సీమాంధ్ర బుడగ జంగాలకు ఎస్సీ హోదా ఇవ్వాలి | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర బుడగ జంగాలకు ఎస్సీ హోదా ఇవ్వాలి

Published Mon, Jan 5 2015 1:37 AM

Seemandhra bubble should be given the status of SC jangala

భారతదేశ సంస్కృతిని భావితరాలకు అందిస్తూ పురాణ గాథలను కళారూపాల్లో ప్రదర్శిస్తూ జీవనం సాగించే జాతిలో ‘బుడగ జంగం’ కులం ఒకటి. ఢిమికీ, తంబూర, అందెల సహాయంతో వీరు ఊరూరా తిరుగుతూ కథలు చెబుతారు. పూర్వం నుంచి కళను ఉపాధిగా చేసుకుని బతికే వీరు నేడు వాటికి ఆదరణ తగ్గిపోవడంతో భిక్షాటన చేస్తూ పొట్ట పోషించుకుంటున్నారు. గ్రామాల్లో ఉపాధి లేక పట్టణ ప్రాంతాలకు వలసపోతున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లు అవుతున్నా చట్ట సభల్లో ఇప్పటికీ వీరికి ప్రాతినిధ్యం లేదు.
 
నిజాం స్టేట్‌లో షెడ్యూలు కులంగా గుర్తింపు పొందిన బుడగ జంగాలను 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా ఎస్సీలుగా ధ్రువీకరిం చింది. అప్పటికీ బుడగ జంగాలు కేవలం తెలంగాణ ప్రాంతానికి పరిమితమయ్యారు.  1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన సమయం లో కూడా బుడగ జంగం కులస్తులు తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ గా ఉన్నందున ఇక్కడ వీరిని ఎస్సీలుగా గుర్తించింది. అనంతరం బుడగ జంగాలు పెద్ద సంఖ్యలో ఆంధ్ర, రాయలసీమ జిల్లాలకు వలసపోయారు. సంచార జీవితం గడిపే వీరు పక్క రాష్ట్రాలకు కూడా వలసపోయారు.

ఈ నేపథ్యంలో 1976లో రాష్ట్ర ప్రభుత్వం 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌కు సవరణ జరిపి ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కూడా బుడగ జంగాలు ఉన్నారని, వారికి కూడా తెలంగాణలో మాదిరి గా ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. నాటి నుంచి 2008 వరకు అంటే 32 ఏళ్లపాటు ఆంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలో బుడగ జంగాలు ఎస్సీలుగానే పరిగణించబడ్డారు.   
 
ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఇతర కులస్తులు కొందరు అక్రమంగా బుడగ జంగం కుల ధ్రువీకరణ పత్రాలు సంపాదించి ప్రభు త్వ ఉద్యోగాలు పొందిన విషయం వెలుగుచూసింది. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు మాల రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు కుట్రతో ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో బుడగ జంగాలు లేరని అక్కడ కులధ్రువీకరణ పత్రాలు జారీ చేయవద్దని ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా 2008లో ప్రభుత్వం జీవో 144ను వెలువరించి బుడగ జంగాలకు తెలంగాణలోని 10 జిల్లాల పరిధిలోనే కుల ధ్రువీ కరణ పత్రాలు ఇవ్వాలని, ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో జారీ చేయకూ డదని ఉత్తర్వులిచ్చింది. దీంతో ఇప్పుడిప్పుడే చదువుల బాట పట్టిన బుడగ జంగం విద్యార్థులు ఎస్సీ రిజర్వేషన్‌కు దూరమయ్యారు.  
 
అక్రమార్కులను కనిపెట్టి వారిని శిక్షించి, చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఎవరో ఆరోపించారని ఏకంగా ఒక కులం మొత్తాన్ని శిక్షిం చడం గర్హనీయం. ఇప్పటికైనా తమకు న్యాయం జరగాలని ఆంధ్రప్రదేశ్ లోని బుడగ జంగాలు కోరుకుంటున్నారు.

- తూర్పాటి జె శ్రీధర్  అఖిల భారత బేడబుడగ జంగం సమాఖ్య
 

Advertisement
Advertisement