ఇకపై ‘బాత్రూం బ్రేక్‌’ కూడా కౌంటే..! | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యల నివారణకు ఓ స్కూల్‌ వినూత్న ప్రయత్నం

Published Fri, Jun 28 2019 4:10 PM

Kolkata School To Time Students Bathroom Breaks - Sakshi

కోల్‌కతా : పాఠశాలల్లో ఆత్మహత్యల నివారణ కోసం ఓ స్కూల్‌ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.  ఇక మీదట విద్యార్థులు బాత్‌రూంలో ఎంత సేపు గడుపుతున్నారనే విషయాన్ని తప్పని సరిగా నమోదు చేయాలంటూ సౌత్‌ సిటి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఓ నియమం తీసుకొచ్చింది. ఇందుకోసం బాత్రూముల్లో ప్రత్యేకంగా ట్యాబ్‌లను ఏర్పాటు చేయనన్నుట్లు పేర్కొంది.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ.. ‘జూలై 1నుంచి ఈ రూల్‌ అమల్లోకి వస్తుంది. మగ పిల్లలు, ఆడ పిల్లల బాత్రూం వెలుపల వేర్వేరు రిజస్టర్లను ఉంచుతాం. విద్యార్థులు బాత్రూంలో ఎంత సేపు గడుపుతున్నారనే అంశం దీనిలో నమోదవుతుంది. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే.. ఆ సమయంలో విద్యార్థులు ఎక్కడ ఉన్నారనే విషయం మాకు సులభంగా తెలుస్తుంది’ అన్నారు. అయితే సదరు పాఠశాల ఇలాంటి నిర్ణియం తీసుకోవడం వెనక ఓ కారణం ఉంది. గత వారం కోల్‌కతాలోని ఓ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని బాత్రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసింది. ఊపిరాడకుండా ముఖానికి ప్లాస్టిక్‌ కవర్‌ కట్టుకుని.. మణికట్టు మీద కోసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఈ నేపథ్యంలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలను నివారించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు స్కూల్‌ ప్రిన్సిపల్‌ తెలిపారు. ఈ కొత్త రూల్‌ వల్ల పాఠశాలల్లో ఆత్మహత్యలను పూర్తిగా కాకపోయినా చాలా వరకూ నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ రూల్‌ వల్ల విద్యార్థులను ప్రతిక్షణం గమనించే అవకాశం ఉంటుందన్నారు. దాంతో పాటు నెలకొకసారి క్లాస్‌ టీచర్‌ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశాన్ని పరిశీలిస్తారని తెలిపారు. ఈ నూతన నియమాల గురించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని.. వారు దీనికి మద్దతిస్తున్నారో లేదో తెలపాలని కోరినట్లు ప్రిన్సిపల్‌ చెప్పారు.

Advertisement
Advertisement