ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టు ఝలక్ | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టు ఝలక్

Published Mon, Apr 24 2017 12:13 PM

ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టు ఝలక్ - Sakshi

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సుప్రీంకోర్టు గట్టి ఝలక్ ఇచ్చింది. ప్రభుత్వం తొలగించిన డీజీపీ టీపీ సేన్‌కుమార్‌ను మళ్లీ అదే పదవిలో నియమించాలని ఆదేశించింది. తనను తిరిగి నియమించాలంటూ సేన్‌కుమార్ దాఖలుచేసిన పిటిషన్ విచారణ అనంతరం జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. అయితే తనకు వెంటనే డీజీపీగా చేరిపోవాలన్న తొందర ఏమీ లేదని సేన్‌కుమార్ అన్నారు. 11 నెలలుగా తానేమీ తొందరపడలేదని ఆయన చెప్పారు. తన కేసును వాదించేందుకు అంగీకరించిన న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్‌, దుష్యంత్ దవేలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. చాలా సందర్భాల్లో తనలాంటి అధికారులు సుప్రీంకోర్టు వరకు రాలేరని, ప్రధానంగా అంత ఖర్చు తాము భరించలేమని అన్నారు.

జిషా హత్యకేసు, పుట్టింగల్ ఆలయంలో బాణసంచా పేలుడు దుర్ఘటన కేసులను సరిగా విచారించలేదంటూ 2016 మే నెలలో కొత్తగా వచ్చిన పినరయి విజయన్ ప్రభుత్వం సేన్‌కుమార్‌ను ఆ పదవి నుంచి తీసేసి, అంతగా ప్రాధాన్యం లేని పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. కానీ ఆయన ఆ పదవిలో చేరకుండా కోర్టుకెక్కారు. పుట్టింగల్ ఆలయంలో జరిగిన అగ్నిప్రమాదంలో 110 మంది మరణించారని, ఆ కేసులో తప్పుచేసిన పోలీసు అధికారులను సేన్‌కుమార్ కాపాడారని సుప్రీంకోర్టులో కేరళ సర్కారు వాదించింది. కానీ కోర్టు మాత్రం సేన్‌కుమార్‌కు అనుకూలంగానే తీర్పు వెల్లడించింది.

Advertisement
Advertisement