పోలీసులుకాబోయి మావోయిస్టులైతే.... | Sakshi
Sakshi News home page

పోలీసులుకాబోయి మావోయిస్టులైతే....

Published Mon, Mar 16 2015 2:16 PM

పోలీసులుకాబోయి మావోయిస్టులైతే.... - Sakshi

రాంచి: పోలీసులు కావాలనుకొని మావోయిస్టులైతే...శాంతి భద్రతల పరిరక్షణ కోసం తుపాకులు పట్టుకోవాల్సినవారే వాటికి విఘాతం కలిగించేందుకు తుపాకులు పట్టుకొంటే ఆ పరిణామాలు ఎలా ఉంటాయి? జార్ఖండ్ సాయుధ పోలీసు (జేఏపీ) దళంలో చేరాలనుకొని నాలుగేళ్ల క్రితం పరీక్షలు రాసి వాటి ఫలితాలు ఇప్పటికీరాక విసిగి వేసారిన నిరుద్యోగ అభ్యర్థులు మావోయిస్టులుగా మారిపోతామని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తుపాకులు పట్టుకుంటామని హెచ్చరిస్తున్నారు.


 జార్ఖండ్ ఆర్మ్‌డ్ పోలీసులోని తొమ్మిది బటాలియన్లలోని మొత్తం 1020 ఖాళీ పోస్టులకు 2011 సంవత్సరంలో పరీక్షలు జరిగాయి. మొదటి రెండు ప్రాథమిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను పిలిచి ఫైనల్ పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే ఇప్పటి వరకు ఆ పరీక్షల ఫలితాలను నేటి వరకు వెలువరించలేదు. అభ్యర్థులు హైకోర్టుకెళ్లగా వెంటనే ఫలితాలను వెల్లడించాల్సిందిగా కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. వారు పోలీసు ఉన్నతాధికారులను, ప్రభుత్వాధికారులను ఎవరిని కలుసుకున్న ఎవరూ ఎలాంటి సాయం చేయలేక పోయారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువర్ దాస్‌ను కలుసుకునేందుకు వారు గత నాలుగు రోజులుగా ప్రయత్నిస్తున్న వారికి ఆయన దర్శన భాగ్యం కలగలేదు. దాంతోవారు ఆదివారం నాడు రాంచీలోని పోలీసు అదనపు డెరైక్టర్ జనరల్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ఇక తాము ఆత్మాహుతికి పాల్పడడమో, మావోయిస్టుల్లో చేరిపోవడమో తప్ప మరో మార్గం లేదని వారు వాపోతున్నారు.


 ‘నేను ఓ చిన్న దుకాణంలో పని చేస్తున్నాను. నెలకు మూడువేల రూపాయలిస్తారు. నా తండ్రికి గుండె జబ్బు. తల్లి శ్వాసకోస వ్యాధితో బాధ పడుతోంది. నాకొచ్చే డబ్బు వారి మందులకే సరిపోతాయి. డబ్బులేక పస్తులుండే రోజులెన్నో’ అని ఓ అభ్యర్థి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘నా సంపాదన అంతంత మాత్రమే. చెల్లి పెళ్లి చేయాలి. చేతిలో చిల్లిగవ్వా లేదు. మా అందరి పరిస్థితి దాదాపు ఒకేలా ఉంది. పోలీసు ఉద్యోగం పట్ల మాకున్న ఆశలన్నీ అడుగంటుతున్నాయి. మావోయిస్టుల్లో చేరి తుపాకులు పట్టుకోవాలనే ఆలోచనలు రేగుతున్నాయి’ అని ధన్‌బాద్ నుంచి వచ్చిన మరో అభ్యర్థి వ్యాఖ్యానించారు. ఈ విషయమై పోలీసు ఏడీజీ కమల్ నారాయణ్ చౌబేను మీడియా ప్రతినిధులు కలిసి వివరణ కోరగా, అభ్యర్థుల ఎంపికకు ముగ్గురు సీనియర్ అధికారులతో మూడు స్క్రీనింగ్ క మిటీలు వేశామని, అందులో ఓ కమిటీకి నాయకత్వం వహిస్తున్న అమర్‌జిత్ బలిహార్ మావోల కాల్పుల్లో మరణించాడని, దాంతో ఆ కమిటీ పని అర్ధాంతరంగా నిలిచిపోవడమే ఆలస్యానికి కారణమని ఆయన చెప్పారు.

Advertisement
Advertisement