వారిని వారే ఎలా నియమించుకుంటారు? | Sakshi
Sakshi News home page

వారిని వారే ఎలా నియమించుకుంటారు?

Published Thu, Apr 30 2015 12:52 AM

వారిని వారే ఎలా నియమించుకుంటారు?

జడ్జీల నియామకాలపై రాజ్యసభలో ఎంపీల ప్రశ్న
ఎన్‌జేఏసీపై శాసన న్యాయవ్యవస్థల మధ్య ముదురుతున్న వివాదం

 
న్యూఢిల్లీ: జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టం(ఎన్‌జేఏసీ)పై న్యాయ వ్యవస్థ అనుసరిస్తున్న తీరును రాజ్యసభలో ఎంపీలు తీవ్రంగా తప్పుపట్టారు. న్యాయమూర్తులు వాళ్లను వారే ఎలా నియమించుకుంటారని ప్రశ్నించారు. శాసన న్యాయ మంత్రిత్వశాఖల పనితీరుపై రాజ్యసభలో జరిగిన చర్చలో సభ్యులు మాట్లాడుతూ శాసన వ్యవస్థ పనితీరులో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించుకునే అధికారాన్ని ఇస్తే.. తమ అన్నాచెల్లెళ్లను, సంతానాన్ని.. మనవలను కూడా వారసత్వంగా నియమించుకుంటూ పోతారని సభ్యులు అభిప్రాయపడ్డారు.


శాసన కార్యనిర్వాహక వ్యవస్థల్లో ఇలా నియమించుకునే అధికారాలు కానీ, హక్కులు కానీ లేవని.. న్యాయవ్యవస్థకు మాత్రం మినహాయింపు ఎందుకని ప్రశ్నించారు. ఎన్‌జేఏసీని అమలు చేసే విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేయరాదని రాజ్యాంగంలో పార్లమెంటే అన్ని వ్యవస్థల్లోనూ సుప్రీం అని కాంగ్రెస్ సభ్యుడు సుదర్శన నాచియప్పన్ అన్నారు. గత 15 సంవత్సరాలలో న్యాయవ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థను వివిధ అంశాలలో నియంత్రించే ప్రయత్నం చేస్తూ వస్తోందని సమాజ్‌వాదీ పార్టీ అభిప్రాయపడింది. ఆరుగురు సభ్యుల ఎన్‌జేఏసీ పానెల్ సభ్యుల నియామకాన్ని ఖరారు చేసే త్రిసభ్య కమిటీ సమావేశానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాననటంపై కూడా రాజ్యసభలో విమర్శలు వచ్చాయి. న్యాయవ్యవస్థలో సంస్కరణలు తీసుకురావలసిన అవసరాన్ని సీపీఎం ప్రస్తావించింది.


ఎన్డీఏ రాజకీయం చేస్తోంది: రాం జెఠ్మలానీ
ఎన్‌జేఏసీ చట్టాన్ని ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ తీవ్రంగా విమర్శించారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై ఎన్డీఏ ప్రభుత్వం రాజీపడుతోందని, న్యాయ నియామకాలను రాజకీయం చేయాలని చూస్తోందని ఆయన సుప్రీం కోర్టులో వాదించారు. ఎన్‌జేఏసీలో కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రాతినిథ్యం న్యాయమూర్తుల నియామకంలో రాజకీయ జోక్యానికి నిదర్శనమన్నారు. రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్నే ఈ చట్టం దెబ్బతీస్తోందని ఆరోపించారు.

Advertisement
Advertisement