2018కల్లా కంచె పూర్తి | Sakshi
Sakshi News home page

2018కల్లా కంచె పూర్తి

Published Sat, Oct 8 2016 2:09 AM

2018కల్లా కంచె పూర్తి - Sakshi

సరిహద్దు భద్రతపై రాజ్‌నాథ్ సమీక్ష
* ఉగ్రవాదానికి ‘బ్రాండ్ పాకిస్తాన్’ ప్రతీక: జైట్లీ
* పాక్‌ను టైస్టు దేశంగా ప్రకటించలేం: అమెరికా

జైసల్మేర్/న్యూఢిల్లీ: పాకిస్తాన్ మిలిటెంట్ల చొరబాట్లను పూర్తిగా కట్టడి చేసేందుకు సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం జరుగుతోందని.. 2018 డిసెంబర్ కల్లా మొత్తం సరిహద్దును మూసేస్తామని  కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆయన శుక్రవారం రాజస్తాన్ జైసల్మేర్‌లో సరిహద్దు భద్రతపై సమీక్ష నిర్వహించి, మీడియాతో మాట్లాడారు. వచ్చే రెండేళ్లలో సాంకేతిక పరిష్కారాలతో కూడిన భద్రత గ్రిడ్ ఏర్పాటుచేసేందుకు సరిహద్దు రాష్ట్రాలతో చర్చిస్తున్నామన్నారు.

భేటీలో రాజస్తాన్ సీఎం వసుంధరా రాజే, పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్, తదితరులు పాల్గొన్నారు. కాగా, అంతర్జాతీయ ఉగ్రవాదానికి ‘బ్రాండ్ పాకిస్తాన్’ ప్రతీకగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అమెరికాలో అన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు పాక్‌లోనే బయటపడుతున్నాయన్నారు. కాగా,  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదుల స్వర్గధామాలను తుడిచిపెడతామని అమెరికా స్పష్టం చేసింది. పాక్‌ను ఉగ్రదేశంగా ప్రకటించబోమని.. అయితే ఈ ప్రాంతంలో ఉగ్రవాద స్థావరాలను నిర్మూలించటంలో తమ సాయం ఉంటుందని పేర్కొంది.
 
కశ్మీర్ భారత్‌లో భాగం కాదు: పాక్
కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనన్న మోదీ సర్కారు ప్రకటనను తిరస్కరిస్తూ.. పాక్ పార్లమెంటు శుక్రవారం తీర్మానం చేసింది. లోయలో భారత ప్రభుత్వ నిరంకుశ విధానం వల్ల మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించింది. అయితే.. కశ్మీర్ సమస్యను పరిష్కరించుకునేందుకు భారత్‌తో చర్చలకు సిద్ధమేనంది. 

సింధూజలాల వినియోగంలోనూ భారత్ ఏకపక్షంగా వ్యవహరించజాలదని.. దీనిపై అంతర్జాతీయ సమాజానికి ఫిర్యాదు చేస్తామని తెలిపింది. మరోవైపు, అఫ్గనిస్తాన్‌లో శాంతి నెలకొనేందుకు కశ్మీర్ అంశం కూడా కీలకమని పాక్, అఫ్గాన్‌లను వేర్వేరుగా చూడలేమని కశ్మీర్ వ్యవహారాలపై  షరీఫ్ రాయబారి హుసేన్ అమెరికాకు తెలిపారు. కశ్మీర్‌లో శాంతి నెలకొనేంతవరకు పాక్, అఫ్గాన్‌లో శాంతి నెలకొనటం కష్టమన్నారు.  

రాహుల్ వ్యాఖ్యలపై దుమారం
న్యూఢిల్లీ: ఆర్మీ చేసిన సర్జికల్ దాడులతో కేంద్రం రాజకీయ లబ్ది పొందుతోందంటూ.. ‘రక్తం (ఆర్మీ)తో చేస్తున్న వ్యాపారం’(ఖూన్ కీ దలాలీ) అని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ అమిత్ షా మండిపడ్డారు. ‘దలాలీ కాంగ్రెస్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలి యదు. బోఫోర్స్ నుంచి బొగ్గు స్కాం వరకు వ్యాపారం చేసుకున్నదెవరో రాహుల్ మరిచి పోయారా?’ అని ప్రశ్నించారు. దీనిపై  కాంగ్రెస్ మండిపడింది. తన వ్యాఖ్యలు ఆర్మీకి వ్యతిరేకం కాదని.. ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్న బీజేపీపైనేనని రాహుల్ తెలిపారు.

Advertisement
Advertisement