నియామకాలపై ఎల్జీకే సర్వాధికారం | Sakshi
Sakshi News home page

నియామకాలపై ఎల్జీకే సర్వాధికారం

Published Sat, May 23 2015 2:02 AM

నియామకాలపై ఎల్జీకే సర్వాధికారం - Sakshi

ఢిల్లీ సీఎంతో సంబంధం లేదన్న కేంద్రం
కేంద్ర పరిధిలోని సర్వీసులపై ఎల్జీదే తుది నిర్ణయం
అవసరమైతేనే సీఎంను సంప్రదిస్తారని నోటిఫికేషన్‌లో వివరణ
ఢిల్లీలో పరోక్ష పాలనకు మోదీ సర్కారు యత్నం: కేజ్రీవాల్


న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) నజీబ్ జంగ్‌కు మధ్య తలెత్తిన విభేదాల పరిష్కారానికి కేంద్రం రంగంలోకి దిగింది. అధికారుల నియామకం విషయంలో సీఎంను ఎల్జీ సంప్రదించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. సేవలు, శాంతిభద్రతలు, పోలీస్, భూముల విషయంలో అవసరమనుకుంటేనే సీఎంతో సంప్రదించి ఎల్జీ తన విచక్షణ ప్రకారం తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. కేంద్ర ఉద్యోగులపై అవినీతి కేసులను ఢిల్లీ ఏసీబీ నమోదు చేయడానికీ వీల్లేదని తెలిపింది. మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సేవలు, ప్రజా భద్రత, పోలీస్, భూముల వ్యవహారాలు ఢిల్లీ అసెంబ్లీ పరిధిలో లేనందున వాటికి సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలూ ఢిల్లీ సర్కారుకు ఉండవని పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈ వ్యవహారాలపై ఎల్జీకే అధికారం ఉంటుందని, అవసరమైతే సీఎం అభిప్రాయాన్ని తెలుసుకుని ఎల్జీ నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది.  కేంద్ర సర్వీసులకు సంబంధించిన ఉద్యోగులు, సంస్థలపై ఢిల్లీ ఏసీబీ అభియోగాలు నమోదు చేయలేదని తెలిపింది. ఇటీవల పలువురు కేంద్ర అధికారులపై అవినీతి కేసులు నమోదైన నేపథ్యంలో ఈ వివరణ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సీనియర్ అధికారి శకుంతలా గామ్లిన్‌ను ఢిల్లీ సర్కారుకు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎల్జీ గత వారం నియమించడంతో వివాదం రేగడం తెలిసిందే. పాలనా వ్యవహారాల్లో ఎల్జీ తలదూర్చుతున్నారని, ఆయనకు ఆ అధికారం లేదని కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరడంతో కేంద్రం వివరణ ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఢిల్లీ సహా దేశంలోని అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒకే కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉంటారని, వీరంతా కేంద్ర హోంశాఖ పరిధిలోనే ఉంటారని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 239, 239ఏఏ ప్రకారం ప్రజా సేవలకు సంబంధించిన కొన్ని వ్యవహారాలు ఢిల్లీ సర్కారు పరిధిలో లేవని పేర్కొంది.
 
అవినీతి పరులను కాపాడేందుకే: కేజ్రీ
కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌పై సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. అవినీతిపరులను కాపాడేందుకు కేంద్రం వెనకాల నుంచి ఢిల్లీని నడిపించాలని చూస్తోందని ధ్వజమెత్తారు. కేంద్రం పరోక్ష పాలనకు యత్నిస్తోందని ఆరోపించారు. ఎల్జీకి మద్దతు పలుకుతూ ఇచ్చిన నోటిఫికేషన్‌తో ఢిల్లీ ప్రజలకు కేంద్రం వెన్నుపోటు పొడిచిందన్నారు. అవినీతి నిరోధానికి తన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో బీజేపీకి, కేంద్రానికి ముచ్చెమటలు పడుతున్నాయని, అందుకు ఈ నోటిఫికేషనే నిదర్శనమని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ప్రధాని కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలనే ఎల్జీ నజీబ్ జంగ్ పాటిస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ రాణి ఇక్కడి వైస్రాయ్‌కి ఆదేశాలు ఇచ్చేవారని, ఇప్పుడు వైస్రాయ్‌గా ఎల్జీ, రాణిగా పీఎంవో పనిచేస్తోందని వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడినా తమ ఏసీబీ చూస్తూ ఊరుకోవాలన్నదే కేంద్రం ఉద్దేశమని, నోటిఫికేషన్ చివర్లో ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని సీఎం అన్నారు. నోటిఫికేషన్‌పై రాజ్యాంగ నిపుణులను సంప్రదించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. అధికారుల పోస్టింగ్‌లు, బదిలీల్లో చాలా డబ్బు చేతులు మారుతుందని, ఈ అవినీతిని ఆప్ ప్రభుత్వం అడ్డుకోవడం వల్లే కేంద్రం ఈ చర్యలకు పాల్పడుతోందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ధ్వజమెత్తారు.

తమ అధికారులనే నియమించుకుని, తమ వారికే కాంట్రాక్టులు ఇప్పించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్‌లు చూస్తున్నాయని మండిపడ్డారు. మరోవైపు అధికారుల పోస్టింగులు, బదిలీలపై ముఖ్యమంత్రికి అధికారం లేదనడం ప్రజా తీర్పునకు వ్యతిరేకమని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఈ విషయంలో కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ను తప్పుబట్టింది. సీపీఎం కూడా ఆప్ సర్కారుకు మద్దతుగా నిలిచింది. కేంద్రం సహకార సమాఖ్య విధానాన్ని అనుసరించాలని, అధికార కేంద్రీకరణ తగదని హితవు పలికింది. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ర్ట హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement