ఫేస్‌బుక్‌కు భారీ ఎదురుదెబ్బ! | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌కు భారీ ఎదురుదెబ్బ!

Published Mon, Feb 8 2016 5:23 PM

ఫేస్‌బుక్‌కు భారీ ఎదురుదెబ్బ! - Sakshi

న్యూఢిల్లీ: మొబైల్‌ ఇంటర్నెట్ సేవల విషయంలో కంటెంట్ ఆధారంగా వేర్వేరు డాటా చార్జీలు ఉండాలన్న చర్చకు భారత టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ పుల్‌ స్టాప్‌ పెట్టింది. వేర్వేరు కంటెంట్ యాక్సెస్ పొందేందుకు వినియోగదారులకు వేర్వేరు డాటా చార్జీలు ఉంచాలన్న కంపెనీల ప్రతిపాదనను ట్రాయ్‌ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.

ఈ మేరకు ట్రాయ్‌ ఇచ్చిన తాజా ఉత్తర్వులు ఎయిర్‌టెల్ జీరో, ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్ ప్రచారానికి పెద్ద  ఎదురుదెబ్బ కానున్నాయి. గతకొద్ది నెలలుగా ఫ్రీ బేసిక్స్ పేరిట ఫేస్‌బుక్ భారీ ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో వాణిజ్య ప్రకటనలు ఇవ్వడమే కాకుండా.. ఈ పథకాన్ని కాపాడాలంటూ తన సోషల్ మీడియా సైట్‌లో నెటిజన్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నది. ఈ ప్రచారం ద్వారా ఫ్రీ బేసిక్స్ విషయంలో ఏకంగా ట్రాయ్‌తో ఫేస్‌బుక్‌ అమీతుమీకి దిగింది. అయినప్పటికీ వినియోగదారులు పొందే కంటెంట్ ఆధారంగా డాటా చార్జీలు ఉండాలన్న ప్రతిపాదనను ట్రాయ్ తిరస్కరించింది. ఈ విషయంలో డాటా చార్జీల్లో వివక్ష చూపుతూ ఏ మొబైల్ ఆపరేటర్ అయినా ముందస్తు ఒప్పందం చేసుకుంటే తీవ్ర చర్యలు తప్పవని ట్రాయ్ హెచ్చరించింది. ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 50 వేల నుంచి రూ. 50 లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్ ప్రచారాన్ని స్వచ్ఛంద కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ సమానత్వానికి ఇది వ్యతిరేకమని, 'ఫ్రీ బేసిక్స్' పేరిట ఇంటర్నెట్ సేవలపై గుత్తాధిపత్యానికి ఫేస్‌బుక్ ప్రయత్నిస్తున్నదని వారు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement