ఫోర్బ్స్‌ టాప్‌ టెన్‌లో ప్రధాని మోదీ  | Sakshi
Sakshi News home page

ఫోర్బ్స్‌ టాప్‌ టెన్‌లో ప్రధాని మోదీ 

Published Wed, May 9 2018 11:19 PM

Prime Minister Narendra Modi Got Tenth Position In Forbes List - Sakshi

న్యూయార్క్‌ : ప్రపంచంలోని అత్యంత శక్తిమంతులైన వ్యక్తుల జాబితా– 2018ను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. 75 మందితో కూడిన ఈ జాబితాలో చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ మొదటి స్థానం దక్కించుకోగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ 9వ స్థానంలో నిలిచారు. వివిధ రంగాల నుంచి శక్తిమంతులైన వ్యక్తుల జాబితా రూపొందించడానికి నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు ఫోర్బ్స్‌ పత్రిక వెల్లడించింది.

ఎక్కువ మంది వ్యక్తులకు ప్రాతినిథ్యం వహించే దక్షత కలిగి ఉండటం, ఆర్థిక వనరులను నియంత్రించగలగడం, భిన్న రంగాలలో తమ ముద్ర వేయగలగడం, అధికారాన్ని చురుగ్గా వినియోగించుకోగలగడం వంటి అంశాల ఆధారంగా 75 మంది వ్యక్తులను ఎంపిక చేసినట్లు పేర్కొంది. భూగ్రహం మీద 7.5 బిలియన్ల జనాభా ఉందని.. తమ సామర్థ్యంతో ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఉన్న 75 మంది(మహిళలు, పురుషులు కలిపి)ని ఎంపిక చేశామని ఫోర్బ్స్‌ తెలిపింది. ఈ జాబితా సిద్ధం చేయడానికి 10 కోట్ల మందికి ఒకరి చొప్పున ఎంపిక చేశామని పేర్కొంది. 

ఆయన ప్రపంచ నాయకుడు.. 
భారత ప్రధానిగా ఎన్నికైన తర్వాత మోదీ ప్రపంచ నాయకుడిగా ఎదిగారని ఫోర్బ్స్‌ ప్రశంసించింది. డొనాల్డ్‌ ట్రంప్, జిన్‌ పింగ్‌తో జరిపిన చర్చల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడింది. అంతర్జాతీయ అంశాల్లో మోదీ కీలక వ్యక్తిగా మారారని, తన దేశంలోని గ్రామీణ ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు ప్రవేశ పెట్టారని మెచ్చుకుంది.

2016లో నోట్ల రద్దు ద్వారా గుణాత్మక మార్పులు చేపట్టి, అవినీతిని తొలగించేందుకు సాహసోపేతమైన నిర్ణయాన్ని మోదీ తీసుకున్నారని పేర్కొంది. కాగా ‘జియో’తో టెలికాం రంగంలో సంచలన మార్పులు తీసుకువచ్చిన  భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీ ఈ జాబితాలో 32వ స్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల 40వ స్థానాన్ని దక్కించుకున్నారు.  

Advertisement
Advertisement