నిర్దోషికి శిక్ష పడొద్దంటే.. ఇదా పరిస్థితి | Sakshi
Sakshi News home page

నిర్దోషికి శిక్ష పడొద్దంటే.. ఇదా పరిస్థితి

Published Wed, Oct 19 2016 5:43 PM

నిర్దోషికి శిక్ష పడొద్దంటే.. ఇదా పరిస్థితి

'వంద మంది దోషులు తప్పించుకన్నా ఫర్వాలేదుగానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు' అన్నది మన భారత న్యాయవ్యవస్థ మౌలికసూత్రం. వివిధ కేసుల్లో అరెస్టై ఎలాంటి శిక్షలు పడకుండా ఏళ్లపాటు జైళ్లలో మగ్గుతున్న పారుల విషయంలో ఈ సూత్రానికి ఎలాంటి భాష్యం చెప్పాలి? రుడాలి షా అనే యువకుడు ఓ కేసులో 1953లో అరెస్టయ్యారు. 1968లోనే న్యాయస్థానం ఆయనపై కేసును కొట్టివేసింది. అయినా.. ఆయన 1983 వరకు, అంటే 30 ఏళ్ల పాటు బిహార్‌లోని ముజఫర్‌పూర్ జైల్లో ఉన్నారు. బోకా ఠాకూర్ అనే యువకుడు తన 16వ ఏట ఓ కేసులో అరెస్టయ్యాడు. ఎలాంటి నేరం చేయకుండానే బీహార్‌లోని మధుబని జైల్లో 36 ఏళ్లపాటు జైల్లో ఉన్నారు. 
 
ఎలాంటి నేరం చేయకుండానే వీరిద్దరు జైలు శిక్ష అనుభవించారు. మరి ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని చెబుతున్న మన న్యాయవ్యవస్థ మౌలిక సూత్రం ఏమైంది? ఇలాంటి వారు ఇద్దరే కాదు. అండర్ ట్రయల్స్‌గా జైల్లో మగ్గుతున్న 2,82,879 (2014 లెక్కల ప్రకారం) మంది పౌరుల్లో ఎన్ని వేల మంది నిర్దోషులు ఉన్నారో! వారిలో ఆరు నెలల నుంచి ఏడాదికి పైగా జైల్లో మగ్గుతున్నవారు 1,22,056 మందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లెక్కలు తెలియజేస్తున్నాయి. రెండున్నర లక్షల మందికి పైగా అండర్ ట్రయల్స్ ఉన్నారంటే అది కరేబియన్ దేశమైన బార్బడోస్ జనాభాకు సమానం. వీరిలో ఏడాదికి పైగా జైల్లో ఉంటున్న వారి సంఖ్య 25 శాతం ఉందంటే ఆశ్చర్యం వేస్తోంది. 
 
మొత్తం జైల్లో ఉంటున్న నేరస్థుల్లో 65 శాతం మంది కేసు విచారణను ఎదుర్కొంటున్న ఖైదీలే. వారిలో ప్రతి పది మందిలో ఏడుగురు ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైల్లో ఉంటున్న వాళ్లు కాగా, ప్రతి పదిమందిలో ఇద్దరు ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైల్లో ఉంటున్నారు. రెండు కారణాల వల్ల వీరు అన్యాయంగా జైల్లో మగ్గిపోతున్నారు. న్యాయసహాయం స్వీకరించే స్థోమత లేకపోవడం ఒకటి కాగా, న్యాయం కోసం లాయర్లను సంప్రదించే అవకాశాన్ని జైలు అధికారులు కల్పించక పోవడం మరో కారణం. వారు జైల్లో ఉండడం వల్ల వారిలో ఎక్కువమంది కుటుంబ సంబంధాలు కోల్పోవడమే కాకుండా చేస్తున్న ఉద్యోగాలను కూడా కోల్పోతున్నారు. ఫలితంగా మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. దేశంలోని జైళ్లలో మగ్గుతున్న విచారణ ఖైదీల్లో ఎక్కువ మంది కశ్మీరు రాష్ట్రానికి చెందినవారే ఉన్నారు. కశ్మీర్‌లో 54 శాతం, గోవాలో 50 శాతం, గుజరాత్‌లో 42 శాతం, ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 40 శాతం మంది ఉన్నారు. 
 
ఈ దుస్థితి తన దృష్టికి రావడంతో సుప్రీం కోర్టు 1980లో రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం అండర్ ట్రయల్స్‌కు వేగంగా సముచిత న్యాయాన్ని అందించాల్సి ఉందని తీర్పు చెప్పింది. ఈ తీర్పును ప్రభువులు ఎలా అర్థం చేసుకున్నారో, జైలు అధికారులకు ఈ తీర్పు గురించి కబురైనా ఉందో, లేదో తెలియదుగానీ పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. పరిస్థితిని చక్కదిద్దాలనే సదుద్దేశంతో 2005లో అప్పట్లో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం భారతీయ శిక్షాస్మృతిలోని 436ఏ సెక్షన్‌లో సవరణ తీసుకొచ్చింది. ఓ కేసు కింద విచారణ ఎదుర్కొంటున్న ఖైదీ ఆ కేసు కింద తనకు పడే శిక్షలో సగభాగాన్ని జైల్లోనే గడిపితే, ఎలాంటి పూచీకత్తులు లేకుండా, కేవలం వ్యక్తిగత బాండుతోనే విడుదల చేయాలన్నది ఆ సెక్షన్‌లో తెచ్చిన మార్పు. ఈ సవరణ కూడా అండర్ ట్రయల్స్ విషయంలో పెద్దగా మార్పును తీసుకురాలేదు. 
 
సుప్రీంకోర్టు 2013లో తాను ఇచ్చిన తీర్పునకు కొనసాగింపుగా 2014లో మరో తీర్పును వెలువరించింది. భారతీయ శిక్షాస్మృతిలోని 436ఏ సెక్షన్‌ను స్ఫూర్తిగా తీసుకొని సగం శిక్షను పూర్తిచేసుకున్న వారిని ఎలాంటి బాండులు లేకుండా బెయిల్‌పై విడుదల చేయాలని, అప్పటికే పూర్తి శిక్షను అనుభవించిన వారిని కూడా బేషరతుగా విడుదల చేయాలని తీర్పు చెప్పింది. దీనికి జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా జడ్జీ, జిల్లా ఎస్పీలతో కలిపి ఓ సమీక్షా కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలంటూ మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఏడు వేల మంది అండర్ ట్రయల్స్ విడుదలయ్యారు. మొత్తం అండర్ ట్రయల్స్‌లో విడుదలైన వారు రెండు శాతం కూడా లేరంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

Advertisement
Advertisement