కొత్త ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్‌ | Sakshi
Sakshi News home page

కొత్త ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్‌

Published Mon, May 20 2019 5:50 PM

New Govt Must Face Economic Problems - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో రేపు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రపథమంగా ముందుండేది అస్తవ్యస్థంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడం. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు కొలమానంపై కొనసాగుతున్న వివాదాన్ని పక్కన పెడితే జడీపీ పెరగడానికి తగ్గడానికి ప్రధాన కారణమైన ఆటోమొబైల్‌ రంగంలో గత ఆరు నెలలుగా అమ్మకాలు పడిపోవడం దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే అంశం. గత ఆరు నెలలుగా దేశంలో ప్రయాణికుల కార్లు, వాణిజ్య వాహనాలే కాకుండా చివరకు ద్విచక్ర వాహనాల అమ్మకాలు పడిపోయాయి. 2019 సంవత్సరంలో దాదాపు పది శాతం అమ్మకాలు పడిపోతున్నట్లు అంచనాలు తెలియజేస్తున్నాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు కూడా భారీగా పడిపోవడం అనేది మరో విషాదకర పరిణామం.

దేశంలో వ్యాపార లావాదేవీలు సజావుగా లేదా ముమ్మరంగా కొనసాగుతుంటే వాణిజ్య వాహనాల అమ్మకాలు పెరుగుతుంటాయి. ఈ వాహనాల అమ్మకాలు పడిపోయాయంటే దేశంలో వ్యాపార రంగం కూడా వెనకబడినట్లే. భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ఆటోమొబైల్‌ రంగం వెన్నెముక లాంటిది. ఈ రంగంలో ఉపయోగించే ప్లాస్టిక్, రబ్బర్, లెదర్, కాంపోజిట్స్, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లకు కూడా ఎంతో గిరాకీ పెరుగుతుంది. దీని సర్వీసు, రిపేరు, నిర్వహణా రంగాల్లో ఈ రంగం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. అలాగే ఈ రంగంపైనే ప్రధానంగా ఆధారపడి అడ్వర్‌టైజ్‌మెంట్‌ విభాగాలు ఎన్నో బతుకుతున్నాయి.

పన్నుల రెవెన్యూ తగ్గిందీ
2018లో వేసిన అంచనాలకన్నా, 2019లో వేసిన సవరించిన అంచనాలకన్నా పన్ను రెవెన్యూ బాగా తగ్గింది. ఫలితంగా కేంద్ర ద్రవ్యలోటు దాదాపు ఎనిమిదిన్నర లక్షల కోట్లకు చేరుకుంది. 2019, ఫిబ్రవరిలో సవరించిన అంచనాల కన్నా 33 శాతం ఎక్కువ. కొత్త జీడీపీ కొలమానం ప్రకారం కూడా జీడీపీలో ద్రవ్యలోటు 4.5 శాతం. ఈ లోటు 3.4 శాతానికి పెరగకూడదన్నది టార్గెట్‌. దేశం నుంచి సరకుల ఎగుమతి టార్గెట్‌ 35,000 డాలర్లుకాగా, 33 వేల డాలర్ల ఎగుమతులను మాత్రమే చేయగలిగింది. జీఎస్టీలో ఉన్న లోపాల కారణంగానే ఎగుమతులకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయామని వ్యాపార వర్గాలు తెలియజేశాయి.

వెనకబడిన డిజిటల్‌ ఇండియా
సాంకేతికంగా ఎంతగానో అభివృద్ధి చెందిన భారత్‌లో డిజిటలైజేషన్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ఆశించిన విజయాన్ని సాధించలేక పోయారు. నల్లడబ్బును అరికట్టడంతోపాటు భారత్‌ను పూర్తిగా డిజిటలైజేషన్‌ చేయవచ్చనే సత్సంకల్పంతో నరేంద్ర మోదీ 2016లో పెద్ద నోట్ల రద్దు చేసిన విషయం తెల్సిందే. దీనివల్ల వంద మందికిపైగా సామాన్యులు మరణించడమే కాకుండా డిజిటలైజేషన్‌కు అది ఏమాత్రం తోడ్పడలేదు. పైగా 2016, నవంబర్‌ నుంచి ఇప్పటికీ నగదు లావాదీవీలు 22 శాతం పెరిగాయి. దేశంలో నిరుద్యోగ సమస్య కూడా 6.1 శాతంతో గత 49 ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకుంది. పలు కారణాల వల్ల భారత్‌లో జీడీపీ వృద్ధిరేటు గణనీయంగా పడిపోతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఇటీవలనే హెచ్చరించింది. అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వం అత్యవసరంగా దేశ ఆర్థిక వ్యవస్థపై దృష్టిని సారించకపోతే పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదం ఉంది.

Advertisement
Advertisement