ఢిల్లీ హైకోర్టు సీజేగా జస్టిస్ రోహిణి ప్రమాణం | Sakshi
Sakshi News home page

ఢిల్లీ హైకోర్టు సీజేగా జస్టిస్ రోహిణి ప్రమాణం

Published Tue, Apr 22 2014 3:36 AM

ఢిల్లీ హైకోర్టు  సీజేగా  జస్టిస్ రోహిణి ప్రమాణం

మహిళలకు న్యాయవ్యవస్థ అండ: జస్టిస్ రోహిణి
మహిళా సాధికారతకు నిదర్శనం: నజీబ్ జంగ్

 
 న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రానికి చెందిన జస్టిస్ జి.రోహిణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆమె చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ జడ్జి అయిన జస్టిస్ జి.రోహిణిని ఢి ల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ రోహిణికి ముందు ఢిల్లీ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఎన్.వి.రమణ కూడా రాష్ట్రానికి చెందినవారే కావడం గమనార్హం. జస్టిస్ రమణ పదోన్నతిపై సుప్రీంకోర్టు జడ్జిగా వెళ్లారు. ప్రమాణ స్వీకారానంతరం జస్టిస్ రోహిణి మాట్లాడుతూ ఢిల్లీ హైకోర్టుకి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి కావడం సంతోషంగా ఉందన్నారు. మహిళలకు న్యాయవ్యవస్థ అండగా ఉంటుందని, ఢిల్లీ మహిళలకు తనవంతు సాయం చేయడంతో పాటు సహకారం అందిస్తాన ని చెప్పారు.

లింగ వివక్ష ఉన్నప్పటికీ మహిళలు కేవలం ఇళ్లకే పరిమితం కాకుండా తమ సత్తా చాటుతున్నారన్నారు. జస్టిస్ రోహిణి నియూమకం మహిళా సాధికారతకు నిదర్శనమని నజీబ్ జంగ్ పేర్కొన్నారు. చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ రోహిణి నియామకంపై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. జస్టిస్ రోహిణి 1955 ఏప్రిల్ 14న విశాఖపట్నంలో జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. 1980లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1995లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యూరు. 2001లో అదనపు జడ్జిగా, 2002లో శాశ్వత జడ్జిగా నియమితులయ్యూరు.
 

Advertisement
Advertisement