలో విపక్షాలు ధ్వజమెత్తాయి. సబ్సిడీ ఎత్తివేతతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడతారని కేసీ వేణుగోపాల్‌(కాంగ్రెస్‌) ఆందోళన వ్యక్తం చేశారు. ముడి చమురు ధరలు తగ్గుతుండగా దేశంలో ధర పెంచడం సహేతుకం కాదన్నారు. ప్రభుత్వ తీరుపై నిరసనతో విపక్షాలు వాకౌట్‌ చేశాయి. గోరక్ష దాడులపైనా విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కంపెనీల నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించడానికి 27 ఏళ్ల కిందట ప్రవేశపెట్టిన బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఉపసంహరించుకుంది.

2018 వరకూ రూ.3కే సబ్సిడీ బియ్యం
దేశంలో 81 కోట్ల మంది పేదలకు సబ్సిడీపై బియ్యం, గోధుమలు అందిస్తున్న పథకాన్ని 2018 వరకూ సమీక్షించబోమని కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది. ప్రస్తుతం సబ్సిడీ బియ్యాన్ని కిలోకు రూ.3, గోధుమలను రూ.2 చొప్పున అందిస్తున్నారు.  
ప్రొటోకాల్‌ వివాదం: పార్లమెంటుకు అనుబంధంగా నిర్మించిన కొత్త భవనం ప్రారంభోత్సవానికి రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్, ఎంపీలను ఆహ్వానించకపోవడం పట్ల ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

రాజ్యసభ ఎన్నికల్లో ‘నోటా’పై నిరసన
రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసే ఎమ్మెల్యేలకు అభ్యర్థులందర్నీ తిరస్కరించడానికి వీలుగా, ‘పై అభ్యర్థుల్లో ఎవరికీ కాదు’(నోటా) ఆప్షన్‌ కల్పించడంపై రాజ్యసభలో విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజ్యాంగాన్ని, చట్టాన్ని సవరించకుండా కేవలం ఎన్నికల సంఘం ఆదేశంపై ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్‌ డిప్యూటీ నేత ఆనంద్‌శర్మ ఆరోపించారు.

గుజరాత్‌కు ప్రత్యేక రాజ్యాంగమేదైనా ఉందా  అని గులాం నబీ ఆజాద్‌.. గుజరాత్‌లో రాజ్యసభ ఎన్నికల వివాదాన్ని ఉద్దేశించి  ప్రశ్నించారు. ఈ అంశంపై ఈసీతో చర్చించాలని చైర్మన్‌ హమీద్‌ అన్సారీ సూచించినా విపక్షాలు వెనక్కి తగ్గలేదు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచే నోటా ఉందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. శర్మ స్పందిస్తూ.. వచ్చే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ నోటాను పొందుపరచాలన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement