మరో వారసురాలు వచ్చేసింది.. | Sakshi
Sakshi News home page

మరో వారసురాలు వచ్చేసింది..

Published Fri, Jun 3 2016 6:16 PM

మరో వారసురాలు వచ్చేసింది.. - Sakshi

పట్నా: బిహార్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్‌ లాలు ప్రసాద్ కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. లాలు కుటుంబం నుంచి రాజకీయవారసులుగా వచ్చినట్టుగా, చట్టసభ ప్రతినిధులుగా ఎన్నికైనట్టుగా ఆ రాష్ట్రం నుంచి మరే కుటుంబం నుంచి రాలేదు.

లాలు ప్రసాద్ దాదాపు ఎనిమిదేళ్లు బిహార్ సీఎంగా ఉన్నారు. దాణా కుంభకోణంలో ఆయనపై ఆరోపణలు రావడంతో భార్య రబ్రీదేవిని సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. ఆ తర్వాత లాలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయ్యారు. మధ్యలో కొన్నాళ్లు అధికారానికి దూరమైనా.. గతేడాది జరిగిన బిహార్ ఎన్నికల్లో జేడీయూతో పొత్తుపెట్టుకుని మళ్లీ పూర్వవైభవం సాధించారు. లాలు ఈసారి వారసులను తెరపైకి తెచ్చారు. లాలు పుత్రరత్నాల్లో తేజస్వి  యాదవ్ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కాగా, తేజ్ ప్రతాప్ యాదవ్ రాష్ట్ర మంత్రి అయిన సంగతి తెలిసిందే.

తాజాగా లాలు కుటుంబం నుంచి మరో వారసురాలు చట్టసభకు ఎన్నికయ్యారు. లాలు పెద్ద కూతురు మీసా భారతి ఆర్జేడీ తరపున రాజ్యసభ సభ్యురాలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె ఇంతకుమందే రాజకీయాల్లో అరంగేట్రం చేసినా 2014 లోక్సభ ఎన్నికల్లో నిరాశ ఎదురైంది. పాటలీపుత్ర నియోజవర్గం నుంచి పోటీచేసిన భారతి స్వల్ప తేడాతో ఓడిపోయారు. దీంతో ఆమె లోక్సభ మెట్లు ఎక్కలేకపోయారు. లాలు ఇప్పుడు తన ముద్దుల తనయను రాజ్యసభకు పంపి ఆమె ముచ్చట తీర్చారు. రాజ్యసభ టికెట్ రేసులో స్వయంగా లాలు భార్య రబ్రీదేవి పోటీకి వచ్చినా.. ఆయన కూతురుకే ఓటేశారు. ఈ విషయంలో తేజ్ ప్రతాప్, తేజస్విలు సోదరికే మద్దతుగా నిలిచారు. ఏమైతేనేం లాలు కుటుంబం నుంచి మరొకరు చట్టసభ సభ్యులయ్యారు. మీసా భారతికి 1999లో వివాహమైంది. ఆమె భర్త పేరు శైలేష్ కుమార్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు.

లాలు, ఆయన భార్య, ఇద్దరు కుమారులు, ఇప్పుడు కుమార్తె, వీరితో పాటు బావమరుదులు.. రాజకీయాల్లో లాలూ ఫ్యామిలీయా మాజాకానా..!

Advertisement
Advertisement