ఇంతకీ నోట్ల రద్దు నిర్ణయం ఎవరిది? | Sakshi
Sakshi News home page

ఇంతకీ నోట్ల రద్దు నిర్ణయం ఎవరిది?

Published Mon, Sep 4 2017 9:54 AM

ఇంతకీ నోట్ల రద్దు నిర్ణయం ఎవరిది?

సాక్షి, న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రిజర్వ్ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తన పుసక్తంలో చేసిన వ్యాఖ్యలు కలకలమే రేపుతున్నాయి. ప్రత్యామ్నాయాలు సూచించిన పట్టించుకోకుండా డీమానిటైజేషన్ నిర్ణయం తీసుకున్నారంటూ రాజన్‌ తన ‘‘ఐ డు వాట్‌ ఐ డు: ఆన్‌ రీఫార్మ్స్, రెటోరిక్‌ అండ్‌ రీసాల్వ్‌’’ పుస్తకంలో వివరించిన విషయం విదితమే. 
 
 
 
తనకేం సంబంధం లేదని రాజన్‌ తేల్చేయటంతో పలు పశ్నలు ఉద్భవిస్తున్నాయి. ఆ లెక్కన్న నోట్ల రద్దు ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర్య ప్రతిపాదికన తీసుకున్న నిర్ణయమా? లేక వెనకాల ఎవరైనా ఉన్నారా? ఉంటే ఆర్థిక పరిస్థితిని కుదేలు చేయగలిగే నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? ఒత్తిళ్లు పని చేశాయా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని ఆర్బీఐ గణాంకాలతోసహా హెచ్చరించినా ఎందుకింత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది? అన్న ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. పోనీ ఆర్బీఐ కమిటీ సూచనలను కనీసం పరిగణనలోకి తీసుకున్నారా?(లేదనే రాజన్‌ చెబుతున్నారు) అన్న కోణంలోనూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 
 
రాజన్ చెప్పినట్లు అసలు అంత హడావుడిగా నోట్ల రద్దు ప్రకటించాల్సిన అవసరం ఏంటి? అన్నది కీలకంగా మారింది. అన్నింటికి మించి 86 శాతం చెలామణిలో ఉన్న నోట్లను అర్థాంతరంగా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఏంటి?... వీటన్నింటిని త్వరగతిన నివృత్తి చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అలా కానీ పక్షంలో దేశంలో అతిపెద్ద ఆర్థిక కుంభకోణం అన్న మచ్చను మోదీ ప్రభుత్వం తర్వాతి తరాల్లో కూడా మోయాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement