మద్రాసు తీరాన్ని వీడని పీడకల | Sakshi
Sakshi News home page

మద్రాసు తీరాన్ని వీడని పీడకల

Published Sat, Sep 20 2014 11:48 PM

మద్రాసు తీరాన్ని వీడని పీడకల

మొదటి ప్రపంచ యుద్ధం ఆగస్ట్ 4, 1914న ఆరంభమైంది. నెలా పదిహేను రోజుల తరువాత సరిగ్గా సెప్టెంబర్ 22 రాత్రి 8 గంటల వేళ ఎండెన్ మద్రాస్ నౌకాశ్రయంలో ప్రవేశించి ఎలాంటి హెచ్చరికలు లేకుండా బాంబుల వర్షం కురిపించి, కాల్పులు జరిపింది.
 
చరిత్ర గతిని మార్చిన ఏ ఘటన అయినా మొత్తం భూగోళాన్ని కదలించక మానదు. మొదటి ప్రపంచ యుద్ధం (గ్రేట్‌వార్) అలాంటిదే. ఆ మహా మారణహోమం ప్రధానంగా యూరప్ ఖండంలోనే జరిగినా, భారతావనితో పాటు, దక్షిణ భారతదేశం మీద కూడా దాని నీడ కని పిస్తుంది. నాటి బ్రిటిష్ ఇండియా నుంచి పది లక్షల మంది సైనికులు ఆ యుద్ధంలో పాల్గొన్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆ యుద్ధం నూరేళ్ల సందర్భాన్ని నిర్వహించు కుంటోంది. కాబట్టి చెన్నై అని పిలుచుకుంటున్న మద్రాస్ నౌకాశ్రయంలో ఎస్‌ఎంఎస్ ఎండెన్ అనే జర్మనీ నౌక వీర విహారం చేసిన ఘటనను కూడా గుర్తు చేసుకుంటున్నారు. 1914 సంవత్సరం తొలి అర్ధభాగంలో ఎలాంటి గందర గోళం లేకుండా కార్యకలాపాలు నిర్వహించిన ఎండెన్ నౌక, సెప్టెంబర్ తరువాత జర్మనీ యుద్ధ కండూతిని ప్రతిబింబిం చేలా వ్యవహరించింది. ‘జూన్ సంక్షోభం’ తరువాత పూనకం వచ్చినట్టు వ్యవహరించింది. బ్రిటిష్ నౌకా దళాధిపతిగా విన్‌స్టన్ చర్చిల్ పని చేసిన కాలమది.
 బోస్నియా రాజధాని సరాయేవోలో జూన్ 28న ఆస్ట్రియా- హంగేరీ యువరాజు ఫ్రాంజ్ ఫెర్డినాండ్, ఆయన భార్య సోఫీ చోటెక్‌ను సెర్బు జాతీయవాది గవ్‌రిలో ప్రిన్సిప్ హత్య చేయ డం, తరువాత జరిగిన పరిణామాలను జూన్ సంక్షోభంగా పేర్కొంటారు. ఇదే మొదటి ప్రపంచ యుద్ధానికి దారి తీసింది. నిజానికి ఫెర్డినాండ్ హైదరాబాద్ నగరానికి కూడా వచ్చాడు. నిజాం నవాబు మొదటి ప్రపంచ యుద్ధం కోసం హైదరాబాద్ సంస్థానం వంతు వాటా ఇచ్చాడు కూడా.

మొదటి ప్రపంచ యుద్ధం ఆగస్ట్ 4, 1914న ఆరంభమైం ది. నెలా పదిహేను రోజుల తరువాత సరిగ్గా సెప్టెంబర్ 22 రాత్రి 8 గంటల వేళ ఎండెన్ మద్రాస్ నౌకాశ్రయంలో ప్రవేశించి ఎలాంటి హెచ్చరికలు లేకుండా బాంబుల వర్షం కురిపించింది. కాల్పులు జరిపింది. ఈ ప్రతిధ్వనినీ, ఆ బీభత్సాన్నీ నేటికీ మద్రాస్ మరచిపోలేదు. ఎండెన్ అనే పదం తమిళంతో పాటు, సింహళం, తెలుగు భాషలలో ఒకటైపోయింది.  ఈ పదం 1930, 1940 దశకాలలో వచ్చిన తెలుగునాట సాహి త్యంలో విరివిగా కనిపిస్తుంది. తెగువ, మొండితనం, మూర్ఖ త్వం ఉన్న వారిని ఎండెన్ అని పిలవడం నేడు కూడా ఉంది. ఇప్పటికీ తమిళనాడులో అన్నం తినకుండా మారాం చేసే పిల్లలను భయపెట్టడానికి తల్లులు, ఎండెన్ మళ్లీ వస్తుందని భయపె డుతూ ఉంటారు. ‘అవాన్ థాన్ ఎండెన్’ (వాడు ఎండెన్) అని కూడా ప్రయోగిస్తూ ఉంటారు.

సింగాటో కేంద్రంగా పనిచేసే జర్మన్ నౌకాదళంలో ఎండెన్ ఒక నౌక. చైనాలోని సింగాటో అప్పుడు జర్మనీ స్వాధీనంలో ఉండేది. ఇదే కేంద్రంగా ఆసియాలో- ముఖ్యంగా చైనా, జపాన్, మలేసియా పరిసరాలలో జర్మనీ వాణిజ్యం నిర్వహిం చేది. ఈ నౌక కెప్టెన్ కార్ల్ వాన్ ముల్లర్. నిజానికి గ్రేట్‌వార్ ఆరంభం కాగానే సింగాటో నౌకాదళాన్ని రావలసిందిగా జర్మనీ ఆదేశించింది. కానీ ఆసియా ప్రాంత సముద్ర జలాలలో ఉండి మిత్ర రాజ్యాల (బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, జపాన్) నౌకల భర తం పట్టడానికి ముల్లర్ ప్రత్యేక అనుమతి పొందాడు. 1914 సెప్టెంబర్‌లో ఎండెన్ ఆరు బ్రిటిష్ నౌకలను ముంచింది. అవన్నీ సరుకు రవాణా నౌకలే. అందుకే ముల్లర్ మానవతా దృష్టిని ప్రశంసిస్తూ ప్రపంచ పత్రికలు వార్తలు రాశాయి.  ఆ  దాడులలో 16 మంది చనిపోగా, రవాణా అవుతున్న 70,825 టన్నుల సరుకు ధ్వంసమైంది.
 రెండు ఆంగ్లో-పర్షియన్ చమురు నౌకలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఎండెన్ మద్రాసు నౌకాశ్రయంలో ప్రవేశించింది. వాటిని ధ్వంసం చేయడంతో ఆకాశం మొత్తం పొగతో నిండిపోయి, నగరవాసులు భయ కంపితులయ్యారు. మద్రాస్ చేరగానే ఎండెన్ మొదట తీరానికి దగ్గరలోనే ఉన్న బర్మా ఆయిల్ కంపెనీకి చెందిన నౌకను పేల్చివేసింది. బ్రిటిష్ సామ్రాజ్యంలో భారత్ వెలకట్టలేని వలస అని, ఆ వలసలోనే బ్రిటిష్ (ఆ దేశం బలమంతా నౌకాదళమే) జాతి పరువు తీయాలన్నదే జర్మనీ ఉద్దేశం. తరువాత తూర్పు దిక్కుగా కదిలిన ఎండెన్ మలయా లోని పన్గాంగ్ దగ్గర ఉన్న రష్యా నౌక జమ్‌చుగ్‌ను కూడా అక్టోబర్ 8న ముంచింది. వాటితో పాటు మరో మూడు నౌకలను కూడా నాశనం చేసింది.  మూడు మాసాల పాటు ఇదే రీతిలో పసిఫిక్, హిందూ మహాసముద్ర జలాలలో ఇది అల జడి సృష్టించింది. జావా, సుమత్ర, రంగూన్‌లలో ఎండెన్ బీభ త్సం సృష్టించింది. ఇలా ఇష్టారాజ్యంగా ధ్వంసం చేయగలగ డానికి కారణం- జర్మన్ సిబ్బంది ఎండెన్‌ను  బ్రిటిష్ నౌక హెచ్ ఎంఎస్ యార్‌మౌత్ అని భ్రమింపచేసేవారు. ఆఖరికి ఆస్ట్రేలి యాకు సమీపంలోని కొకోస్ దీవుల దగ్గరకు వచ్చింది. అప్పుడే ఆస్ట్రేలియాకు చెందిన హెచ్‌ఎంఏఎస్ సిడ్నీనౌక ఎదురుదాడి చేయడంతో ఎండెన్ పతనమైంది. ఆ ద్వీపంలో 1950 వరకు దాని శిథిలాలు ఉన్నాయి.

 గోపరాజు నారాయణరావు
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement