Sakshi News home page

ప్రాంతీయ పార్టీల మహాకూటమి

Published Fri, Nov 7 2014 1:08 AM

ప్రాంతీయ పార్టీల మహాకూటమి

ములాయం నివాసంలో ‘విందు’ భేటీ
హాజరైన ఆరు పార్టీల అధినేతలు
‘జనతా పరివార్’ పునర్నిర్మాణానికి యత్నాలు
ఉభయసభల్లో మోదీ సర్కారు ముట్టడికి వ్యూహాలు

 
సాక్షి, న్యూఢిల్లీ: ముక్కలైన ‘జనతా పరివార్’(ప్రజా కుటుంబం)ను మళ్లీ ఒక్కటి చేయడానికి ప్రాంతీయ పార్టీలు సన్నద్ధమయ్యాయి. జనతా పరివార్‌లోని పార్టీలన్నింటినీ ఏకం చేయడానికి సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌యాదవ్ చొరవ తీసుకున్నారు. ఢిల్లీలోని అధికారిక నివాసంలో గురువారం ములాయం ఇచ్చిన విందు భేటీకి ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్‌యాదవ్, ఆయన సతీమణి, మాజీ సీఎం రబ్రీదేవి, జనతాదళ్(యూ) అధినేత శరద్‌యాదవ్, బీహార్ మాజీ సీఎం నితీశ్‌కుమార్, మాజీ ప్రధాని, జనతాదళ్(ఎస్) అధినేత దేవెగౌడ, ఇండియన్ లోక్‌దళ్ నేత దుష్యంత్ చౌతాలా, సమాజ్‌వాదీ జనతా పార్టీ నేత కమల్ మొరార్క హాజరయ్యారు.

దేశంలో తాజా రాజకీయ పరిణామాలు, మోదీ ప్రభంజనం, ప్రభుత్వ పనితీరు, హామీలు నెరవేర్చడంలో వైఫల్యాలు, ప్రాంతీయ పార్టీల భవిష్యత్ తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించారు. సంపూర్ణ మెజార్టీతో కొనసాగుతున్న ఎన్డీయే ప్రభుత్వాన్ని ఉభయసభల్లో ముట్టడించే దిశగా వీరంతా సుదీర్ఘంగా చర్చించారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోయి జనతా పరివార్‌ను ఒక్కటిగా చేసి విపక్ష పాత్ర పోషించడానికి నిర్ణయించారు. భేటీ అనంతరం ములాయం మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటైందని, ఆ పార్టీని ఓడించడానికి వ్యూహాలు సిద్ధం చేస్తామని చెప్పారు. నితీశ్ కుమార్ మాట్లాడుతూ నైతికంగా, సైద్ధాంతికపరంగా జనతా పరివార్‌లోని తామంతా కలసికట్టుగా పనిచేయడానికి సమ్మతి కుదిరిందన్నారు.

జనతా పరివార్‌లోని విభిన్న పార్టీలన్నింటినీ ఒక్కటిగా చేయడానికియత్నిస్తున్నామని, ఇది సఫలమైతే జనతా పరివార్ బలోపేతం అవుతుందని, పార్టీల మధ్య సమన్వయం, పొత్తులు, విలీనాలు, ఇతరత్రా విషయాలన్నీ తర్వాత వస్తాయన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడం సహా పలు హామీల అమల్లో విఫలమైన మోదీ సర్కారును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో నిలదీస్తామన్నారు. కాగా, తృతీయ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్న వామపక్షాలను ఈ భేటీకి ఆహ్వానించకపోవడం గమనార్హం.

Advertisement

What’s your opinion

Advertisement