అన్ని పార్టీలతో చర్చ! | Sakshi
Sakshi News home page

అన్ని పార్టీలతో చర్చ!

Published Thu, Oct 30 2014 1:02 AM

అన్ని పార్టీలతో చర్చ! - Sakshi

‘ఢిల్లీ’ సర్కారు ఏర్పాటుపై గవర్నర్ నిర్ణయం
 

న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలపై వివిధ పార్టీల ప్రతినిధులతో చర్చలు జరపాలని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నిర్ణయించారు. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో... ప్రభుత్వ ఏర్పాటు లేదా తిరిగి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని తేల్చేందుకు నజీబ్ జంగ్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన బుధవారం ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. అనంతరం.. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి అనుమతించినందున, జంగ్ కొద్దిరోజుల్లో అక్కడి అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. అయితే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని మొదటగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవచ్చని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

బీజేపీ ముందుకు రాకపోతే అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీని, కాంగ్రెస్‌ను ఆహ్వానించవచ్చని పేర్కొన్నాయి. కాగా, ఢిల్లీలో తిరిగి ఎన్నికల నిర్వహణకే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ కూడా ముందుకు రాకపోతే.. ఎన్నికలు నిర్వహించడం తప్పదన్నాయి.  కాగా,  జంగ్ ఎన్డీయే ప్రభుత్వ తొత్తుగా వ్యవహరిస్తూ.. రాజ్యాంగ పదవికి మచ్చతెచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఢిల్లీలో పరిస్థితిపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆమ్‌ఆద్మీపార్టీ అధ్యక్షుడు  కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
 
 

Advertisement
Advertisement