మెట్రోతో మహానగరం | Sakshi
Sakshi News home page

మెట్రోతో మహానగరం

Published Thu, Aug 21 2014 10:29 PM

metropolitan city with metro projects

సాక్షి ముంబై: మెట్రో రైలుతో నాగపూర్ మెట్రో నగరంగా మారనుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు.  నాగపూర్ మెట్రోరైలు ప్రాజెక్టు, మౌద్ ఎన్టీపీసీ ప్రాజెక్టుతోపాటు ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మాట్లాడుతూ దేశాభివృద్ధికి మౌలిక సదుపాయాలే కీలకమని తెలిపారు. అన్నింటికంటే విద్యుత్ ఉత్పత్తి ముఖ్యమన్నారు. నాగపూర్ నగరంలో మెట్రో రైలు, ఫ్లై ఓవర్ల నిర్మాణంతో ఇక్కడి జనజీవనం మరింత వేగవంతం కానుందని మోడీ అన్నారు. మౌలిక సదుపాయాలు విద్యుత్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయని చెప్పారు.

 పుణేలోనూ మెట్రో ఏర్పాటు చేస్తాం: మంత్రి వెంకయ్య నాయుడు.
 నాగపూర్‌తోపాటు పుణేలోనూ మెట్రో రైలును ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయిడు వెల్లడించారు. నాగపూర్ మెట్రో ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలోపాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ పైవిషయాలు తెలిపారు. అనేక రోజులుగా పెండింగ్‌లో ఉన్న పుణే మెట్రో ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభమవుతుందని ప్రకటించారు.  ముంబైలోనూ ముంబై మెట్రో-3  ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని చెప్పారు.   నాగపూర్ మెట్రో రైలు కోసం రూ. 8,680 కోట్ల వ్యయం కానుందని మంత్రి అన్నారు.

 అభివృద్ధి కోసం అందరు ఒక్కటవ్వాలి...
 రాష్ట్రం, దేశం అభివృద్ధి కోసం అంతా ఒక్కటవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నాగపూర్ మెట్రో, ఎన్టీపీసీ శంకుస్థాపనకు ముఖ్యమంత్రి, ఉప-ముఖ్యమంత్రులు రాకపోవడంపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.  మనమంతా వేరే రాష్ట్రాల ప్రజలమైనా, దేశం ఒక్కటేనని అన్నారు. అభివృద్ధి కోసం అందరం ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు.

 భూమిపుత్రులకు ఉద్యోగాలివ్వాలి :  నితిన్ గడ్కరి.
 అభివృద్ధి ప్రాజెక్టుల కోసం స్థలాలు కోల్పోయిన రైతులకు ఉద్యోగాలు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కోరారు. మౌద్‌లో ఎన్టీపీసీ ప్రాజెక్టు ప్రారంభోత్సవం గడ్కరీ మాట్లాడుతూ అనేక స్థానిక సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లారు. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయనున్నట్టు  పేర్కొన్నారు. విదర్భలోని వెయ్యి పాఠశాలల్లో ఎన్టీపీసీ మరుగుదొడ్లు నిర్మించడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు.

 నల్లజెండాలు ప్రదర్శించిన విదర్భవాదులు...
 నాగపూర్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రత్యేక విదర్భ వాదులు నల్లజెండాలు చూపించి తమ వ్యతిరేకత తెలిపారు. ప్రత్యేక  విదర్భ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ పర్యటనను నిరసిస్తూ నల్లజెండాలు ప్రదర్శించారు. రంగంలోకి పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా స్వల్పస్థాయిలో లాఠీచార్జి జరిగింది.

Advertisement
Advertisement