కుంభమేళాలో తప్పిపోయిన కుర్రాడా! | Sakshi
Sakshi News home page

కుంభమేళాలో తప్పిపోయిన కుర్రాడా!

Published Sat, May 23 2015 11:54 PM

మోహన్‌రుషి

కుళాయి తిప్పితే జలజల రాలేది కవిత్వం కాదు. అవి పైపుల్లోని నీళ్లు మాత్రమే. ఆత్మ మెలిదిరిగినపుడు, నరాలను పిండినప్పుడు, కాలిగోరు నుంచి పాములా పాకుతూ, కంటి నుంచి రాలే నిశ్శబ్దపు కన్నీటిబొట్టే కవిత్వం. ‘జీరోడిగ్రీ’లో ఆ కన్నీళ్లు గడ్డకట్టుకుపోయి అక్షరాలైనాయి.  కవిత్వపు చక్కదనం, కన్నీటి చిక్కదనం తెలిసినవాడు మోహన్ రుషి.

మోహన్ కొత్తగా ఏమీ చెప్పలేదు. అన్నీ మనకు తెలుసు. తెలిసినా గుర్తించం. గుర్తించినా అంగీకరించం, అంగీకరించినా మన లోపలి అరల్లో భద్రంగా దాస్తాం. ఆ రహస్యపు గాజుపెట్టెను అతను పగులగొట్టాడు. గాయపడ్డాడు, కట్టు కట్టుకోవడం తెలియనివాడు, కనికట్టు ఎరుగనివాడు.

కుంభమేళాలో తప్పిపోయిన కుర్రాడు మోహన్ రుషి. మేళా మనల్ని అబ్బురపరుస్తుంది, భయపెడుతుంది. తప్పిపోయిన చాలామంది ఇళ్లు చేరుకోరు. వాళ్లకోసం ఎవరో వెతుకుతుంటారు. వాళ్లు ఇంకెవరినో వెతుకుతుంటారు. వెతకడంలోనే కొందరు బతుకును ముగిస్తారు.

ఈ కవిత్వం అందరికీ ఒకేలా అర్థం కాకపోవచ్చు. అసలు అర్థమే కాకపోవచ్చు. ఇఫ్స్ అండ్ బట్స్‌తో సముదాయించుకోవాలని చూస్తే పెద్దగా వొరిగేది కూడా ఉండదు. ఒక పల్లెటూరి అబ్బాయి నగరానికొచ్చి తన ముఖాన్ని పోగొట్టుకున్నప్పుడు కలిగే బాధ ఈ కవిత్వం. కూలిన రాజ్యాలను పునర్నిర్మించొచ్చేమో కానీ, చెదిరిన ఆ పిచ్చుక గూడుని ఏ గడ్డిపోచలతోనూ తిరిగి కట్టలేరని అంటాడు మోహన్.

ఈ ప్రపంచంలో చాలామంది పైకి మనుషులు, లోపల ‘గొల్లుంలు’. గొల్లుం అంటే మనిషి కాదు. జంతువు కాదు. వినయంగా ఉంటూ వంకీ కత్తితో పొడుస్తాడు. నవ్వుతూ రక్తం తాగుతాడు. పసితనంలోనే వృద్ధుడు (లార్డ్ ఆఫ్ ద రింగ్స్ పుస్తకంలో ఒక పాత్ర పేరు గొల్లుం). బ్రాండెడ్ బట్టల ముసుగులో ఈ జంతువులు ఎక్కువై లైఫ్‌స్కిల్స్‌కి సానపెడుతూ మనుషుల్ని పీక్కుతింటున్నాయి. వేటగాళ్లని వేటాడితే తప్ప, బతకలేని నగరంలో తెగిపోయిన పతంగుల్ని ఎగరేసే ప్రయత్నంలో ఉన్నవాడు మోహన్.

ఈ పుస్తకాన్ని అమ్మకి అంకితమిచ్చాడు. ‘లోకం మెచ్చని నా బతుకుని లోకంగా చేసుకున్న అమ్మ రాజమల్లమ్మకు’ అన్నాడు. ఈ వాక్యమే అతి గొప్ప ఆర్ట్ పీస్.
 
 - జి.ఆర్.మహర్షి

Advertisement
Advertisement