అసెంబ్లీలో రగడ.. పుస్తకంపై బ్యాన్ | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో రగడ.. పుస్తకంపై బ్యాన్

Published Sat, Aug 12 2017 4:05 PM

అసెంబ్లీలో రగడ.. పుస్తకంపై బ్యాన్

రాంచీ: గిరిజన మహిళలను కించపరుస్తూ రాసిన ఓ పుస్తకంపై జార్ఖండ్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. అంతేకాదు పుస్తక రచయిత డాక్టర్‌ హంసద సోవేంద్ర శేఖర్‌పై న్యాయపరమైన చర్యలకు సిద్ధమైపోయింది. వైద్యుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత  సోవేంద్ర శేఖర్‌ ‘ది ఆదివాసి విల్‌ నాట్ డాన్స్’  పేరిట ఓ పుస్తకం రాశారు.

ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే క్రమంలో అక్కడి గిరిజన మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను కథల సంపుటిగా రచించారు. అయితే అందులో ఆయన అసభ్య పదజాలం, అశ్లీల ఫోటోలు ఉపయోగించారని, ముఖ్యంగా సంతల్‌ తెగకు చెందిన మహిళలను ఘోరంగా, వారి గౌరవాన్ని దెబ్బతీసేలా రాశారని విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్‌, జేఎంఎంలు అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తి ప్రకంపనలు సృష్టించాయి.

దీంతో రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి  రఘువర్ దాస్  ఈ పుస్తకంపై నిషేధం విధించాలని, రచయితపై  చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే శేఖర్‌పై చర్యలు తీసుకుంటామని పాకుర్ ఎస్పీ వెల్లడించారు. ఇప్పటికే మార్కెట్లోకి విడుదలయిన అన్ని పుస్తకాలను వెనక్కి రప్పించేశారు.

Advertisement
Advertisement