మనలో మచ్చ, మన మీది మచ్చ | Sakshi
Sakshi News home page

మనలో మచ్చ, మన మీది మచ్చ

Published Sun, Aug 9 2015 3:38 AM

మనలో మచ్చ, మన మీది మచ్చ - Sakshi

నేను ‘పుట్టుమచ్చ’ ఎప్పుడూ మొదటిసారే చదువుతాను. ఎప్పుడు చదివినా ఇది ఇంతకుముందు చదివినదే సుమా అనిపించదు. చదువుతాను అన్నాను కదా, కాదు వింటాను. ఆ పద్యం చదువుతున్నట్టు అనిపించదు. వింటున్నట్టుంటుంది. ఈ పద్యంలో గొంతుక గుక్క తిప్పుకోనివ్వకుండా తన మాటల్ని నాకు వినిపిస్తుంది. మాట తరవాత మాట, రకరకాల వేగాలతో ఆవరించుకుంటాయి నన్ను ఆ పద్యంలోని మాటలు. మొదటి మాటే నన్ను హఠాత్తుగా ఆపి ఒక ప్రమాదకరమైన కష్టాన్ని గురించి వినిపిస్తుంది.
 ‘‘ఒక కట్టుకథ నన్ను కాటేసింది.’’
 
 నాకు కాటేసింది అనే మాట వినేసరికి అదేదో ప్రమాదపు విషపు నాగు గుర్తొచ్చి కొంచెం కంగారు పడుతుండగా ఇంకొంచెం ఆలోచించుకోవడానికి చోటివ్వకుండా ‘ఒక వక్రీకరణ’, ‘ఒక అపనింద’ నన్ను చుట్టుముట్టి, నా దృష్టిని నా చుట్టూ వున్న మనుషుల వైపు మళ్లిస్తాయి. నేను వింటూనే వుంటాను. నాకు కొన్ని వివరాలు, ఆచూకీలు, పుట్టిన తేదీలతో సహా చెప్తాడీయన. నాకా గొంతుక కొత్త. ఈ కథ కొత్తది. కొంత విన్నాక తెలుస్తుంది. ఆ గొంతుకలో వ్యక్తి తన కథనే చెప్తున్నాడు అని. 1955 ఆగస్టు 10 అలా గుర్తుండిపోతుంది.
 
 ‘‘నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదైంది నా పేరు.’’ ఆ మాట వినేసరికి నేను ఉలిక్కిపడతాను. ఒకవేళ ఆ పాపానికి నేను కూడా కారణమా అని. ఎందుకంటే అంతకుముందే నేను పుట్టాను. ఆ తర్వాత గుక్క తిప్పుకోకుండా చరిత్ర మీద, పాఠ్యపుస్తకాల మీద రాయి మీద రాయి విసిరినట్టు మాటలు వినిపిస్తాయి. హఠాత్తుగా 1947 నేననుకుంటున్న అందమైన అంకె కాదు, అది ఒక దారుణం, మనుషుల్ని విడదీసిన విషాదానికి గుర్తు అని చటుక్కున బోధపడుతుంది. నా బొమ్మ చెదిరిపోతుంది.
 
 నా ఇంట కన్ను తెరిచిన
 నవజాత శిశువు తెగ్గోసుకున్న తల్లిపేగు చివర తడియారని నెత్తుటి బొట్టులో కనిపిస్తుంది ఈ 1947. ఇది మూడురంగుల పండుగ కాదు. ఆ పుట్టినవాడు ముస్లిం. మనవాడు కాదు అని గుర్తుచేస్తుంది ఈ 1947. తరవాత వినిపించే నినాదాలు నినాదాలు చేసే పనే చేస్తాయి. ఆలోచనకి చోటివ్వకుండా నా చుట్టూ ఆవేశాన్ని నింపుతాయి. మీకిష్టం లేకపోతే ‘పాకిస్తాన్ వెళ్లిపొండి’ అని ఇప్పటి హిందూ రాజకీయ నాయకులు చెప్తున్న మాటలు నా బుర్ర నిండా తిరుగుతాయి. పేరుకు రాజ్యాంగమైతే వుంది. అది శిలాక్షరం. అంటే రాతి మాట. దానికి మూడు సింహాల బొమ్మ రాతి గుర్తు. ఆ తరువాత వరుసగా కుట్ర కుట్ర కుట్ర అని జలపాతంగా వచ్చే మాటలు వింటూ వుంటే...
 
 నేను పెళ్లాడటం కుట్ర నేను పిల్లల్ని కనడం కుట్ర
 అనేసరికి నా మనసు నన్ను నిలబెట్టి ప్రశ్నిస్తుంది.
 నువ్వేమిటి చేస్తున్నావు ఇన్నాళ్లూ అని .
 రోడ్డుపక్క పేవుమెంటు మీద పూలమ్ముకునేవాళ్లు, పళ్లూ, పల్లీలు అమ్ముకునేవాళ్లు, గొడుగులు బాగుచేసేవాళ్లు, వీధరుగుల మీద కుట్టు పనిచేసేవాళ్లు, వాళ్లు కూడా ముస్లిములే సుమా. వాళ్లు ఎవరికీ ఏ అపకారమూ చేయలేదే. కాని వాళ్ల రక్తమే రోడ్లమీద పారుతుంది.
 పుట్టుమచ్చ అంటే మనకు తెలుసు. మనందరికీ వుంటాయి పుట్టుమచ్చలు. పుట్టుకతో శరీరం మీద వచ్చే మచ్చలివి. జాతకాలు చూసేటప్పుడు ఆ పుట్టుమచ్చలు ఎక్కడ వుంటే లాభమో, ఎక్కడ వుంటే నష్టమో చెప్తారు. బుగ్గమీదో, గడ్డం కిందో అందంగా కనిపిస్తుంది కూడా ఈ పుట్టుమచ్చ. మన వ్యక్తిత్వాన్ని నిర్ధారించుకోవడానికి గుర్తులుగా మన సర్టిఫికేటులో రాసేది ఈ పుట్టుమచ్చ ఉన్న చోటే. ఇది పుట్టుకతో వచ్చిన మచ్చ కాబట్టి దీనికి ఇన్ని విశేషమైన అందాలూ, అర్థాలూ వచ్చాయి. కాని ఈ పద్యం చెప్పేది ఆ పుట్టుమచ్చ గురించి కాదు. పుట్టడమే ఒక మచ్చ. పుట్టుకే ఒక మచ్చ. ఈ పద్యంలో పుట్టుమచ్చ అది. ఈ మాటకి అర్థం తెలిసేసరికి నాకు ఒళ్లు ఒణుకుతుంది.
 
 ‘‘నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదైంది నా పేరు.’’
ఆ మాట వినేసరికి నేను ఉలిక్కిపడతాను. ఒకవేళ
ఆ పాపానికి నేను కూడా కారణమా అని.ఈ పద్యం చాలాసార్లు చదివాను. అంటే విన్నాను. ఇది భారతదేశపు చరిత్రలో శాశ్వతంగా వినిపించే గొంతుక. ఈ గొంతుకకి భాష లేదు. ఈ పద్యానికీ లేదు. అంచేత ఇది ఏ భాషలో అయినా గొప్ప పద్యమే. రామచంద్ర గుహ ‘ఇండియా ఆఫ్టర్ గాంధీ’ పుస్తకంలో ఈ పద్యంలో కొన్ని భాగాలు ఉదహరించిన తరువాత ఇంకా చాలామంది చదివారు. ఈ పద్యపు పూర్తి అనువాదం నా ‘హైబిస్కస్ ఆన్ ది లేక్, ట్వంటీయత్ సెంచరీ తెలుగు పొయట్రీ ఫ్రమ్ ఇండియా’ పుస్తకంలో వుందని చూసి చాలా అమెరికన్ విశ్వవిద్యాలయాలలో ఈ పద్యాన్ని పాఠాలుగా చెప్పారు.
 
 ఒక కవి తన గొంతుకని ఒక సమూహపు గొంతుకగా చేయగలగడం సాహిత్యంలో చాలాసార్లు జరగదు. ఒకవేళ జరిగినా అది ఒక నినాదమో, ఒక ఆవేశమో అవుతుంది కానీ చరిత్రనీ, జీవన విధానాన్నీ అమాయకుల మీద అధికారం చేసిన అన్యాయాన్ని వివరంగా చెప్పే గొంతుక అవదు.
 
 ఖాదర్ ఈ శతాబ్దపు కవి. అతని గొంతుక ఈ శతాబ్దపు ప్రపంచపు గొంతుక. ఇది అమాయకంగా దెబ్బతింటున్న ముస్లిముల గొంతుక మాత్రమే కాదు. ప్రపంచంలో ఎక్కడ బల మైన ఎక్కువ మంది బలంలేని తక్కువమందిని వాళ్ల అవసరాల కోసం, వాళ్ల అధికారం నిలబెట్టుకోవడం కోసం శత్రువులుగా మారుస్తారో వాళ్లందరి గొంతుక ఇది. వాళ్లకి పేరు మతం మూలంగా వచ్చి ఉండొచ్చు. ఒంటి రంగు మూలంగా వచ్చి ఉండవచ్చు. కులం పేరుతో వచ్చి ఉండొచ్చు - కాని ఆళ్లంతా పేదవాళ్లు, దిక్కులేనివాళ్లు. వాళ్లంతా ‘వాళ్లు’ అధికారంలో వున్నవాళ్లు అంతా ‘మనం’ అనుకొని విడదీసి, ఎడంపెట్టి, వికారంగా వేరు పెట్టిన ‘వాళ్లు’. వాళ్ల గొంతుక ఖాదర్.
 - వెల్చేరు నారాయణరావు
 (1991 నాటి ‘పుట్టుమచ్చ’ ద్వితీయ ముద్రణ రేపు వస్తోంది. దానికిగానూ రాసిన ముందుమాట సంక్షిప్తంగా...)
  ఆగస్టు 10న ఖాదర్ మొహియుద్దీన్ ‘షష్టిపూర్తి’.

Advertisement
Advertisement