గోరక్షకులను కాపాడాల్సిన పనిలేదు | Sakshi
Sakshi News home page

గోరక్షకులను కాపాడాల్సిన పనిలేదు

Published Sat, Jul 22 2017 1:50 AM

గోరక్షకులను కాపాడాల్సిన పనిలేదు - Sakshi

కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచన
న్యూఢిల్లీ: గోరక్ష పేరుతో జరుగుతున్న దారుణ ఘటనలపై సుప్రీంకోర్టు మండిపడింది. చట్టాన్ని ఏ రూపంలో అతిక్రమించినా అలాంటివారిని కాపాడాల్సిన పనిలేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. శాంతిభద్రతల వ్యవస్థ రాష్ట్రాల పరిధిలోకి వస్తున్నందున రాష్ట్రాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరింది. గోరక్ష పేరుతో హింసను సహించేది లేదని ఇటీవలే పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయాన్ని సొలిసిటర్‌ జనరల్‌ రంజిత్‌ కుమార్‌ కోర్టుకు గుర్తుచేశారు. ‘శాంతి భద్రతలు రాష్ట్రాలకు సంబంధించిన విషయం. ఇందులో కేంద్రానికి సంబంధం లేదు.

అయినా ఎటువంటి దాడులనైనా సహించబోమని కేంద్రం స్పష్టం చేసింది’ అని ఎస్‌జీ తెలిపారు. గుజరాత్, జార్ఖండ్‌ రాష్ట్రాల ప్రతినిధులు కోర్టుకు సమాధానమిస్తూ.. తమ వద్ద జరిగిన కేసులపై విచారణ జరుపుతున్నామని.. ఘటనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని ధర్మాసనానికి తెలిపారు. పలుచోట్ల బాధితులకు పరిహారం కూడా అందినట్లు వెల్లడించారు. కేంద్రంతోపాటుగా పలు రాష్ట్రాలు పిటిషన్‌కు సమాధానం ఇవ్వలేదని గోరక్ష దాడులపై పిటిషనర్‌ల తరపు వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది సంజయ్‌ హెగ్డే తెలిపారు. అయితే.. సెప్టెంబర్‌ 6 లోగా కేంద్రం, ఆయా రాష్ట్రాలు సవివరమైన సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

Advertisement
Advertisement