పవార్‌కు మరో పరేషాన్ | Sakshi
Sakshi News home page

పవార్‌కు మరో పరేషాన్

Published Fri, Aug 22 2014 10:17 PM

Maharashtra ACB seeks government nod for probe against Ajit Pawar, Sunil Tatkare

ముంబై: నీటిపారుదల ప్రాజెక్టుల కుంభకోణంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తట్కరే పాత్రపై దర్యాప్తు చేసేందుకు అనుమతించాలని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 12 నీటిపారుదల ప్రాజెక్టుల్లో అజిత్, శరద్ అవినీతికి పాల్పడ్డారని ప్రవీణ్ వటగావ్‌కర్ అనే సామాజిక కార్యకర్త ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, నీటి పారుదలశాఖ మంత్రి సునీల్ తట్కరేతోపాటు కొంకణ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ (కేఐడీసీ)లో పనిచేసే అధికారుల ప్రమేయంపైనా దర్యాప్తు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రవీణ్ ఫిర్యాదును తాము రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన మాట నిజమేనని ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే కంపెనీకి మూడు కంటే ఎక్కువ కాంట్రాక్టులు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారని ఏసీబీకి బుధవారం అందజేసిన ఫిర్యాదులో ప్రవీణ్ పేర్కొన్నారు. పవార్, తట్కరే నీటిపారుదలశాఖ మంత్రులుగా ఉన్నప్పుడే ఈ కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు.

టెండర్ల మంజూరులోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ల డిమాండ్లను అంగీకరించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని తెఇపారు. నిబంధనలను పాటించకుండానే ప్రాజెక్టులు మంజూరు చేశారని తెలిపారు. మాధవ్ చితాలే కమిటీ కూడా అక్రమాలు జరిగినట్టు ధ్రువీకరించిందని ఏసీబీకి తెలిపారు. ఈ విషయమై తట్కరేను విలేకరుల ప్రశ్నించగా, చితాలే కమిటీ తనకు క్లీన్‌చిట్ ఇచ్చిందని, తాను అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. సంబంధిత విభాగాల అనుమతులు తీసుకున్నాకే ప్రాజెక్టుల వ్యయం పెరుగుదల  మొత్తాలను చెల్లించామని సునీల్ తట్కరే ఈ సందర్భంగా వివరణ వచ్చారు.

Advertisement
Advertisement