Sakshi News home page

హైదరాబాద్‌లో టాయ్‌లెట్‌ కేఫ్‌లు

Published Fri, Oct 5 2018 5:37 PM

Hyderabads Loo Cafes aim to change the perception that Indias public toilets are poorly maintained - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : టాయ్‌లెట్‌ కేఫ్‌లు....పదం కొత్తగానే కాదు, అసహ్యంగాను అనిపించవచ్చు! కేఫ్‌లో టాయ్‌లెట్లు ఉంటాయిగానీ, టాయ్‌లెట్లలో కేఫ్‌లు ఉంటాయా? అని ఆశ్చర్యమూ కలగవచ్చు. ఒక విధంగా టాయ్‌లెట్‌ కేఫ్‌లు నిజమే. ఎందుకంటే అవి పరిశుద్ధ్యమైన టాయ్‌లెట్లను అందించడం కోసమే వచ్చిన కేఫ్‌లు కనుక. హైదరాబాద్‌ హైటెక్‌ నగరంగా ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ పబ్లిక్‌ టాయ్‌లెట్లు మాత్రం ఎప్పుడూ పరమ దరిద్రంగానే ఉంటున్నాయి. వాటిల్లోకి ముక్కుమూసుకొని వెళ్లడం ముక్కుమూసుకొని రావడం మనకు నిత్యానుభవమే. సులభ్, మున్సిపాలిటీ పెయిడ్‌ టాయ్‌లెట్లు కాస్త బెటర్‌. 

హైటెక్‌ నగరాలకు హైటెక్‌ టాయ్‌లైట్లు అంటే, కనీసం పరిశుభ్రమైన టాయ్‌లెట్లు అవసరం ఎంతైనా ఉంది. లక్షల రూపాయలు పెట్టి పరిశుభ్రమైన టాయ్‌లెట్లను మున్సిపాలిటీలను నిర్మించినా వాటి నిర్వహణ మాత్రం ఛండాలంగానే ఉంటుంది. పరిశుభ్రంగా ఉంచాలంటే అందుకు ఎక్కువ ఖర్చు అవుతుంది. అంత ఖర్చును మున్సిపాలిటీలో, మరో ప్రభుత్వ సంస్థనో భరించలేదు. యూజర్‌ ఛార్జీలు రూపాయి మించినా నగర పౌరులు వాటిని చెల్లించేందుకు సిద్ధ పడరు. పైగా యూజర్‌ చార్జీలకు నిరసన్నట్లుగా టాయ్‌లెట్ల ముందే పోసిపోతారు. కనకు నగర పౌరులకు నయా పైస ఖర్చు లేకుండా అత్యంత పరిశుభ్రమైన టాయ్‌లెట్లు లేదా మరుగుదొడ్లు  (ఆధునిక భాషలో వాష్‌రూమ్‌) అందించాలి, ఎలా?

సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానంగా పుట్టుకొచ్చింది ‘లూ కేఫ్‌’. మరో విధంగా చెప్పాలంటే నగర పౌరుల కోసం వెలసిన లగ్జరీ వాష్‌రూమ్‌. హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలో మొట్టమొదటి లూకేఫ్‌ మార్చి నెలలోనే వెలిసింది. 170 చదరపు గజాల స్థలంలో దీర్ఘ చతురస్రాకారంలో కార్డ్‌బోర్డు గుడారంలా దీన్ని నిర్మించారు. పచ్చని చెట్లు, చిన్న చిన్న మొక్కల మధ్యన ఉండే ఈ కేఫ్‌లో పరిశుభ్రమైన మరుగుదొడ్లతోపాటు వైఫై ఇంటర్నెట్‌ సౌకర్యం, ఏటీఎం, చిన్నసైజ్‌ బేకరీ ఫుడ్‌ స్టాల్‌ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాక అది కేఫ్‌ అవుతుందని, హైటెక్‌ వాష్‌రూమ్‌ ఎలా అవుతుందని ఎవరికైనా ప్రశ్న వస్తుంది. నిజం చెప్పాలంటే వాష్‌రూమ్‌ కోసమే ఇవన్నీ కూడా. యూజర్‌ చార్జీలను వసూలు చేయకుండా వాష్‌రూమ్‌ను పరిశుభ్రంగా నిర్వహించాలంటే అందుకు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును రాబట్టేందుకే కేఫ్, ఏటిఎంలు. ఏటీఎంకు స్థలం ఇచ్చినందుకు దానికి సంబంధిచిన బ్యాంక్‌ నెలకింత అద్దె చెల్లిస్తుంది. ఇక కేఫ్‌ను నడుపుకునేవారు కూడా అద్దె చెల్లిస్తారు. దాంతో వాష్‌రూమ్‌లను శుభ్రంగా ఎప్పటికప్పుడు వాష్‌ చేయవచ్చు. 

వాష్‌ రూమ్‌లో కూలర్లను ఏర్పాటు చేయడమే కాకుండా ఆడవాళ్ల కోసం చౌకగా అంటే, ఐదు రూపాయలకు మించకుండా శానిటరీ నాప్‌కిన్స్‌ను అందిస్తున్నారు. కేఫ్‌లో తినుభండారాలు కూడా కాస్ట్లీ కావు. 30 రూపాయల లోపే. ఇది మరుగుదొడ్డి అనే బోర్డేమి కనిపించేలా ఉండదు. కొత్తవారికి నిర్వాహకులు దారి చూపిస్తారు. పదేపదే రావలనుకనే వారికి వాష్‌రూమ్‌ను ఉచితంగా వాడుకునేందుకు ప్రత్యేక కార్డులు ఇస్తారు. కేఫ్‌కు వచ్చేవారు వాష్‌రూమ్‌ను ఉపయోగించుకునేలా, వాష్‌రూమ్‌ను ఉపయోగించుకునేందుకు వచ్చిన వారికి కేఫ్‌ అందుబాటులో ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దారన్న మాట. 

ఈ లూ కేఫ్‌ను ఐక్సోరా ఎఫ్‌ఎం కంపెనీ ఏర్పాటు చేసింది. నగరంలోని పలు వాష్‌రూమ్‌లను తాము సందర్శించామని, ఎక్కడా తమకు పరిశుభ్రమైన వాష్‌రూమ్‌లు కనిపించలేదని, అందుకనే హైటెక్‌ టాయ్‌లెట్లు అందించాలన్న లక్ష్యంతోనే లూ కేఫ్‌ను ఏర్పాటు చేశామని ఐక్సోరా ఎఫ్‌ఎం కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో అభిషేక్‌ నాథ్‌ తెలిపారు. ఈ వాష్‌రూమ్‌ వర్కింగ్‌ విమెన్‌ఖు ఎంతో ఉపయోగకరంగా ఉందని పక్కనే ఓ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కంపెనీలో పనిచేస్తున్న మధు జోషి చెప్పారు. ఆఫీసు నుంచి బయటకు వచ్చాక టాయ్‌లెట్‌కు వెళ్లాంటే ఇంతకు ముందు తమకు ఎంతో ఇబ్బంది ఉండేదని ఆమె అన్నారు. కొత్త కాన్సెప్ట్‌ను ఆమె అభినందించారు. 

2019, జనవరి నెల నాటిని నగరంలో దాదాపు వంద ఇలాంటి ‘లూ కేఫ్‌’లు రానున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రాణం పోసుకోవడానికి హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ జోనల్‌ అండ్‌ అడిషనల్‌ కమిషనర్‌ హరిచందన దాసరి సహకారం ప్రధానంగా ఉంది. తనకు అన్ని కాన్సెప్ట్‌ వాష్‌రూమ్‌లకన్నా ఇది బాగా నచ్చిందని దాసరి తెలిపారు. ఇండోర్‌లో కూడా ఇలాంటి వాష్‌రూమ్‌లను ఏర్పాటు చేశారుగానీ ఇంత మోడ్రన్‌గా అవి లేవన్నారు. నగరంలోని ప్రతి జోన్‌లో కనీసం 30 ఇలాంటి వాష్‌రూమ్‌లను నిర్మించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయని ఆమె తెలిపారు. ఇప్పటి వరకు ఈ లూ కేఫ్‌ టాయ్‌లెట్‌ను పది వేల మంది వరకు ఉపయోగించుకున్నారని అభిషేక్‌ నాథ్‌ తెలిపారు. యూజర్ల అభిప్రాయాలను అటు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు, ఇటు ఎఫ్‌ఎం కంపెనీకి ఒకేసారి చేరవేసే ఏర్పాట్లు ఉన్నాయన్నారు. ఒక్కో లూ కేఫ్‌ నిర్మాణానికి 15 లక్షల రూపాయల నుంచి 18 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని నాథ్‌ తెలిపారు. 

Advertisement

What’s your opinion

Advertisement