ఫలించిన ‘మహా’తంత్రం | Sakshi
Sakshi News home page

ఫలించిన ‘మహా’తంత్రం

Published Sun, Feb 7 2016 12:22 AM

ఫలించిన ‘మహా’తంత్రం

త్రికాలమ్
 
పదమూడేళ్ళ ఉద్యమం అనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించు కున్నప్పటికీ, సార్వత్రిక ఎన్నికలలో ఘనవిజయం సాధించి కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ  హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) అందని ద్రాక్షగా మిగిలిపోవడం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్)కి మింగుడు పడని వాస్తవం. శుక్రవారం నాడు వెల్లడైన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ జైత్రయాత్రను పరిపూర్ణం చేశాయి. ఇక్కడ సున్నా నుంచి 99 స్థానాలకు వారు ఎదిగారు.
 
2014 ఎన్నికలలో తాను హెలికాప్టర్‌లో సుడిగాలి పర్యటనలు నిర్వహించి వంద ఎన్నికల సభలలో ప్రసంగించి నిర్విరామంగా ప్రచారం చేసి సాధించిన విజయం కంటే కుమారుడు కె. తారకరామారావు (కేటీఆర్)  జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో అసాధారణమైన  శక్తిసామర్థ్యాలు  ప్రదర్శించి అపూర్వమైన రీతిలో  నమోదు చేసిన గెలుపు ఎక్కువ విలువైనది.   కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ అన్న విషయం ముఖ్యమంత్రి తనయ చెప్పక ముందే అందరికీ తెలిసిపోయింది.
 
రెండున్నర వేల సంవత్సరాల కిందట చైనీస్ యుద్ధతంత్ర నిపుణుడూ, సేనానీ సన్ జూ రాసిన ‘ది ఆర్ట్ ఆఫ్ వార్’ను  కేసీఆర్ చదివే ఉంటారు. 'The supreme art of the war is to subdue the enemy without fighting (యుద్ధం చేయకుండానే శత్రువుపైన ఆధిక్యం సంపాదించడం అత్యున్న తమైన యుద్ధతంత్రం)’అంటాడు సన్ జూ.
 
2014 సార్వత్రిక ఎన్నికలలో హైదరాబాద్ మహానగర ప్రాంతంలో ఉన్న 24 అసెంబ్లీ స్థానాలలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి కేవలం మూడు స్థానాలు దక్కినప్పుడే కేసీఆర్ మనస్సులో ఎట్లాగైనా సరే హైదరాబాద్‌ని జయించాలనే  సంకల్పం చెప్పుకొని ఉంటారు. అప్పటి నుంచే ఆయన ఒక వ్యూహం ప్రకారం జీహెచ్‌ఎంసీపైన పట్టు సాధించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తూ వచ్చారు. ప్రతిపక్షాల శక్తిని హరించి వాటిని చిత్తు చేయడానికి అవసరమైన అన్ని ఎత్తులూ వేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ (తెదేపా)లలో పలుకున్న నాయకులకు కండువా కప్పి గులాబీ దండులో చేర్చుకున్నారు.
 
ఉలుకున్న నాయకులు  తనకు సన్నిహితులని నమ్మించి వారి పార్టీ సహచరులలో అనుమానాలు ప్రబలే విధంగా మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి కానీ, జీవన్‌రెడ్డి కానీ, తెదేపా నేత దయాకర రావు కానీ కేసీఆర్‌పైన చీటికీమాటికీ కాలుదువ్వకపోవడానికి కారణం ఆయన వారిని శాసన సభలోనూ, బయటా గౌరవంగా సంబోధించడం, ఆత్మీయంగా ప్రస్తావించడం.
 
కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు ఎట్లాగూ ఉన్నాయి. దీనికి తోడు అధికారపార్టీతో కొందరు నాయకులు కుమ్మక్కు అవుతున్నారనీ, అందుకే ప్రభుత్వంపైన దాడి చేయడంలేదనే అనుమానాలు అనైక్యతను మరింత పెంచాయి. జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్ పార్టీ విభాగం అధ్యక్షుడు దానం నాగేందర్ కూడా తెరాస నాయకత్వంతో చర్చలు జరిపి తనకు అనుకూలమైన వాతా వరణం లేని కారణంగానే పార్టీ ఫిరాయించ కుండా కాంగ్రెస్‌లో కొనసాగారనే వార్తలు మీడియాలో వచ్చాయి. అందుకే,  కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేసే మానసిక స్థితిలో లేదు. సమరానికి ముందే ఓటమిని అంగీకరించింది.
 
ప్రతిపక్షాల చిత్తుకు వ్యూహం
తెదేపా నుంచి కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు,  తలసాని శ్రీనివాస యాదవ్ వంటి సీనియర్ నాయకులను పార్టీలో చేర్చుకోవడం వెనుక వ్యూహం ఉంది. అదే విధంగా దయాకరరావును చేర్చుకోకపోవడంలోనూ ఎత్తుగడ ఉంది. తెదేపాను దెబ్బతీయడానికి కేసీఆర్‌కు కలసి వచ్చిన అంశం ‘ఓటుకు కోట్లు’ కేసు.

ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డిని తెలంగాణ తెదేపా నిర్వాహక అధ్యక్షుడిగా నియమించడం, జీహెచ్‌ఎంసీ ప్రచార బాధ్యతలను ఆయనకే అప్పగించడం, ఆయనను వెంట బెట్టుకొని చంద్రబాబు నాయుడు ఎన్నికల సభలలో ప్రసంగించడాన్ని హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్రులు సైతం అనైతికంగా, అవమానకరంగా భావించి ఉంటారు.
 
ఏ మాత్రం వెరపు లేకుండా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న తీరు వారికి వెగటు కలిగించి ఉండాలి. ఎన్నికల ప్రచారం చివరి అంకంలో సికింద్రాబాద్‌లోని కవాతు మైదానంలో తెరాస బహిరంగ సభలో తెదేపా అధ్యక్షుడిని ఉద్దేశించి  కేసీఆర్ ‘నీకు ఇక్కడేం పని? నీ పదమూడు జిల్లాలూ ఊడ్చుకో, పో’ అంటూ ఎద్దేవా చేసినా పల్లెత్తు మాట అనకుండా ప్రచారం ముగించుకొని వెళ్ళిపోయిన చంద్రబాబునాయుడు యుద్ధంలో లేనట్టే లెక్క.
 
జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో తెరాస అద్భుతమైన విజయం సాధించడానికి అనేక కారణాలు చెప్పుకోవచ్చు. మురికివాడలలో నివసించే ప్రజలకు రెండు పడక గదుల ఫ్లాట్లు ఇస్తామనే వాగ్దానం, నాణ్యమైన విద్యుచ్ఛక్తిని నిరంత రంగా సరఫరా చేస్తామని చెప్పడం, నాలుగు ప్రభుత్వ ఆస్పత్రులను నిర్మిస్తామంటూ ప్రకటించడం, మరి రెండు మంచినీటి చెరువులను నగరంలో నిర్మిస్తామంటూ హామీ ఇవ్వడం, శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటామంటూ నమ్మబలకడం వంటి  కారణాలు చాలా కనిపిస్తాయి. మురికివాడలలో నివిసిస్తున్న ప్రజలను బస్సులలో తీసు కొని వెళ్ళి ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన రెండు పడకగదుల ఫ్లాట్లను చూపించడం ద్వారా అటువంటి ప్లాట్లు ఏదో ఒక రోజు తమకూ వస్తాయనే విశ్వాసం వారిలో కలిగించారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాగ్దానాలు కొన్ని అమలు చేయకుండా, కొన్ని అరకొరగా అమలు చేసి, భూసేకరణ పేరు మీద రైతులను అశాంతికి గురి చేసిన చంద్రబాబునాయుడు తన సమస్యలతోనే సతమతం అవుతున్నారనీ, హైదరాబాద్‌లో ఆయన వచ్చి చేసేదేమీ ఉండదనే అభిప్రాయానికి హైదరా బాద్‌లో నివసిస్తున్న సీమాంధ్ర ప్రాంత ప్రజలందరూ వచ్చి ఉంటారు.   ఇవన్నీ ఒక ఎత్తు. కేటీఆర్‌కు ప్రచార బాధ్యతలు అప్పగించడం ఒక ఎత్తు.
 
తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూలలో అనర్గళంగా మాట్లాడుతూ, నగరం అంతా కలియతిరుగుతూ మొత్తం 150 వార్డులనూ చుట్టి ప్రచారం  చేసిన 39 ఏళ్ళ కేటీఆర్ వయస్సుకు మించిన పరిణతి ప్రదర్శించారు. తండ్రి ఇచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్న తీరు అభినందనీయం. టిక్కెట్టు ఆశించి భంగపడిన దాదాపు 600 మంది తిరుగుబాటు అభ్యర్థులకు నచ్చజెప్పి తన పక్షాన ఉంచుకోగలిగారు.  మంచి వాచకం ఒక్కటే సరిపోదు. చెప్పదల చుకున్నది  స్పష్టంగా  చెప్పగలగాలి. సందర్భశుద్ధి తెలియాలి.
 
ఉదాహరణకు  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండో సారి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి అక్కడ దీక్షలో కూర్చున్నవారికి సంఘీభావం ప్రకటించారు. రాత్రంతా వారి మధ్యే గడిపారు. మర్నాడు సభలో మాట్లాడుతూ, 'I thank Rohit's mother for inviting me for the function'  (ఈ ఫంక్షన్‌కు నన్ను ఆహ్వానించినందుకు రోహిత్ తల్లికి ధన్యవాదాలు) అనడం ఎంత ఎబ్బెట్టుగా ఉన్నదో ఇంగితం ఉన్నవారికి ఎవరికైనా అర్థం అవుతుంది.
 
భారీ బహిరంగ సభల అక్కర లేదు
టెలివిజన్, సోషల్ మీడియా వర్ధిల్లుతున్న కాలంలో నాయకులు స్పష్టంగా, సూటిగా, అర్థవంతంగా మాట్లాడటం చాలా అవసరం. అధికారంలో ఉన్నవారిని అదేపనిగా నిందించడం లేదా వారిపై ధ్వజమెత్తడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రజల సమస్యలను క్షుణ్ణంగా అర్థం చేసుకోగలరనీ, వాటిని పరిష్కరించే శక్తియుక్తులు పుష్కలంగా ఉన్నాయనే విశ్వాసం ఓటర్లలో కలిగించాలి. కేవలం వాగ్ధాటి సరిపోదు.విశ్వసనీయత చాలా అవసరం.

2014 సార్వత్రిక ఎన్నికలలో నరేంద్రమోదీ సృష్టించిన ప్రభంజనాన్ని ఆయనే అపార్థం చేసుకున్నారు. కేవలం తన వాగ్ధాటి కారణంగా, కాంగ్రెస్ పార్టీని ఎండగట్టినందు వల్లా ప్రజలు భారతీయ జనతా పార్టీ (భాజపా) అభ్యర్థులను గెలిపించారని ఆయన భావించారు. యూపీఏతో విసిగి పోయిన ప్రజలు మెరుగైనా పాలన వస్తుందనే  ఆశతో ప్రత్యామ్నాయంగా కనిపించిన భాజపాకి ఓట్లు వేశారని ఆయన అర్థం చేసుకోలేదు.
 
అందుకే,  ఢిల్లీలో, బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో సార్వత్రిక ఎన్నికల ప్రసంగాల ధోరణే కొనసాగించారు.  ఆయన ఒక్కరే బిహార్‌లో విస్తృతంగా పర్యటించి అనేక ఎన్నికల సభలలో ధాటిగా  ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీనీ, నెహ్రూ వంశాన్నీ ఘాటుగా విమర్శించారు. లాలూ ప్రసాద్‌నీ, నితీశ్ కుమార్‌నీ ఉతికి ఆరేశారు. ప్రయోజనం? శూన్యం. తాము ఆశించిన తీరులో ఎన్‌డీఏ ప్రభుత్వం పాలించడం లేదనేది ప్రజల స్వీయానుభవం.  కేవలం ఉపన్యాసాలు విని మోసపోకూడదని వారు నిర్ణయించుకున్నారు.
 
ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ కూటమిని గెలిపించారు. బిహార్ ప్రజల  నిర్ణయం సరైనదా కాదా అన్నది కాలం నిర్ధారిస్తుంది. కానీ తన చారిత్రక విజయాన్ని మోదీ అర్థం చేసుకున్న పద్ధతి సరైనది కాదని బిహార్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. కేసీఆర్‌కూ, కేటీఆర్‌కూ క్షేత్రజ్ఞానం ఉంది. ప్రజలనాడి తెలుసు.

ఇంతటి భారీ ఆధిక్యంతో గెలిచి అపరిమితమైన అధికారం చేతుల్లో ఉన్నప్పుడు సంయమనం కోల్పోకుండా వివేకంగా, వినయంగా వ్యవహరించగల నాయకులకే భవిష్యత్తు ఉంటుంది. ప్రజల మనోభావాలు ఎప్పటికీ ఒకే విధంగా ఉండవు. వారి స్వానుభవం ఎప్పటికప్పుడు వారి ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. ఈ వాస్తవాన్ని గ్రహించడమే నాయకులకు రక్ష.


 -కె.రామచంద్రమూర్తి

Advertisement
Advertisement