గోమూత్రం, గోమయంతో నాగా సాధువుల హోలీ | Sakshi
Sakshi News home page

గోమూత్రం, గోమయంతో నాగా సాధువుల హోలీ

Published Sat, Mar 26 2016 12:02 PM

గోమూత్రం, గోమయంతో నాగా సాధువుల హోలీ

హోలీని ఒక్కొక్కరు ఒక్కోలా జరుపుకొంటున్నారు. ఉజ్జయినిలోని అఖాడాలకు చెందిన నాగా సాధువులు గోమూత్రం, గోమయాలతో ఈ పండుగను జరుపుకొన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. శైవ, వైష్ణవ సాధువులు గో మూత్రాన్ని, గోమయాన్ని కలిపి వాటిని ఒకరిపై ఒకరు పోసుకున్నారు. ఆ సమయంలో ఆధ్యాత్మిక నినాదాలు చేసుకున్నట్లు ఆలిండియా అఖాడా పరిషత్ సభ్యులు తెలిపారు. ఏప్రిల్ 22 నుంచి సింహస్త ఉత్సవం ప్రారంభం కానుంది. దాంతో ఇప్పటికే భారీ సంఖ్యలో సాధువులు ఉజ్జయినికి చేరుకున్నారు. ఆవుపేడ అత్యంత పవిత్రమైనదని, అది కృష్ణుడికి కూడా ఇష్టమని అఖిల భారతీయ అఖాడా పరిషత్ (ఏబీఏపీ) అద్యక్షుడు మహంత్ నరేంద్రగిరి చెప్పారు.

సాధువులు వివిధ కార్యక్రమాలలో గోమూత్రం, గోమయాలను ఉపయోగిస్తూనే ఉన్నారన్నారు. దేశంలోని 13 అఖాడాలతో కూడిన అఖాడా పరిషత్‌కు నిరంజనీ అఖాడాకు చెందిన మహంత్ నరేంద్రగిరి అధ్యక్షత వహిస్తున్నారు. కుంభమేళా సమయంలో కూడా సాధువులు గోమయాన్ని, మూత్రాన్ని ఉపయోగించి గణేశుడి ఆశీస్సులు తీసుకుంటారని జూనా అఖాడాకు చెందిన మహంత్ హరిగిరి చెప్పారు. అన్ని సందర్భాల్లోనూ దేవుడి విగ్రహాలను ఉపయోగించలేమని, అందువల్ల కొన్నిసార్లు గోమయాన్ని గణేశుడికి ప్రతిరూపంగా భావిస్తారని ఆయన తెలిపారు. ఇక గోమయంతో కలిసిన గోమూత్రం మంచి మందు అని, ఇది యాంటీసెప్టిక్‌గాను, ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఉపయోగపడుతుందని మహంత్ రాజేంద్ర దాస్ జీ అన్నారు.

Advertisement
Advertisement