Sakshi News home page

బ్రిక్స్‌ వేదికగా జీఎస్‌టీపై ప్రశంసలు

Published Mon, Sep 4 2017 5:44 PM

బ్రిక్స్‌ వేదికగా జీఎస్‌టీపై ప్రశంసలు - Sakshi

జిమెన్‌: ఈ ఏడాది జులైలో ప్రవేశపెట్టిన జీఎస్‌టీని భారత్‌లో అతిపెద్ద పన్ను సంస్కరణగా ప్రధాని నరేం‍ద్ర మోదీ అభివర్ణించారు.  జీఎస్‌టీ ద్వారా 130 కోట్ల జనాభా ఏకతాటిపైకి వచ్చిందని అన్నారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు వెల్లువలా తరలివస్తూ 40 శాతం మేర వృద్ధి చెందాయని చెప్పారు. బ్రిక్స్‌ వాణజ్య మండలి సమావేశంలో ప్రధాని ప్రసంగిస్తూ సులభంగా వ్యాపారం నిర్వహించే ప్రపంచ బ్యాంక్‌ జాబితాలో గత రెండేళ్లలో భారత్‌ స్ధానం గణనీయంగా మెరుగుపడిందని అన్నారు. డిజిటల్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చివేస్తున్నాయన్నారు.దేశాన్ని విజ్ఞాన ఆధారిత, నైపుణ్యంతో కూడిన సాంకేతిక ఆధార సమాజం దిశగా ఇవి నడిపిస్తున్నాయని పేర్కొన్నారు.బ్రిక్స్‌ కౌన్సిల్‌ సభ్య దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి చూపుతున్న చొరవను ప్రశంసించారు.
 
వివిధ భాగస్వామ్యాలు, వ్యవస్థల ద్వారా బ్రిక్స్‌ దేశాలు ఆర్థికంగా పలు విజయాలు సాధిస్తున్నాయన్నారు. న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ)తో బ్రిక్స్‌ కౌన్సిల్‌ చేతులు కలపడాన్ని ఆయన స్వాగతించారు. పాశ్చాత్య దేశాల రేటింగ్‌ ఏజెన్సీలకు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్‌ ప్రత్యేక రేటింగ్‌ ఏజెన్సీల ఏర్పాటుకు పూనుకోవడం అభినందనీయమన్నారు.భేటీలో చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, బ్రెజిల్‌ అధ్యక్షుడు మైఖేల్‌ తెమెర్‌, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్‌ జుమా పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement