ఢిల్లీలో రాష్ట్రపతి పాలన! | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో రాష్ట్రపతి పాలన!

Published Tue, Dec 17 2013 1:25 AM

President rule in Delhi!

ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించాలని సిఫారసు చేస్తూ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సోమవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివేదిక పంపించారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీముందుకురాకపోవడంతో రాష్ట్రపతి పాలన అనివార్యమవుతోందని ఆయన అందులో పేర్కొన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి కేంద్ర పాలన విధించాలని కూడా జంగ్ అందులో సూచించారని అధికార వర్గాలు తెలిపాయి. మరో రెండు రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ ముందుకురాని పక్షంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయని వెల్లడించాయి.

కొన్ని ప్రత్యామ్నాయాలను సూచిస్తూ గవర్నర్ నివేదికను పంపించారని, దానిని న్యాయపరంగా పరిశీలిస్తున్నామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే వెల్లడించారు. అయితే, ఆ నివేదికలోని అంశాలను మాత్రం ఆయన బహిర్గతం చేయలేదు. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడం, మద్దతిచ్చేందుకు ముందుకొచ్చిన కాంగ్రెస్‌తో పాటు బీజేపీకీ రెండో అతిపెద్ద పార్టీ అయిన ఆమ్‌ఆద్మీ పార్టీ(ఏఏపీ) షరతులు విధించడం తెలిసిందే. దాంతోపాటు తుది నిర్ణయం తీసుకునేందుకు ఏఏపీ నేత కేజ్రీవాల్ గడవు కోరిన విషయం కూడా తెలిసిందే.

 అన్ని షరతులకు ఓకే.. కాంగ్రెస్: మద్దతు తీసుకునేముందు వీటిపై స్పష్టత ఇవ్వాలంటూ ఏఏపీ పేర్కొన్న 18 అంశాలపై కాంగ్రెస్ స్పందించింది. వాటిలోని 16 అంశాలు కేవలం పరిపాలన పరమైన నిర్ణయాలని, వాటికి చట్టసభలతో సంబంధం లేదని పేర్కొంది. అలాగే, ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా, దృఢమైన లోకాయుక్త.. ఈ రెండు అంశాలపై సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు సిద్ధమేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ ఢిల్లీ వ్యవహారాల ఇన్‌చార్జ్ షకీల్ అహ్మద్ స్పష్టం చేశారు. కాగా, కాంగ్రెస్ స్పందనపై చర్చించేందుకు మంగళవారం సమావేశమవుతున్నామని, ఆ తరువాత భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తామని ఏఏపీ నేత మనీశ్ సిసోడియా  తెలిపారు. ఢిల్లీలోని 270  మున్సిపల్ వార్డుల్లో ప్రజలతో సమావేశాలు నిర్వహించి, వారి అభిప్రాయాల ప్రకారం ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
 

Advertisement
Advertisement