Sakshi News home page

‘పుట్టి’ ముంచిన ధనిక దేశాలు!

Published Fri, Nov 29 2013 4:01 AM

‘పుట్టి’ ముంచిన ధనిక దేశాలు!

భూతాపోన్నతి వికృత కరాళ నృత్యం కళ్ల ముందు కనపడుతున్నా.. దానికి కళ్లెం వేసే పనులకు మాత్రం అభివృద్ధి చెందిన దేశాలు ఈ ఏడాదీ మొండి చేయే చూపాయి.  పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల పుట్టి ముంచేందుకే భీష్మించుకు కూర్చున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. పోలెండ్ రాజధాని నగరం వార్సాలో ఇటీవల ముగిసిన అంతర్జాతీయ వాతావరణ సదస్సు సారాంశం ఇదే. ఫిలిప్పీన్స్‌ను రాకాసి తుపాను వల్లకాడుగా మార్చిన తెల్లారే వార్సాలో సదస్సు ప్రారంభమైంది. వేల మంది ప్రాణాలు కోల్పోయి, లక్షన్నర హెక్టార్ల పంట భూములు ఇసుక మేటలపాలై, 80 కిలోమీటర్ల పొడవున సాగునీటి కాల్వలు పూడిపోయి.. వచ్చే ఏడాదికైనా పరిస్థితి కుదుటపడి ఈ పొలాల్లో మళ్లీ పంట పండుతుందో లేదో తెలియని దయనీయ స్థితికి ఫిలిప్పీన్స్ చేరింది. వాతావరణ సదస్సు మొదట్లోనే ఈ విలయాన్ని గురించి చెబుతూ ఆ దేశ ప్రతినిధి భోరున విలపించారు. తోటి ప్రతినిధులూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. మృతులకు నివాళుల ర్పించిన సదస్సులో ఉద్వేగభరిత వాతావరణం కొద్ది నిమిషాలకే ఆవిరై.. ‘ఇప్పుడేం తొందరన్న’ ధోరణిలో మళ్లీ ఎప్పటిలాగే  సాగి పోయింది.
 
 రెండు దశాబ్దాల కాలయాపన
 ఇక అంతే.. 1992లో మొదలుకొని 195 దేశాల వాతావరణ సదస్సుల్లో ఇరవ య్యేళ్లుగా సాగుతున్న ఉత్తి మాటల బాగోతమే వార్సా సదస్సులోనూ కొనసా గింది. భూగోళాన్ని పారిశ్రామిక విప్లవ కాలం నుంచే కాలుష్య కాసారంగా మార్చి.. 80 శాతం ప్రపంచ జనాభా నివసిస్తున్న అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలను పెనువిపత్తుల విష వలయంలోకి నెట్టిన అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రం.. ఏ మాత్రం చీమకుట్టినట్టయినా లేకపోవడం విషాదకరమైన వాస్తవం. ఉద్గారాల తగ్గింపు, నిధుల కేటాయింపు వంటి విషయాల్లో ఈ దేశాలు ఇంతకుముందుకన్నా తీసికట్టు ధోరణిని ప్రదర్శించాయి.
 
  మోసపోవడమే అలవాటైన అభివృద్ధి చెందుతున్న దేశాలు మరోసారి దిమ్మెరపోయాయి. పెపైచ్చు.. ఉద్గారాల తగ్గింపు భారం అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా పంచుకోవాల్సిందేనని ఈ సదస్సులో నిర్ణయించడం నిరాశను కలిగించింది. విపత్తుల్లో చిక్కుకొని అల్లాడుతున్న తమకు చప్పున సాయం చేసే వ్యవస్థనైనా ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేయాల్సిందేనన్న పాత డిమాండ్‌ను అభివృద్ధి చెందుతున్న దేశాలు వాకౌట్ చేసి మరీ ఈ సదస్సులో సాధించుకోవడంగుడ్డిలోమెల్ల.
 
 ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో వాతావరణ మార్పుపై ఏర్పాటైన ప్రభు త్వాల బృందం (యూఎన్‌ఎఫ్‌సీసీసీ) ఇరవయ్యేళ్లుగా ఏటా వాతావరణ సద స్సులు నిర్వహిస్తున్నది. ఈ నెల 11న మొదలైన వార్సా సదస్సు 22నే ముగి యాల్సి ఉన్నా.. ఎడతెగని చర్చలతో మరో 30 గంటలు కొనసాగింది. భూతా పాన్ని తగ్గించేందుకు ఇప్పటికిప్పుడు చేయాల్సిందేమీ లేదు.. 2015 తర్వాత ఆలోచిద్దాం అన్న ధోరణిలో అభివృద్ధి చెందిన దేశాలు వ్యవహరించాయి.  చివరకు.. 2015లో కుదిరే ఒడంబడికలో పొందుపరిచే అంశాలపై ఏకాభి ప్రాయం సాధించారు (ఈ ఒడంబడిక 2020 నుంచి అమల్లోకి రానుంది).
 
 అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆటంకం
 వార్సా వాతావరణ సమావేశాల్లో చెప్పుకోదగ్గ విషయాల్లో మొదటిదేమిటంటే.. ఉద్గారాల తగ్గింపు బాధ్యతకు సంబంధించి అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య తారతమ్యం పాటించనక్కర్లేదని  అంగీకారం కుదరడం! అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ముఖ్యంగా భారత్‌కు, ఆశనిపాతమైన నిర్ణయం ఇది. పారిశ్రామిక విప్లవ కాలం నుంచీ కాలుష్యాన్ని పెంచుతున్నది అభివృద్ధి చెందిన దేశాలే కాబట్టి, ముందు ఆ దేశాలే ఉద్గారాలను తగ్గించాలని భారత్, చైనా తదితర దేశాలు ఇరవయ్యేళ్లుగా వాదిస్తున్నాయి. ‘క్యోటో ప్రొటోకాల్’కు ఈ వాదనే ప్రాతిపదిక. అయితే, ఇప్పుడు ఈ విభజన రేఖ చాలా వేగంగా చెరిగిపోతున్న పరిస్థితికి వార్సా సదస్సు అద్దం పట్టింది.
 
 ఎంత నష్టం... ఎంత కష్టం...!
 వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు(సీవోటూ) 1990లో 355 పీపీఎం మేరకు ఉండేది. ఈ ఏడాది మే నాటికి 400 పీపీఎంకు పెరిగింది. ఈ లోగా అభివృద్ధి చెందుతున్న దేశాల ఉద్గారాలూ పెరిగాయి. అమెరికాను రెండో స్థానానికి నెట్టి చైనా అగ్రస్థానాన్ని అక్రమించింది. యూరోపియన్ యూనియన్, భారత్ 3,4 స్థానాల్లో ఉన్నాయి. పదేళ్ల క్రితం.. విపత్తుల వల్ల దాదాపు 20 వేల కోట్ల డాలర్ల మేరకు నష్టం జరిగేది. ఇటీవల.. ఈ నష్టం 30 వేల కోట్ల నుంచి 40 వేల కోట్ల డాలర్లకు పెరిగింది.  ఇదంతా ఉద్గారాల తగ్గింపుపై కాలయాపనకు మానవాళి చెల్లిస్తున్న మూల్యమే!
 
 వాకౌట్‌తో నెరవేరిన చిరకాల కోరిక
 విపత్తుల వల్ల నష్టపడుతున్న దేశాలకు నేరుగా సహాయం అందించేందుకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు కానుంది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల చిరకాల కోరిక. కనాకష్టంగా ఇన్నాళ్లకు నెరవేరింది. దీనిపై 2015 తర్వాత ఆలోచిద్దామని ధనిక దేశాలు మంకుపట్టు పట్టాయి. వాటి మెడలు వంచడానికి జి77, చైనా సహా 134 దేశాలు వాకౌట్ చేయాల్సివచ్చింది. అయితే, ఇప్పటికి ఇది స్వతంత్రత లేని బలహీన యంత్రాంగమే. దీని పరిధి ఎంత? నిధుల మాటేమిటి?.. ఇవన్నీ సమాధానాల్లేని ప్రశ్నలే.
 
 ఏతావాతా.. ఉద్గారాల తగ్గింపు గురించి అభివృద్ధి చెందిన దేశాలతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాలూ విధిగా పట్టించుకోవాల్సిన దిశగా అంతర్జాతీయ వాతావరణ రాజకీయాలు మలుపు తిరిగిన విషయాన్ని వార్సా సదస్సు చాటుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ తన హక్కులను కాపాడు కుంటూనే.. శిలాజ ఇంధనాల వాడకం తగ్గించుకునే దారులు వెదకాల్సిన పరిస్థితి తోసుకొస్తోందన్న మాట వాస్తవం.  
 - పంతంగి రాంబాబు, ‘సాక్షి’ స్పెషల్ డెస్క్

 

‘వార్సా’ విశేషాలు

నిధులు: భూతాపంవల్ల సంభవించే విపత్తులను పేద దేశాలు ఎదుర్కోవడా నికి 2020 నుంచి ఏటా 10,000 కోట్ల డాలర్లు ఇవ్వడానికి 2009లోనే సంపన్న దేశాలు అంగీకరించాయి. అయితే, 2013-19 మధ్యకాలంలో ఎంత ఇచ్చేదీ చెప్పలేదు. 2016 నాటికి ఏటా 7,000 కోట్ల డాలర్లు ఇవ్వాలన్న అభివృద్ధి చెందుతున్న దేశాల మొరను ఆలకించిన నాధుడే లేడు. ఊరట: అడవుల అభివృద్ధికి గ్రీన్ క్లైమెట్ ఫండ్‌కు సంపన్న దేశాలు 10 కోట్ల డాలర్ల సాయం ప్రకటించాయి. విపత్తు సాయానికి కొత్త యంత్రాంగం: భూతాపం సృష్టించే విపత్తుల నష్టాలను అభివృద్ధి చెందుతున్న దేశాలు తట్టుకోవడానికి అవసరమైన నైపుణ్యం, ఆర్థిక సహాయం అందించడానికి కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు.

అయితే, దీని సంపూర్ణ రూపురేఖలపై 2016లో సమీక్షిస్తారట. వెనకడుగు: 2020లోగా భూతాపం తగ్గింపు చర్యలపై ఎటువంటి వాగ్దానాలూ లేవు. ఉద్గారాలను 1990 స్థాయికన్నా (2020 నాటికి) 25% తగ్గిస్తానని లోగడ చెప్పిన జపాన్ మాట మార్చి.. 3.1% పెరగనున్నాయని చావు కబురు చల్లగా చెప్పింది. 2015 ఒడంబడిక: భూతాపాన్ని పెంచే కర్బన ఉద్గారాల తగ్గింపుపై 2015లో పారిస్ సదస్సులో ఒప్పందం జరుగుతుంది. ఈ ఒప్పందం 2020 నుంచి అమల్లోకి రానుంది. క్యోటో ఒప్పందానికి కాలం చెల్లిన తర్వాత జరగనున్న తొలి అంతర్జాతీయ ఒప్పందం ఇదే.  

Advertisement

What’s your opinion

Advertisement