చచ్చిందొకరు.. అంత్యక్రియలు మరొకరికి | Sakshi
Sakshi News home page

చచ్చాడనుకుని అంత్యక్రియలు చేస్తే...

Published Thu, Oct 5 2017 9:46 AM

Jaipur Man Returns Alive After cremations Done

సాక్షి, జైపూర్‌ :  స్పష్టత కొరవడితే ఎలా ఉంటుందో ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటన ఓ నిదర్శనం. చనిపోయాడనుకుని ఓ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించారు. శోక సంద్రంలో మునిగిపోయి అంతా రోదిస్తుండగా...  కొద్ది గంటలకే ఆ వ్యక్తి ప్రాణాలతో ప్రత్యక్ష్యమయ్యాడు. అంతే ఆ కుటుంబ సభ్యుల గుండెలు ఒక్కసారిగా ఆగిపోయాయి. 

హనుమాన్‌ఘడ్‌ జిల్లా గోలువాలా జిల్లా వాసి అయిన కులామర్‌ అనే వ్యక్తి కొన్ని రోజులుగా అదృశ్యం అయ్యాడు. పైగా అతని ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తుండటంతో..  కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించటం మొదలుపెట్టారు. అదే సమయంలో దలిన్‌వాలి గ్రామంలో ఓ వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించగా..  గుర్తుతెలియని మృతదేహమంటూ పేపర్‌లో పోలీసులు ప్రకటన ఇచ్చారు. అది గమనించిన కులామర్‌ సోదరి రాజో దేవీ(27) చనిపోయింది తన సోదరుడేనంటూ కొందరు గ్రామ పెద్దల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. 

ఓ మహిళతో తన సోదరుడు కొద్ది రోజుల క్రితం ఏటో వెళ్లిపోయాడని.. బహుశా ఆ మహిళే అతనిని హత్య చేసి ఉంటుందని రాజోదేవీ అనుమాన వ్యక్తం చేసింది. దీంతో ఆమెకు శవాన్ని అప్పగించి.. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమవారం మధ్యా‍హ్నం అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే కులామర్‌ హత్య విషయంలో ఏవైనా సాక్ష్యాలు లభిస్తాయన్న ఉద్దేశ్యంతో అతని బంధువొకరు మరోసారి అతని ఫోన్‌ నంబర్‌కు ప్రయత్నించాడు. 

ఈసారి అవతలి వైపు ఫోన్‌ హలో చెప్పింది కులామరే కావటంతో బంధువులు షాక్‌ తిన్నారు. ఫోన్‌లోనే జరిగిన విషయాన్ని అతనికి వివరించగా, వెంటనే తన స్వగ్రామానికి చేరుకుని తాను బతికే ఉన్నానంటూ రుజువు చేశాడు. తన ఫోన్‌ బ్యాటరీ డెడ్‌ అయిపోవటంతో తాను ఎక్కడున్నది కుటుంబ సభ్యులకు చేరవేయలేకపోయానని అతను చెప్పాడు. దీంతో రాజో దేవీ తాను శవాన్ని గుర్తించటంలో పొరపాటు చేశానని ఒప్పేసుకుంది. ఇక అంత్యక్రియలు నిర్వహించిన ఆ బాడీ ఎవరిదన్నది గుర్తించే పనిలో పోలీసులు తలమునకలయ్యారు.

Advertisement
Advertisement