ఉగ్రవాదుల కొత్త ‘మిషన్‌’ తెలుసా..? | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదుల కొత్త ‘మిషన్‌’ తెలుసా..?

Published Thu, May 4 2017 9:42 AM

ఉగ్రవాదుల కొత్త ‘మిషన్‌’  తెలుసా..?

శ్రీనగర్‌: నిత్యం తుపాకులు, బాంబులతో కేవలం హత్యలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులు తాజాగా రూట్‌ మార్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారంతా దొంగతనాలు, దోపిడీల బాట పట్టారు. గత రెండు రోజులుగా జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే ఇదే విషయం స్పష్టమవుతోంది. గడిచిన 48గంటల్లో ఉగ్రవాదులు కశ్మీర్‌ వ్యాలీలో మరో దోపిడికి పాల్పడ్డారు. మొఖానికి ముసుగులు వేసుకొని వచ్చిన ఉగ్రవాదులు బుధవారం పుల్వామా జిల్లాలోని కాకపోరా ప్రాంతంలోగల బ్యాంకుపై పడి రూ.3లక్షలు ఎత్తుకెళ్లారు. అంతకంటే రెండుగంటలు ముందు ఇదే తరహాలో వాహిబగ్‌ గ్రామంలోని ఎల్లాకువాయ్‌ దేహాతీ బ్యాంకులో రూ.5లక్షలు దోచుకున్నారు. 

మంగళవారం కూడా గుర్తు తెలియని దుండగులు ఇలాగే యారిపోరా బ్రాంచ్‌లో పడి రూ.65 వేలు, మే 1న డబ్బును తీసుకొస్తున్న జమ్ముకశ్మీర్‌ బ్యాంక్‌ వ్యాన్‌పై దాడికి దిగి ఐదుగురు పోలీసులను, ఇద్దరు బ్యాంకు గార్డులను కాల్చిచంపి దోచుకెళ్లారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ప్రస్తుతం ఉగ్రవాదులు తమకు ముందు డబ్బు కూడ బెట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ‘మిషన్‌ లూట్‌’  అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిసింది.

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఉగ్రవాదుల వద్ద ఇది వరకే ఉన్న పాత నోట్లు ఎందుకు పనికిరానివి అయిన నేపథ్యంలో వారికి కనీస అవసరాలు కూడా తీరని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఉగ్రవాదులు దోపిడీ బాటపట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పెద్ద మొత్తంలో కొత్త నోట్లు బ్యాంకుల్లోనే లభించే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటినే లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారు. మరోపక్క, ఇప్పటికీ హవాలా దందా నడుస్తున్నట్లు కూడా కేంద్ర నిఘా వర్గాల సమాచారం. 

Advertisement
Advertisement