అభివృద్ధే నా ఊపిరి! | Sakshi
Sakshi News home page

అభివృద్ధే నా ఊపిరి!

Published Mon, Mar 21 2016 12:29 AM

అభివృద్ధే నా ఊపిరి! - Sakshi

పక్కదారి పట్టించేందుకు విపక్షం కుట్ర
♦ వ్యతిరేక రాజకీయ వ్యూహంలో చిక్కుకోవద్దు
♦ బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ ముగింపు కార్యక్రమంలో మోదీ
♦ భావ ప్రకటన స్వేచ్ఛ, జాతీయవాదాన్ని విడదీసి చూడలేం: జైట్లీ
 
 న్యూఢిల్లీ: ప్రభుత్వాన్ని అభివృద్ధి మార్గం నుంచి పక్కదారి పట్టించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఢిల్లీలో ఆదివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమంలో ప్రధాని  మాట్లాడుతూ.. ‘వికాస్, వికాస్, వికాస్.. ఇదే నా ఏకైక లక్ష్యం. మన దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ఇదొక్కటే మంత్రం. మన లక్ష్యంపైనే దృష్టి పెడదాం. విపక్షాల వ్యతిరేక రాజకీయాల ఉచ్చులో పడొద్దు. కార్యకర్తలంతా సృజనాత్మకంగా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా పల్లెల వరకు చేరుకోవాలి. మనం వెళ్తున్న దారినుంచి పక్కకు తప్పించేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి.. మన పార్టీ సభ్యులంతా వీటి ప్రభావానికి లోనుకాకుండా అభివృద్ధి దిశగా మన లక్ష్యాన్నే మనసులో పెట్టుకోవాలి’ అని అన్నారు.

సమావేశ వివరాలను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మీడియాకు వెల్లడించారు. ‘గ్రామాలకు వెలుగులు అందించాలనే లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకున్నాం. 65 ఏళ్లుగా చీకట్లో ఉన్న దేశానికి వెలుగులిచ్చాం. 22 నెలల పాలనలో ఎక్కడా అవినీతి మరకల్లేవు. ‘బేటీ బచావ్-బేటీ పఢావ్’ వంటి ఎన్నో పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తోంది. ఈ విషయాలను ప్రతి బీజేపీ కార్యకర్త బాధ్యతగా గ్రామాలవరకు తీసుకెళ్లాలని ప్రధాని తెలిపారు’ అని రాజ్‌నాథ్ వెల్లడించారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపైనే బీజేపీ ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఆదివారం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జైట్లీ మీడియాతో మాట్లాడుతూ.. ‘జాతీయవాదం, భావప్రకటన స్వేచ్ఛ ఒకదానితో మరొకటి సమ్మిళితమై ఉంటాయి’ అని అన్నారు.

విభేదించే హక్కుందని.. దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఏ విషయాన్ని సహించమని ఆయన తెలిపారు. ‘భారత్ మాతాకీ జై’ నినాదంపై జరుగుతున్న వివాదాన్ని పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదన్న జైట్లీ.. భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా ఈడెన్ గార్డెన్స్‌లో ఈ నినాదమే మార్మోగిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. గత ప్రభుత్వాలు సరైన దిశానిర్దేశం లేకుండా పాలన సాగించాయని.. కానీ ప్రస్తుత ప్రభుత్వం సమర్థవంతమైన నాయకత్వంలో ప్రగతిశీల పాలన, జాతీయవాద విధానాలతో ముందుకెళ్తోందని జైట్లీ వెల్లడించారు. నాలుగురాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించినట్లు మంత్రి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలతో కుదుర్చుకుంటున్న పొత్తులతో కాంగ్రెస్ పార్టీ తన ప్రతిష్ట తగ్గించుకుందన్నారు.

 మోదీ.. దేవుడిచ్చిన వరం: వెంకయ్య
 అంతకుముందు రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి వెంకయ్య.. ‘ప్రధాన మంత్రి మోదీ భారత దేశానికి దేవుడిచ్చిన వరం. పేదల పాలిట భగవంతుడు’ అని ప్రశంసించారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్‌లో ఆయన జన్మస్థలానికి ప్రధాని వెళ్తారని పార్టీ ప్రకటించింది.

Advertisement
Advertisement