నేతల విషయంలో జాగ్రత్త! | Sakshi
Sakshi News home page

నేతల విషయంలో జాగ్రత్త!

Published Fri, Mar 28 2014 3:27 AM

నేతల విషయంలో జాగ్రత్త! - Sakshi

 పైలట్లు, విమానయాన సంస్థలకు డీజీసీఏ మార్గదర్శకాలు
 న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం రాజకీయ పార్టీలు, నేతలు విమానాలు, హెలికాప్టర్లను వినియోగిస్తున్నందున పౌర విమానయాన నియంత్రణ విభాగం(డీజీసీఏ) పలు మార్గదర్శకాలు జారీ చేసింది.
 
 వీఐపీలు వినియోగించే వి మానాలు లేదా హెలికాప్టర్లలో అనధీకృత డబ్బుకానీ, ఆయుధాలు, మత్తుపదార్థాలు కానీ రవాణా చేయడం లేదంటూ పైలట్లు, కేబిన్ సిబ్బంది హామీ ఇవ్వాలని పేర్కొంది. అద్దెకిస్తున్న విమానం ప్రయాణానికి వీలుగా పూర్తి సామర్థ్యంతో ఉందని, అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఆపరేటర్లు తెలియజేయాలని ఆదేశించింది. వీఐపీల ప్రయాణం విషయంలో భద్రతాపరమైన మార్గదర్శకాలను పాటించకుంటే చట్టపరమైన చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది. ప్రయాణికుల వివరాలను కూడా వారం ముందే తెలియజేయాలని కోరింది.
 
  కేవలం జీపీఎస్‌పైనే ఆధారపడకుండా స్థానిక మ్యాపులను వెంట ఉంచుకోవాలని సూచిస్తూ డీజీసీఏ తాజా ఆదేశాలు జారీ చేసింది. వీటి కాపీలను కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపినట్లు డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన వ్యక్తిగత రవాణా విమానాన్ని ఇటీవలే ఢిల్లీ విమానాశ్రయంలో తనిఖీలు చేసిన సందర్భంగా, రక్షణ పరికరాలు  గడువు తీరిపోవడం, పైలట్ లెసైన్స్ లేకుండా విమానాన్ని నడుపుతూ ఉండడాన్ని గుర్తించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన వారానికే డీజీసీఏ తాజా ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

Advertisement
Advertisement