ప్రయాణికులారా మీకిది తెలుసా..? | Sakshi
Sakshi News home page

ప్రయాణికులారా మీకిది తెలుసా..?

Published Thu, Nov 24 2016 6:43 PM

ప్రయాణికులారా మీకిది తెలుసా..?

న్యూఢిల్లీ: ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులకు బీమా సౌకర్యం ఎంత బాగా పనికొస్తుందో తెలియనిదికాదు. మొన్న ఆదివారంనాడు ఇండోర్ పట్నా ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో 148మంది మరణించడం, 200 మంది గాయపడడం తెలిసిందే. పాపం వారిలో ఎక్కువ మందికి రైల్వే ఈ టికెట్‌ బీమా సౌకర్యం లేదు. ఉండి ఉంటే వారిలో మరణించిన వారికి పది లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి ఏడున్నర లక్షల రూపాయల వరకు బీమా సొమ్ము వచ్చేది. చెల్లించక పోవడానికి బీమా సొమ్ము ఎక్కువని కాదు. ఆ బీమా పొందేందుకు చెల్లించాల్సింది కేవలం 92 పైసలే. మరి వారెందుకు అద్భుతమైన ఈ బీమా సౌకర్యాన్ని ఉపయోగించుకోలేదు?

ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ కార్పొరేషన్, టూరిజం కార్పొరేషన్లు సంయుక్తంగా సెప్టెంబర్‌ ఒకటవ తేదీ నుంచి ఈ బీమా సౌకర్యాన్ని ప్రవేశపెట్టాయి. ఇది కేవలం ఈ టికెట్‌ బుకింగ్‌కు మాత్రమే వర్తిస్తుంది. బీమా సౌకర్యం ఎంచుకోవడం, ఎంచుకోకపోవడం ప్రయాణికుడిని ఇష్టానికే వదిలేశారు. ఎంచుకున్నట్లయితే ఒక్క టిక్కెట్‌ మీద 92 పైసలను బీమా కింద తీసుకుంటారు. ఈ స్కీమ్‌ కింద ప్రమాదాల్లో ప్రయాణికుడు మరణించినా, శాశ్వతంగా పూర్తిగా దివ్యాంగుడైన పది లక్షల రూపాయలను, శాశ్వతంగా పాక్షికంగా దివ్యాంగుడైతే ఏడున్నర లక్షల రూపాయలను, గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందితే వాటి ఖర్చుల కింద రెండు లక్షల రూపాయలను చెల్లిస్తారు. మృతదేహం తరలింపునకు మరో పదివేల రూపాయలు అదనంగా చెల్లిస్తారు.

ఈ స్కీమ్‌ను కేవలం రైలు ప్రమాదాలకు మాత్రమే పరిమితం చేయలేదు. టెర్రరిస్టులు దాడి జరిపినా, రైళ్లలో అల్లర్లు చెలరేగినా, దోపీడీలు జరిగినా, కాల్పుల సంఘటనలు తలెత్తినా, రైలులోనుంచి పడిపోయినా బాధితులకు బీమా డబ్బులు చెల్లిస్తారు. 1989 రైల్వే చట్టంలోని 123,124,124ఏ సెక్షన్ల కింద రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్‌ ప్రవేశపెట్టిన ఈ స్కీమ్‌లో ఐసీఐసీ లాంబర్డ్, రాయల్‌ సుందరమ్, శ్రీరామ్‌ జనరల్‌ బీమా పార్ట్‌నర్లుగా కొనసాగుతున్నారు. ప్రయాణికుల్లో ఈ టికెట్‌ బుకింగ్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ స్కీమ్‌ను ఎంచుకుంటే సహజంగా రైల్వే శాఖ నుంచి వచ్చే నష్టపరిహారం రాదు. అదెంత వస్తుందంటే చనిపోయినా లేదా  శాశ్వతంగా పూర్తి దైవంగులైతే నాలుగు లక్షల రూపాయలు వస్తాయి. గాయాలతో ఆస్పత్రి పాలైతే కేవలం 35 వేల రూపాయలు మాత్రమే వస్తాయి.

దేశంలో రైళ్లలో రోజుకు పది లక్షల మంది ప్రయాణికులు ఈ టిక్కెట్లు తీసుకుంటుండగా, వారిలో కేవలం 3.5 లక్షల మంది మాత్రమే బీమా తీసుకుంటున్నారు. అంటే 65శాతం ప్రయాణికులు ఈ బీమాను తీసుకోవడం లేదు. కేవలం 92 పైసలకే పది లక్షల రూపాయల బీమా వస్తుందన్నా ఎందుకు ప్రయాణికులు ఈ స్కీమ్‌ను ఎంచుకోవడం లేదు? తెలియకనా, అవగాహనా రాహిత్యమా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్న ప్రశ్నలు తలెత్తక మానవు.

మొబైల్‌ ఈ బుకింగ్‌ యాప్‌లో బీమాను ఎంచుకునే సౌకర్యం లేక పోవడము ఒక కారణమైతే, టిక్కెట్‌ ఏజెంట్లు దొంగ పేర్లు, తప్పుడు చిరునామాలతో టిక్కెట్లు బుక్‌ చేస్తారు కనుక వారు బీమా సౌకర్యాన్ని కోరరని రైల్వే ఉన్నతాధికారులు, ఏజెంట్లు చెబుతున్నారు. ప్రజలకు అవగాహన లేకపోవడమూ కూడా మరో కారణమని వారంటున్నారు. ఈ బీమా సౌకర్యాన్ని కోరుకునే ప్రయాణికులు నిజమైన చిరునామా, మొబైల్‌ నెంబర్, ఈమెయిల్‌ అడ్రస్, పాన్‌ నెంబర్‌ తప్పనిసరిగా పేర్కొనాలి. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో నాలుగు నెలల్లోపే బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలి. 15 రోజుల్లోనే బీమా సొమ్ము చెల్లిస్తారు.

Advertisement
Advertisement