జేఈఈ అడ్వాన్స్డ్ కు వంద మార్కుల కటాఫ్ | Sakshi
Sakshi News home page

జేఈఈ అడ్వాన్స్డ్ కు వంద మార్కుల కటాఫ్

Published Wed, Apr 27 2016 6:18 PM

జేఈఈ అడ్వాన్స్డ్ కు వంద మార్కుల కటాఫ్

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్షా ఫలితాలు బుధవారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా 12 లక్షలకుపైగా విద్యార్థినీ విద్యార్థులు ఈ పరీక్షలు రాయగా సీబీఎస్ఈ బుధవారం సాయంత్రం వీటి ఫలితాలను విడుదల చేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి జనలర్ కేటగిరీ విద్యార్థులకు వంద మార్కులు కటాఫ్ గా నిర్ణయించింది. అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి ఓబీసీ విద్యార్థులకు కటాఫ్ మార్కులు 70 గా నిర్ణయించగా, ఎస్సీ విద్యార్థులకు 52, ఎస్టీ విద్యార్థులకు 48 గా సీబీఎస్ఈ ఖరారు చేసింది. దేశ వ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశం పొందడానికి నిర్వహించే అడ్వాన్స్డ్ పరీక్షకు 2 లక్షల మందికి (అర్హత) స్కోర్ కార్డులను ప్రకటించినట్టు తెలుస్తోంది.

అర్హత సాధించిన విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి ఆన్ లైన్ లో (http://jeeadv.nic.in) రిజిస్టర్ చేసుకోవాలని సీబీఎస్ఈ కోరింది. ఇకపోతే, ఇంటర్ వెయిటేజీ మార్కులను, జేఈఈ మెయిన్ పరీక్షలో వచ్చన మార్కులను (60% : 40% నిష్పత్తిలో) కలిపి ర్యాంకులను జూన్ నెల 30 వ తేదీలోగా ప్రకటించనున్నట్టు సీబీఎస్ఈ తెలిపింది. ఐఐటీల్లో కాకుండా దేశ వ్యాప్తంగా ఎన్ఐటీల్లోని బీఈ, బీటెక్, బీఆర్క్ వంటి కోర్సుల్లో  ప్రవేశం పొందడానికి ఇంటర్ లో వచ్చిన మార్కులు, జేఈఈ మెయిన్ లో వచ్చిన మార్కులను కలిపి ర్యాంకులను ప్రకటిస్తారన్న విషయం తెలిసిందే.

జేఈఈ మెయిన్స్ పరీక్ష మొత్తం 360 మార్కులకు గాను గతేడాదికంటే కటాఫ్ మార్కులు ఈసారి తగ్గించారు. 2013లో 113 మార్కులు, 2014లో 115 మార్కులు , 2015 లో 105 మార్కులు కటాఫ్ గా నిర్ణయించారు. ప్రతిఏటా అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి 1.5 లక్షల విద్యార్థులను మాత్రమే ఎంపిక చేయగా, ఈసారి 2 లక్షల మంది విద్యార్థులను ఎంపిక చేయడంతో కటాఫ్ వంద మార్కులకు తగ్గించినట్టు తెలుస్తోంది.

 

జేఈఈ మెయిన్ పరీక్షా ఫలితాలు కోసం..


 

Advertisement
Advertisement