ములా, ముఠా నదులకు మహర్దశ | Sakshi
Sakshi News home page

ములా, ముఠా నదులకు మహర్దశ

Published Tue, Aug 19 2014 10:37 PM

pune corporation started modernization of mula river,mutha river  works

పింప్రి, న్యూస్‌లైన్ :  ములా, ముఠా నదులకు మహర్దశ పట్టనుంది. పుణే నగరం నడిబొడ్డున మురికి కాలువలుగా మారిన ఈ నదుల ఆధునికీకరణకు పుణే కార్పొరేషన్ నడుంబిగించింది. ఇందుకోసం 715 కోట్ల రూపాయల వ్యయంతో ప్రణాళికను సిద్ధం చేసింది.  మురికి నీటి కాలువలుగా పారుతున్న ఈ రెండు నదుల రూపురేఖలు మారనున్నాయి.

 నిధుల సమీకరణ ఇలా..
 ఇందుకు అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేషనల్ రివర్ కన్జర్వేషన్ డెరైక్టరేట్ (ఎన్‌ఆర్‌సీడీ)కు నివేదించింది. ఈ ప్రణాళిక రూపుదిద్దుకోవడానికి కేంద్రం 50 శాతం నిధులు, 30 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం, 20 శాతం నిధులను పూణే కార్పొరేషన్ సమకూర్చాల్సి ఉంది.

 కానీ రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడంతో రాష్ట్ర ప్రభుత్వ వాటాను  పుణే కార్పోరేషన్ సమకూర్చుకుంటుంది. ఈ విషయాన్ని కేంద్రానికి పంపిన నివేదికలో స్పష్టం చేసింది.

 25న జాయ్‌కో కంపెనీ సర్వే
 ఈ నిధుల మంజూరుకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం జపాన్‌కు చెందిన జాయ్‌కో కంపెనీకి పంపించింది. మొత్తం నిధుల్లో 85 శాతం నిధులను ఇవ్వడానికి ఆ కంపెనీ సిద్ధమైందని కార్పొరేషన్‌కు చెందిన అధికారి పేర్కొన్నారు. దీనికి సంబంధించి నదుల పరిసరాలను సర్వేను జరపడానికి కంపెనీకి  చెందిన ఏడుగురు ప్రతినిధుల బృందం ఈ నెల 25వ తేదీన నగరానికి రానున్నారని తెలిపారు. అనంతరం నిధులను అందించే విషయంపై ఆ కంపెనీ తుది నిర్ణయం తీసుకొంటుంది. వచ్చే సంవత్సరం మార్చి నుంచి నదుల ఆధునికీకరణ పనులు జరుగనున్నాయని తెలిపారు.

Advertisement
Advertisement