షిర్డీసాయి సన్నిధిలో ఘనంగా గురుపౌర్ణమి | Sakshi
Sakshi News home page

షిర్డీసాయి సన్నిధిలో ఘనంగా గురుపౌర్ణమి

Published Sat, Jul 12 2014 11:09 PM

షిర్డీసాయి సన్నిధిలో ఘనంగా గురుపౌర్ణమి

 సాక్షి ముంబై: షిర్డీలో గురుపౌర్ణమి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. షిర్డీ సాయిబాబా సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా శనివారం పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంతోపాటు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు సాయిబాబాను దర్శించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడం తో షిర్డీ పురవిధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి.

మందిరాన్ని కూడా రకరకాల పుష్పాలు, కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో అలంకరించారు. గురుపౌర్ణిమను పురస్కరించుకుని సోమవారం ‘శ్రీసాయి సచ్ఛరిత్ర’  పవిత్ర గ్రంథం అఖండ పారాయణం ముగిసింది. ఈ సందర్భంగా శ్రీసాయి చిత్రపటం, పోతిని ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో సాయిబాబా సంస్థాన్ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశికాంత్ కులకర్ణి ‘పోతి’ (ధాన్యం సంచి), మందిరం ఈఓ కుందన్  కుమార్ సోనవణే, డిప్యూటి ఈఓ అప్పాసాహెబ్ షిండే సాయిచిత్రపటాన్ని చేతపట్టుకున్నారు. ఈ ఊరేగిం పులో సంస్థాన్ అధికారులు, వారి సతీమణులు, భక్తులు, స్థానికులు భారీ సంఖ్యల్లో పాల్గొన్నారు.  ఇదిలా ఉండగా ఆలయానికి సమీపంలో నిర్మించిన భారీ వేదికపై రోజంతా వివిధ భక్త మండలులు భజనలు, కీర్తనలు ఆలపిస్తున్నాయి.   

 ఉచిత  ప్రసాదాలు..
 తెలుగు భక్తులతోపాటు ఇతర ప్రాంతాల భక్తులు అందజేసిన విరాళాలలతో షిర్డీ వచ్చే భక్తులందరికీ ఉచితంగా ప్రసాదాలు, భోజనాలు పెడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన కరణం నారాయణ, పోత్రాపులా పార్థసారథి, సులోచనా కార్తీక్  సంజయ్, చీరాలకు చెందిన వెంకటరమణా రెడ్డితోపాటు ముంబై, జబల్‌పూర్ భక్తులు అందించిన సహాయంతో ప్రసాదాలు, భోజనాలు పెట్టారు. గురుపౌర్ణమి ఉత్సవాల మొదటి రోజు శుక్రవారం 70 వేల మంది భక్తులకు ఉచితంగా లడ్డూలు పంపిణీ చేశారు.  

 ‘సాయి సన్నిధ్యాత్’ పుస్తకం అవిష్కరణ...
 ముంబైకి చెందిన సాయిభక్తురాలు ముగ్ధా దివాడ్కర్ రచించిన ‘సాయి సన్నిధ్యాత్’ అనే గ్రంథాన్ని గురుపౌర్ణమిని పురస్కరించుకుని అవిష్కరిచారు. ఈ పుస్తకాన్ని సంస్థాన్ ఈఓ కుందన్‌కుమార్ సోనవణే చేతుల మీదుగా  విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి ఈఓ అప్పాసాహెబ్ షిండే, పిఆర్ ఓ మోహన్ జాధవ్, రచయిత  ముగ్ధ, ప్రచురణకర్త కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.

 నేడు రుద్రాభిషేకం...
 గురుపౌర్ణమి ఉత్సవాల చివరి రోజు గురుస్థాన్ ఆల యంలో రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అదేవిధంగా ఉట్టిత్సవాలు, ప్రత్యేక కీర్తనలు తదితర కార్యక్రమాలు ఉంటాయి.

 గ్రాంట్‌రోడ్డులో..
 గ్రాంట్ రోడ్డులోని జగనాథ్ శంకర్‌సేఠ్ సెకండరీ మున్సిపల్ పాఠశాల ఆధ్వర్యంలో శనివారం ఉదయం పాఠశాల ప్రాంగణంలో ‘గురుపూర్ణిమ’ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. గురుశిష్యుల మధ్య సఖ్యత ప్రాధాన్యాన్ని వివరిస్తూ విద్యార్థులు గేయాలు ఆలపించారు. తరువాత ప్రతి ఉపాధ్యాయుడికీ పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ రాపెల్లి సుదర్శన్ మాట్లాడుతూ గురుపూర్ణిమ చారిత్రక ప్రాధాన్యం, విశిష్టత గురించి వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె.రాజు, గాల్డె సదానంద్, తాటికొండ సంగీత, వసం షేక్, అర్చన, శిల్ప, రింకీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement