నెహ్రూ నాటి స్ఫూర్తి నేడేది? | Sakshi
Sakshi News home page

నెహ్రూ నాటి స్ఫూర్తి నేడేది?

Published Thu, Nov 13 2014 11:45 PM

Nehru's inspiration today?

సమకాలీనం

1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీ సాధించింది. కానీ, ‘‘అంకెలున్నాయి. పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. అంతమాత్రాన మేం ప్రభుత్వాన్ని పరిమిత రాజకీయ దృష్టితో చూడటంలేదు. ఇది అందరి ప్రభుత్వం, పార్టీలకతీతంగా జాతీయ ప్రభుత్వంగానే పరిగణిద్దాం. పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్న దేశ ప్రజల మనోభావాలు ప్రతిబింబించేలా మనమంతా కలసి మహాన్ భారత్‌ను ఆవిష్కరిద్దాం’’ అని నెహ్రూ సభ్యుల భావోద్వేగాల మధ్య ప్రకటించారు. ఆ స్ఫూర్తి నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొరవడింది.
 
 1    2    4    8    16    ....? (తదుపరి ఏంటి?)
 ఇది బ్యాంకింగ్ రంగమో, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులోనో ‘ఆప్టిట్యూడ్ టెస్ట్’ ప్రశ్నలా లేదూ?
 ఒక తెలుగు జాతి, రెండు రాష్ట్రాలు, నాలుగు చట్టసభలు, ఎనిమిది పార్టీలు, పదహారు ప్రజా సమస్యలు, ...........? (ఫలితం ఏంటి?)
 ఇది మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రాజకీయ పక్షాల  ‘ఆటిట్యూడ్’ను టెస్ట్ చేసే ప్రశ్నలా ఉంది కదూ!
 అవును. ఇప్పుడదే సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది. చట్టసభల్లో రాజ కీయపక్షాల వైఖరి ప్రజాహితంలో ఉందా? అన్న ప్రశ్న ప్రజాస్వామ్యవాదుల మెదళ్లను తొలుస్తోంది.
 
రాష్ట్ర విభజన జరిగి, రెండు చోట్లా కొత్త ప్రభుత్వాలు కొలువుతీరి 150 రోజులు దాటింది. అంతకుముందు, ముఖ్యంగా ఏడాదిపాటు ప్రత్యేక-సమైక్య వాదనలతో రాష్ట్రం అట్టుడికి అటు, ఇటు ఇరుప్రాంత ప్రజల్లోనూ భావోద్వేగాలు మిన్నంటాయి. అందరిలోనూ అనుమానాలు, అపోహలే కాదు ఆశలు, ఆకాం క్షలు కూడా తారస్థాయికి చేరాయి. ఎన్నికల తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వాల వైపు ప్రజలు ఆశగా చూశారు. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలుగాని, రెణ్ణెల్ల కింద జరిగిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు గాని ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని పరిగణనలోకి తీసుకొని వారి అంచనాల్ని ప్రతి బింబించేలా మాత్రంలేవు. ఉమ్మడి నిర్ణయాలతో ప్రజలకు ప్రయోజనం కలి గించే యోచనకన్నా రాజకీయ ఆధిపత్య ధోరణే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కొత్తగా రూపుదాల్చిన రెండు రాష్ట్రాల్ని, తొలి ప్రభుత్వాలుగా తమదైన పంథాలో తీర్చిదిద్దుకోవడానికి లభించిన గొప్ప అవకాశాన్ని ఈ ఆధిపత్యపోరులో చేజార్చుకుంటున్నాయి. సంకుచిత రాజకీయ దృష్టి కోణంతో యోచించే పరి మితుల చట్రం నుంచి బయటపడలేకపోతున్నాయి. తాము అనుసరించేదే సరైన బాట అని చెప్పుకునే ఎవరి వాదన వారికి ఉండవచ్చు! కానీ, అంతిమం గా చట్టసభల ఔన్నత్యాన్ని నిలిపి, ప్రజాస్వామ్యపు పరమ లక్ష్యాన్ని సాధించే దిశలో మాత్రం నడక సాగటం లేదు. ఆరు దశాబ్దాల కింద మన తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పార్లమెంటులో అన్నమాటల వెనుక స్ఫూర్తిని మనమి ప్పుడు గుర్తుతెచ్చుకోవాలి. 1952 ఎన్నికలప్పుడు అన్నీ తానై నెహ్రూ దేశవ్యా ప్తంగా ప్రచారం చేశారు. నలభై వేల కిలోమీటర్ల మేర పర్యటించి మూడున్నర కోట్ల మందినుద్దేశించి ప్రసంగాలు చేశారు. 489 లోక్‌సభ స్థానాలకుగాను 364లో గెలిచినా... ‘‘అంకెలున్నాయి. పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. అంత మాత్రాన మేం ప్రభుత్వాన్ని పరిమిత రాజకీయ దృష్టితో చూడటం లేదు. ఇది అందరి ప్రభుత్వం, పార్టీలకతీతంగా జాతీయ ప్రభుత్వంగానే పరిగణిద్దాం. పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్న దేశ ప్రజల మనోభావాలు ప్రతిబింబిం చేలా మనమంతా కలసి మహాన్ భారత్‌ను ఆవిష్కరిద్దాం’’ అని సభికుల భావోద్వేగాల మధ్య ప్రకటించారు. ఆ స్ఫూర్తి నేడు కొరవడింది.
 
తెలంగాణలోనూ తేలిపోతోంది!


శాసనసభ తొలి సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాట్లాడుతూ, ‘ప్రతి కీలక విషయంలోనూ అఖిలపక్షం నిర్వహించి పరిష్కారం కనుగొంటామ’న్నారు. ఒక్క ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో తప్ప మరే అంశంలోనూ అఖిలపక్ష భేటీ జరగలేదు. బడ్జెట్ సమావేశాల తొలి రెండు, మూడురోజులు ప్రోత్సాహకరమైన వాతావరణం కనిపించినా, కడకు రాజకీయ ఆధిపత్య పోరుకే పాలక-ప్రతిపక్ష టీడీపీలు యత్నిస్తున్నాయని తేటతెల్లమైంది. ఇప్పటివరకు కాంగ్రెస్ సంయమనంతోనే ఉంది. ప్రతిపక్షాల్ని కలుపుకొని పోతున్న భావన కలిగించడానికి ముఖ్యమంత్రి కొంత యత్నించారు. ‘పెద్దలు జానారెడ్డి, జీవన్‌రెడ్డి, మిత్రుడు రేవంత్‌రెడి’్డ అని సంబోధిస్తూ వ్యక్తిగతంగా సభలో కొంత సాన్నిహిత్యం కనబరచినా, పార్టీలపరమైన వైఖరి మాత్రం ఎడ మొగం పెడమొకంగానే ఉంది. మంత్రి హరీష్‌రావు కూడా తెలివిగా, ‘పద్ధతులు తెలియకుంటే ఎలా? కావాలంటే సీనియర్లు గీతక్క, అరుణక్కలను అడిగి తెలుసుకోండి’ అని తెలుగుదేశం జూనియర్ సభ్యులకు చెబుతూ విపక్ష సభ్యుల మధ్య స్పర్థను రగిలిస్తున్నారు. ముఖ్యమంత్రి కూతురైన ఎం.పి.పై వచ్చిన అభియోగాలపై రెండు రోజులు సభా సమయాన్ని వృధాచేయడం, కడకు టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయడం పాలకపక్ష ఏకపక్ష ధోరణికి నిదర్శనం. విపక్షం చేసిన అభియోగం తప్పయితే, సరైన సమాచారమిచ్చి అది తప్పని నిరూపించ డం ప్రభుత్వానికి అవకాశం మాత్రమే కాదు బాధ్యత కూడా. మాటకారితన మున్న కొంతమంది మంత్రులు ఎక్కువ సభాసమయం తీసుకుంటూ ప్రభు త్వం, పాలకపక్ష భావజాలాన్ని జనబాహుళ్యంలోకి పంపే అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. విపక్షాలు లేవనెత్తే కీలక ప్రజాసమస్యలపై ప్రభుత్వ చిత్తశుద్ధి కొరవడుతోంది. రైతు ఆత్మహత్యలే ఇందుకు ఉదాహరణ.
 
‘ఇవి ఇప్పుడే మొదలయ్యాయా?’ ‘గతంలోనూ ఉన్నాయి కదా!’ అన డాన్ని మించి బాధ్యతారాహిత్యమేముంటుంది! అదే సమయంలో విపక్షం కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కాకుండా నిర్మాణాత్మక సూచనలు చేయాలి, కానీ, ఆ జాడలే లేవు. అయితే, సభలో కొన్ని మంచిపోకడలూ లేకపో లేదు. సభా నాయకుడైన సీఎం ఒక వాడి, వేడి చర్చ తర్వాత నేరుగా విపక్ష బెం చీల వద్దకు వెళ్లి, సీనియర్ సభ్యుడైన జీవన్‌రెడ్డి పక్కన కూర్చొని కొంత నచ్చ జెప్పేయత్నం చేయడం సభలో సుహృద్భావాన్ని పెంచే బలమైన సంకేతమే. ఇది కొత్తేం కాదు. శాసనసభావ్యవహారాల మంత్రిగా లోగడ రోశయ్య కూడా ఇలా చేశారు. ఇటువంటివి ఇప్పుడు మామూలు విషయాలుగా కనిపించినా, దీర్ఘకాలంలో చట్టసభల్లో సత్ సంప్రదాయాల్ని బలోపేతం చేస్తాయి. వాయిదా తీర్మానాల డిమాండ్‌తో ప్రశ్నోత్తరాల సమయాన్ని వృథాచేయొద్దని, ఆ అంశాన్ని తదనంతరం చేపట్టాలని సదుద్దేశంతో పాలకపక్షం చేసిన ప్రతిపాదనకు విప క్షాలు సహకరించడం మంచిపరిణామం. విద్యుత్తు విషయంలో పొరుగు రాష్ట్రంవల్ల జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడానికి కేంద్రం వద్దకు వెళ్లాలని ఏకగ్రీవంగా తీర్మానించడానికి విపక్షాలన్నీ సహకరించడం వంటివి సానుకూ లాంశాలు. ఈ వాతావరణాన్ని పెంచడం పాలక-విపక్షాల కనీస ధర్మం.
 
ఆంధ్రప్రదేశ్ సభలో అధ్వానం

తెలంగాణ శాసనసభలో విపక్షమైన తమ గొంతునొక్కుతున్నారని గగ్గోలు పెట్టే టీడీపీ, రెండుచోట్లా ఒకే నాయకుని నేతృత్వంలో ఉంటూ ఏపీ శాసన సభలో పాలకపక్షంగా చేసిందేమిటి? అక్కడ ఏకైక విపక్షంగా ఉన్న వైఎస్సార్‌సీపీ గొంతునొక్కడమే కదా! ఇద్దరు, ముగ్గురు తెలంగాణ మంత్రులు మాట్లాడితే అంతా ఒకటై ఎదురుదాడి చేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. మరి, అక్కడ అరడజను మంది మంత్రులు విపక్షనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై ఒంటి కాలిపై లేవటాన్ని ప్రజలు చూడరనుకుంటారా? అక్కడ సభలో ఉన్నది మూడు రాజకీయ పార్టీలే. మిత్రపక్షమైన బీజేపీ పాలకపక్షం టీడీపీ చంకన జేరడంతో ఇక మిగిలింది వైఎస్సార్‌సీపీ ఒక్కటే! ప్రజాసమస్యల ప్రస్తావన రానీకుండా, వ్యక్తిగత ఆరోపణలు, దూషణలతో విపక్షనేతపై పాలకపక్షం ఒంటికాలిపై లేచిన ఘటనలెన్నో! అవకాశాలు కల్పించడంలోనూ వివక్ష. సభావ్యవహారాల సలహా సంఘం(బీఏసీ)లో ప్రాతినిధ్యం విషయంలోనూ నానారభస చేశారు. ప్రజా సమస్యల స్పృహ-సభ నడుపుకునే ప్రభుత్వాల బాధ్యతను విస్మరించి, ప్రతి సెషన్‌లో, రోజులో, పూటలో, నిర్దిష్ట చర్చలో ఇలా అంతటా ఆధిపత్య ధోరణి చూపడం, సంఖ్యాబలంతో అణచివేసే పంథా అనుసరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. సభ ఎన్నిరోజులపాటు జరపాలనే విషయంలోనూ నియం తృత్వ ధోరణే తప్ప సంప్రదింపుల సత్సాంప్రదాయమేలేదు. ‘చట్టసభలు వీలై నన్ని ఎక్కువరోజులు పనిచేయాలనే అంశాన్ని పార్లమెంటరీ ప్రిసైడింగ్ అధి కారుల వార్షిక సదస్సు ప్రతియేటా నొక్కి చెబుతోంది, కానీ ఆచరణలో జరగటం లేదు’ అని శాసనసభ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్‌రెడ్డి తరచూ చెబుతుంటారు. తద్వారా సుపరిపాలన అందించే చట్టాల్ని చేయడమేకాకుండా ప్రజాసమస్యల్ని చర్చించి పరిష్కారాలు కనుక్కునే అవకాశం పెరుగుతుందని ఆయన విశ్లేషి స్తారు. ప్రజల తరపున వారి ప్రతినిధుల విస్తృతాభిప్రాయాల వెల్లడికి చట్ట సభలు వేదిక కావాలి. అప్పుడు రాజ్యాంగం పరిధిలోని ఇతర సంస్థల అనుచిత జోక్యాలూ తగ్గుతాయి. అన్ని వైపుల ఆలోచనల్ని ఆహ్వానించే నెహ్రూ దృక్ప థమే, ఈ దేశాన్ని వలసవాద పాలనా వారసత్వంలోకి జారనీకుండా కాపా డింది. ‘‘వస్తువినిమయ మార్కెట్‌కన్నా, ఆలోచనా వినిమయ పథంపైనే సామ్య వాది నెహ్రూకు అచంచల విశ్వాసం’’ అని నెహ్రూ జీవిత చరిత్ర రాసిన సర్వేపల్లి గోపాల్ (డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ కుమారుడు) అంటారు. ఆ స్ఫూర్తిని అం దిపుచ్చుకొని చట్టసభల్ని విశాల దృక్పథంతో నడపడమే 125వ జయంతి సందర్భంగా నెహ్రూకు మనమిచ్చే ఘన నివాళి!    

 

Advertisement
Advertisement