ఇక రైళ్లలో 25 రకాల టీలు! | Sakshi
Sakshi News home page

ఇక రైళ్లలో 25 రకాల టీలు!

Published Tue, Feb 9 2016 10:43 AM

ఇక రైళ్లలో 25 రకాల టీలు!

పొద్దున్నే టీ తాగకపోతే చాలా మందికి భలే ఇబ్బందిగా ఉంటుంది. అదే రైళ్లలో దూర ప్రయాణాలు చేస్తుంటే మరింత ఇబ్బంది. రైల్లో వెండర్లు తెచ్చే టీ తాగలేక.. సరైన టీ పడకపోతే ఇబ్బంది పడలేక.. మధ్యలో నలిగిపోతుంటారు. ఇలాంటి సమస్యలను పరిష్కరిచేందుకు కొత్తగా 25 రకాల టీలను ప్రయాణికులకు అందించేందుకు ఐఆర్‌సీటీసీ ముందుకొస్తోంది. దేశంలో ఉన్న సుమారు 12వేల మార్గాల్లో ఈ 25 రకాల టీలను అందిస్తారు.

అందులో దేశీ చాయ్ దగ్గర్నుంచి ఆమ్ పాపడ్ చాయ్, హరీ మిర్చి చాయ్, కుల్హడ్ చాయ్, అదరక్ తులసీ చాయ్, హనీ జింజర్ లెమన్.. ఇలా అనేక రకాలు ఉంటాయట. వీటిలో తమకు నచ్చిన టీని ఆర్డర్ చేసేందుకు వీలుగా ఒక మొబైల్ యాప్‌ను కూడా ఐఆర్‌సీటీసీ ప్రారంభించింది. రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు వేడివేడి టీ అలా నోటికి తగిలితే ఆ రుచే అద్భుతంగా ఉంటుందని, అందుకే 'చాయోస్' అనే టీ కేఫ్ చైన్‌తో కలిసి ఈ 25 రకాల టీలను అందిస్తామని ఐఆర్‌సీటీసీ చైర్మన్ అరుణ్ కుమార్ మనోచా చెప్పారు. అంతే కాదు.. రూ. 300కు పైగా విలువ చేసే ఆర్డర్లు ఈ-కేటరింగ్‌లో ఇస్తే, వాళ్లకు 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ప్రకటిస్తున్నామని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement