ఉట్టిపై బెట్టు! | Sakshi
Sakshi News home page

ఉట్టిపై బెట్టు!

Published Wed, Jul 30 2014 12:02 AM

ఉట్టిపై బెట్టు!

* ఉత్సవాల్లో పాల్గొనేందుకు పిల్లలను అనుమతించేది లేదంటున్న బాలల హక్కుల కమిషన్
ఉత్సవాల్లో పిల్లలు పాల్గొనడాన్ని నిషేధిస్తే అసలు ఉట్టి ఉత్సవాలే నిర్వహించమంటున్న మండళ్లు

 
సాక్షి, ముంబై: ఉట్టి ఉత్సవాలపై బాలల హక్కుల సంఘం, ఉత్సవ మండళ్లు మొండిపట్టు పడుతున్నాయి. ఉట్టి ఉత్సవాల్లో పిల్లలు పాల్గొనడంపై బాలల హక్కుల సంఘం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఉత్సవాల సందర్భంగా నిర్వహించే మానవ పిరమిడ్‌లో పిల్లలు కనిపిస్తే సదరు మండలిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం పోలీసులను ఆదేశించింది. అయితే పిల్లలు పాల్గొనకుండా ఉత్సవాలను నిర్వహించలేమని, పిల్లలు పాల్గొనడంపై ప్రభుత్వం నిషేధం విధిస్తే అసలు ఉత్సవాలనే జరుపుకోమని మండళ్లు తేల్చి చెప్పాయి. ఇలా ఎవరి పట్టు వారు పడుతుండడంతో వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.
 
వేలమంది పాల్గొనే ఉత్సవాల్లో ఉట్టి కొట్టేందుకు మానవ పరిమిడ్లను నిర్మిస్తారు. పైన ఆకాశంలో వేలాడే ఉట్టిని కొట్టేందుకు నిర్మించే పిరమిడ్‌లో పెకైక్కి కొట్టేందుకు పిల్లలు పాల్గొంటున్నారు. పెద్దవారు అంతపైకి ఎక్కేందుకు అవకాశం లేకపోవడం, ఎక్కినా వారి బరువును కిందనున్నవారు ఆపే పరిస్థితి ఉండదు. దీంతో పిల్లలను పైకి ఎక్కిస్తుంటారు. అయితే 12 ఏళ్లలోపు పిల్లలు పాల్గొనడాన్ని బాలల హక్కుల కమిషన్ నిషేధించడంతో మండళ్లు ఇరుకునపడ్డాయి. పిల్లలు లేకుండా ఉట్టి ఉత్సవాలను ఎలా నిర్వహించేదంటూ మండళ్లు ఆందోళనకు దిగాయి.

చర్చలు విఫలం...: ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు వైద్యవిద్య, ఆరోగ్యశాఖ మంత్రి జితేంద్ర అవ్హాడ్, బాలల హక్కుల సంరక్షణ కమిషన్ కార్యదర్శి ఎ.ఎన్.త్రిపాఠి, దహి హండీ సమన్వయ సమితి అధ్యక్షుడు బాలా పడేల్కర్, వివిధ ఉట్టి ఉత్సవ మండళ్ల పదాధికారులు మంత్రాలయలో సమావేశమై చర్చించారు.
 
ఇరు వర్గాల మధ్య దాదాపు గంటన్నరసేపు చర్చలు జరిగాయి. చివరకు ఎటూ తేలకపోవడంతో మంత్రి చాంబర్ నుంచి అందరూ బయటకు వచ్చారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం ఉట్టి ఉత్సవాల్లో పిల్లలకు కచ్చితంగా అనుమతి వ్వాల్సిందేనని మండళ్ల పదాధికారులు డిమాండ్ చేశౠరు. దీనిపై బాలల హక్కుల కమిషన్ స్పందిస్తూ.. పిల్లలు ఉట్టి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అనుమతి ఇవ్వడంమంటే పిల్లల ప్రాణాలతో చెలగాటమాడడమేనని తెలిపింది.
 
నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలంటూ పునరుద్ఘాటించింది. మండళ్ల పదాధికారులు స్పందిస్తూ... ఇలాగైతే ఈసారి ఉట్టి ఉత్సవాలను నిర్వహించలేమని చెప్పారు. దీంతో ఉట్టి ఉత్సవాల వివాదం ఎటువంటి పరిష్కారానికి నోచుకోకుండానే సమావేశం ముగిసింది. ఆగస్టు 17న శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోనున్నారు. అప్పటి వరకు సమస్య పరిష్కారమైతే ఉట్టి ఉత్సవాలు ప్రశాంతంగా జరుగుతాయి. లేదంటే గందరగోళం తప్పదని మండళ్ల పదాధికారులు అంటున్నారు.

Advertisement
Advertisement