యూనివర్శిటీల్లో గోడలెందుకు ? | Sakshi
Sakshi News home page

యూనివర్శిటీల్లో గోడలెందుకు ?

Published Thu, May 4 2017 6:32 PM

యూనివర్శిటీల్లో గోడలెందుకు ?

న్యూఢిల్లీ : దేశంలోని ప్రతి విశ్వవిద్యాయంలో, ప్రతి కళాశాలలో 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో ఓ దేశభక్తి గోడను నిర్మించాలని, దానిపై సైన్యంలో అత్యున్నత పురస్కారమైన పరమవీర్‌ చక్ర అవార్డు అందుకున్న 21 మంది ధీర సైనికుల చిత్రాలను పెయింట్‌ చేయాలని కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ మంగళవారం పిలుపునిచ్చారు. పైగా ఇది తన ఆలోచన కాదని, ఆరెస్సెస్‌ నేత తరుణ్‌ విజయ్‌ బుర్రలో నుంచి పుట్టుకొచ్చిందని కూడా చెప్పారు.

ఇలాంటి గోడల నిర్మాణం వల్ల ఇప్పటికే కల్లోలంగా తయారైన కళాశాలల వాతావరణం ఎలా మారుతుందో, విద్యార్థుల్లో దేశ భక్తి ఎలా పెరుగుతుందో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రాణాలు త్యాగం చేసిన అమరులు, రాజకీయ నాయకుల చిత్రాలను వదిలేసి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సరిహద్దుల వద్ద కాపలాగాస్తున్న సైనికుల చిత్రాలను పెట్టాలంటూ సూచించడం వెనక ఉద్దేశం ఏమిటీ? దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన చరిత్రగానీ, సంస్కతిగానీ లేనీ ఆరెస్సెస్‌ లాంటి సంస్థలు దేశ స్వాతంత్య్ర పోరాట దశ్యాలనే విద్యార్థుల మనో ఫలకం నుంచి శాశ్వతంగా చెరపేయాలనుకుంటున్నాయా?

దేశ సరిహద్దుల వద్ద కాపలాగాస్తూ విధి నిర్వహణలో ఎంతో మంది సైనికులు అమరులవుతున్నారనడంలో సందేహం లేదు. వారి ప్రాణత్యాగం వల్ల ఛిద్రమవుతున్న వారి కుటుంబాల గురించి కన్నీళ్లు పెట్టని వాళ్లు ఉండరు. బాధాతప్త హదయంతో వారి గురించి మాట్లాడని వారుండరు. అయితే అది ఎవరి తప్పు? దేశ, విదేశీ విధానాల వ్యూహాల్లో విఫలమవుతున్న రాజకీయ పెద్దలది కాదా? ఆర్థికంగా, సామాజికంగా ప్రగతి పథంలో దేశాన్ని నడిపించలేక నెపాన్ని సరిహద్దు పరిస్థితులపైకి నెట్టివేసే నాయకులది కాదా?

 ఆరెస్సెస్, బీజేపీలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారా గత ఫిబ్రవరిలో సోషల్‌ మీడియా ద్వారా విశేష ప్రాచుర్యంలోకి వచ్చిన ఢిల్లీ యూనివర్శిటీలో చదువుతున్న గుర్మెహర్‌ కౌర్‌కన్నా ఎవరు దీనికి సరైన సమాధానం చెప్పగలరు? భార త్, పాక్‌ సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు చర్చల ద్వారా నెలకొల్పే నాయకత్వం ఇరు దేశాల్లో రావాలని, అప్పటి వరకు ఇరువైపుల ఎంతో మంది పిల్లలు తమ తండ్రులను కోల్పోతూనే ఉంటారని కార్గిల్‌ యుద్ధంతో తన తండ్రిని కోల్పోయిన కౌర్‌ మాటలు నేటి నాయకత్వానికి అర్థం అవుతాయా?

ప్రభుత్వ యూనివర్శిటీల్లో, కళాశాలల్లో ఈ దేశభక్తి గోడలు నిర్మించేందుకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయదని, ప్రత్యేక నిధులు కూడా విడుదల చేయదని, విద్యార్థుల విరాళాల ద్వారా ఈ గోడలను నిర్మించాలని కూడా జవడేకర్‌ సూచించారు. అంటే గోడల నిర్మాణానికి ఎవరు ముందుకు రావలన్నది, వస్తారన్నది ఆయన ఉద్దేశం? అధికార పక్షానికి చెందిన విద్యార్థి సంఘం ముందుకొస్తే వాతావరణం ఎలా మారుతుందో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ, ఢిల్లీ యూనివర్శిటీ, కశ్మీర్‌ యూనివర్శిటీల్లో ఇప్పటికే చూశాం. అయినా గోడ కట్టడమంటే భిన్న విశ్వాసాలు, భిన్న సంస్కతులు కలిగిన భారతీయుల మధ్య గోడ కట్టడమే  అవుతుంది. –ఓ సెక్యులరిస్ట్‌ కామెంట్‌

Advertisement
Advertisement