సల్మాన్ ఖాన్ కేసు వాయిదా | Sakshi
Sakshi News home page

సల్మాన్ ఖాన్ కేసు వాయిదా

Published Sat, Jul 26 2014 12:06 AM

సల్మాన్ ఖాన్ కేసు వాయిదా

సాక్షి, ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ‘హిట్ అండ్ రన్’ కేసును ఆగస్టు 21వ తేదీ వరకు కోర్టు వాయిదా వేసింది. విచారణ సందర్భంగా సాక్షులైన కల్పేష్ వర్మ, అమీన్ శేఖ్‌లు ఇచ్చిన డాక్యుమెంట్లు కన్పించకుండాపోయాయని పోలీసులు శుక్రవారం కోర్టుకు తెలిపారు. మొత్తం 63 డాక్యుమెంట్‌లకు గాను కేవలం ఏడు తమ వద్ద ఉన్నట్టు పేర్కొన్నారు. దీంతో ఆ డాక్యుమెంట్లను వెతికేందుకు సమయం కావాలని పోలీసులు కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది.
 
దీంతో కొంత ఊరట లభించిందని భావిస్తున్నప్పటికీ  సల్మాన్ ఖాన్‌కు సుమారు నెల రోజులపాటు ఉత్కంఠతతో గడపాల్సి రానుంది. 2002లో బాంద్రా క్వార్టర్ రోడ్డుపై ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న అయిదుగురిని సల్మాన్‌ఖాన్ కారు ఢీ కొట్టింది. వేగంగా కారు నడపడంతోపాటు మద్యం తాగి కారు నడిపినట్టు సల్మాన్‌పై ఆరోపణలున్నాయి. ఈ విషయంపై అనేక కారణాల వల్ల జాప్యమైన ఈ కేసు విచారణ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ముఖ్యంగా తాజాగా ప్రారంభమైన విచారణలో సాక్షులు గుర్తుపట్టడంతో మరింత ఇబ్బందుల్లో సల్మాన్ ఇరుక్కున్న సంగతి తెలిసిందే. హిట్ అండ్ రన్ కేసులో నేరం రుజువైతే పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి.

Advertisement
Advertisement