బహుజన చైతన్య విస్తృతి | Sakshi
Sakshi News home page

బహుజన చైతన్య విస్తృతి

Published Sun, Aug 23 2015 2:37 AM

బహుజన చైతన్య విస్తృతి

ఆధునిక తెలుగు సాహిత్యంలో ముస్లింవాదం ముఖ్యమైన పరిణామం. తెలుగు సాహిత్యాన్ని ఒక అడుగు ముందుకు ముస్లింవాదం నడిపింది. ఒక వాదంగా అది నిలదొక్కుకోవడానికి పెద్ద పోరాటమే చేసింది. ఆ క్రమంలో అనేక వ్యక్తిగత సంకలనాలు, ఉమ్మడి సంకలనాలు వెలువడ్డాయి. స్కైబాబ సంపాదకత్వంలో వెలువడ్డ కవిత్వం, కథ, ప్రత్యేక సంచికలు తెలుగు సాహిత్యానికి అదనపు చేర్పు అయ్యాయి. ఆయా గ్రంథాలకు ఆయన అందించిన సంపాదకీయాలు, వ్యాసాల సంకలనమే ‘జాగో’. ఈ రచనలోని భావనలు, ఆలోచనలు ముస్లిం సమాజానికి మాత్రమే పరిమితం కాదు. ముస్లింయేతర సమాజాన్ని జాగృతం చేయటమే ముఖ్యమైన లక్ష్యం.
సాహిత్య వివేచనలో ఆధిపత్య సమాజం ప్రతిపాదించిన భావనలు, సిద్ధాంతాలకే ప్రాముఖ్యం లభించింది. కానీ సామాజిక, సాహిత్య తత్వ విచారణను విశాలం చేసిన మూలవాసుల చేర్పును, కృషిని ఉద్దేశిత విస్మరణకు గురిచేశారు. అందుకే, దళిత, ముస్లిం సాహిత్య ఉద్యమాల భావజాలం ఎవరూ విస్మరించలేని ప్రభావశీల శక్తిగా ఎదిగింది.

ముఖ్యంగా ముస్లింవాదం చేసిన ఒంటరిపోరాటం మెజార్టీ మతాలవారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. క్రమంగా విస్తరిస్తున్న బ్రాహ్మణీకరణ (స్కైబాబ మాటల్లో హిందూయీకరణ), రాజ్యం ప్రమోటఖ చేసిన మతహింస, సమాజం అచేతనంగా అంగీకరిస్తున్న సామాజిక హింస, దోపిడీ, ముస్లిం సమాజంలో రావాల్సిన అంతర్గత పరివర్తన, ముస్లిం స్త్రీల దాస్యవిముక్తి వంటి బాహ్య, అంతర సమస్యల మీద నిర్విరామ పోరాటం ముస్లింవాదాన్ని ఎన్నదగిన ఉద్యమంగా చేశాయి. ముస్లింవాదం బాధితస్వరం మాత్రమే కాదు. అది ప్రజాస్వామిక చైతన్యానికి నిదర్శనం. ఈ ప్రజాస్వామిక వ్యవస్థను మతఛాందసుల నుంచి రక్షించుకోవడానికి ముస్లింవాదం వ్యవస్థీకృతం కావాలి. అలా సంఘాన్ని బహుజన సిద్ధాంత పునాదుల మీద నిర్మించాలని స్కైబాబ చింతన. ముస్లింవాదం అంటే బహుజన చైతన్య విస్తృతి.

బాహ్య, అంతర పోరాటం అనే ద్విముఖ వ్యూహంతో ముస్లింవాదం కృషిచేస్తుంది. దేశ ప్రజాస్వామిక లౌకిక వ్యవస్థను రక్షించుకోవడం కోసం బాహ్యపోరాటం. ముస్లిం సమాజంలోని అసమానతలు, లింగ, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ మారుతున్న పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగే శక్తిమంతమైన సమాజంగా తీర్చిదిద్దడం కోసం అంతర్గత పోరాటం. ముస్లింవాదంలోని మౌలిక అంశాలను ఈ వ్యాసాలు ఎరుకపరుస్తాయి. కాషాయదళం అధికారంలో వున్న ఈ సందర్భంలో బహుజన సమాజంలో తలెత్తాల్సిన చైతన్యాన్ని ఇవి సూచిస్తాయి.
 డాక్టర్ జిలుకర శ్రీనివాస్

Advertisement
Advertisement