ఏది కవిత అవుతుంది? | Sakshi
Sakshi News home page

ఏది కవిత అవుతుంది?

Published Sat, Nov 7 2015 11:47 PM

ఏది కవిత అవుతుంది?

కళ్ళు లోతుకు పీక్కు పొయ్యాయని ఎవరన్నా రాస్తే అది కవిత్వం కాదు. ఇదే భావాన్ని ‘కళ్ళకింద బావులేర్పడతాయి’ అనడం ద్వారా కవిత్వం అవుతుంది. ఎర్రటెండలో రైతు దుక్కి దున్నును అన్నప్పుడు మనకి లభించేది ఒక వాస్తవానికి చెందిన స్టేట్‌మెంట్ మాత్రమే. ‘సూర్యుణ్ణి అరచేత బట్టి రైతు దుక్కి దున్నును’ అన్నప్పుడు అదే వాస్తవం కవిత్వమై మెరిసిపోతుంది. ఊళ్ళో అందరికీ గుడ్డలు నేసిచ్చిన మా తాతకు చచ్చిన రోజున ఎవడూ ఏమీ చేసింది లేదు అన్నప్పుడు కొంత బాధ కనిపించవచ్చు. ఆ బాధ కవిత్వం మాత్రం కాలేదు. ఇదే బాధని ‘మా ఊరి బోసిముడ్డిమీద ఇంత గుడ్డముక్క కప్పిన/ నీ ఔదార్యానికి / నిన్ను దిక్కులేని శవాన్ని చేసి / ఊరు గొప్పగా రుణం తీర్చుకుంది’ అని వ్యక్తం చేసినప్పుడు కవిత్వమయ్యింది.

 ఒక నిజాన్ని కానీ, కోపాన్ని కానీ, ఆనందాన్ని కానీ, ఉన్నదాన్ని ఉన్నట్టు అంటేనో రాస్తేనో కవిత్వం కావటం లేదు. అవి ప్రత్యేక నిర్మాణ పద్ధతిలోకి మారినప్పుడే కవిత్వం అవుతున్నాయి. కళ్ళు లోతుకి పీక్కుపొయ్యాయి అన్నప్పుడు లేని కవిత్వం కళ్ళకింద బావులేర్పడతాయి అన్నప్పుడు ఎట్లా వచ్చింది! కళ్ళకు ఏమాత్రం సంబంధంలేని బావుల్ని తెచ్చి కళ్ళకింద అమర్చటం వల్లనే ఇది సాధ్యమయ్యింది. అంటే ఆయావస్తువుల్ని వాటి మామూలు స్థానాలనుంచి తప్పించి వేరే వస్తువుల సరసన భిన్నస్థానాల్లో నిలిపితే కవిత్వమవుతుంది. నది వేరూ, చమట వేరూ, మనిషికి చెందిన చెమటను తెచ్చి నదికి ఆపాదిస్తూ ఒక కవి ‘నదికి చమట పోసింది’ అన్నాడు. అది కవిత్వమయ్యింది. ఇట్లా వస్తువుల్ని వాటి మామూలు స్థానాలు కాకుండా వేరేస్థానాల్లో నిలిపే నిర్మాణ పద్ధతిని ‘వస్తుస్థానభ్రంశ పద్ధతి’ అంటున్నారు. ఒక విషయాన్ని కవిత్వం చెయ్యడానికి ఇది ఒక పద్ధతి మాత్రమే. ఇలాంటి నిర్మాణ పద్ధతులు ఎన్నో ఉన్నాయి.

     కవుల ఆలోచనలూ ఆవేశాలూ కవిత్వం కావడమంటే ఏంటి అనే ప్రశ్నకు అనేకమంది విమర్శకులు అనేక సమాధానాలిచ్చారు. కవి తన ఆలోచనని ఒక హృదయకంపనగా, ఒక సంవేదనగా, ఒక అనుభవంగా, ఒక మానసిక స్థితిగా ప్రవేశ పెట్టినప్పుడు అది కవిత్వమవుతుందని ఎక్కువమంది అంగీకరించారు. అంటే కవిత్వాన్ని చదివినప్పుడు అందులోని ఆలోచన కాక ఆలోచన తాలూకు ఫీలింగో, ఇమోషనో పాఠకుల్ని పట్టుకుంటుందని అర్థం. ఆ క్రమంలోనే కవి ఆలోచన అందుతుంది కానీ నేరుగా ఆలోచన ఆలోచనగా పాఠకుల్ని చేరదు. చేరితే అది కవిత్వం కాదు. చేరితే అది జనరల్ సూత్రీకరణ మాత్రమే!

 భరతుడి రససిద్ధాంతం, ఆనందవర్ధనుడి ధ్వని సిద్ధాంతం ఈ విషయాన్నే స్పష్టం చేస్తాయి. విభావాలూ, అనుభవాలూ ఆలంబనగా కలిగిన రసం రూపంలో కవి చెప్పాలనుకున్న విషయం పాఠకుల్ని చేరుతుందని భరతుడి అభిప్రాయం. ఆలోచన మనోవైఖరిగా మారడం కవిత్వమన్నాడు హడ్సన్. ఒక థాట్ సెన్సేషన్‌గా బయటబడితే కవిత్వమంటాడు కీట్సు. అర్థమయ్యే ముందు ఆలోచనకి భిన్నమయిన దేన్నో అందించేదే కవిత్వమంటాడు టి.ఎస్.ఎలియట్. ఈ నిర్వచనాలన్నీ సంపూర్ణ స్థాయిలో సత్యాలనుకోవాల్సిన పనిలేదు. దేని విలువయినా సరయిన పరిశీలనకు నిలబడే వరకే. ఏది ఎట్లా ఉన్నా కవి చెప్పదలుచుకున్న విషయాన్నీ, వ్యక్తం చెయ్యాలనుకున్న ఉద్రేక ఉల్లాసాల్ని, కవిత్వం చెయ్యడానికి ఒక ప్రత్యేక నిర్మాణ పద్ధతిని తెలిసో తెలీకో పాటించాల్సుంటుంది.

 నిజమయిన బాధతో మాట్లాడే ప్రతి మాటా కవిత్వమే అని అజంతా లాంటి వాళ్ళు అన్నారు. ఇట్లాంటి అభిప్రాయానికి తొలి వ్యక్తీకరణ కీట్సు మాట ల్లో కనబడుతుంది. ‘ఐజ ఞ్ఛ్టౌటడ ఛిౌఝ్ఛట ౌ్ట ్చట ్ఛ్చఠ్ఛిట ౌ్ట ్చ ్టట్ఛ్ఛ, ఛ్ఛ్ట్ట్ఛట ౌ్ట ఛిౌఝ్ఛ ్చ్ట ్చ’. ఈ అభిప్రాయం వినటానికీ చదవటానికీ బాగానే ఉండొచ్చు. ఇందులో పరిశీలనకు నిలబడే గుణం తక్కువ. చెట్టుకు ఆకులొచ్చినంత సహజంగా కవికి కవిత్వం రావడం అంటే ఏంటి? కవి ఏ ప్రయత్నం చేయకుండానే కవి భావాలూ, ఆలోచనలూ కవిత్వంగా మారాలి అనేకదా!

ఇదెట్లా సాధ్యపడుతుంది? చిత్రంగా ఇలాంటి అభిప్రాయాల్ని అంగీకరించి ప్రచారం చేసేవాళ్ళే ఎక్కువ. కవులు తమ ఆలోచనావేశాల్ని కవిత్వంగా మలచడానికి గొప్ప ఎఫర్ట్ పెట్టాలనే విషయాన్నీ అట్లా ఎఫర్ట్ పెట్టడం ద్వారా తమ భావోద్వేగాల్ని ఏదో ఒక ప్రత్యేక నిర్మాణ పద్ధతిలోకి ఛానలైజ్ చెయ్యాల్సుంటుందనే విషయాన్నీ విస్మరించటం వల్లే ఇలాంటి అభిప్రాయాలు వస్తూంటాయి. నిజమయిన బాధ నుంచీ, ఆత్మ కంపన నుంచీ పలికే ప్రతి పలుకూ కవిత్వమే అనేదాంట్లో కూడా ఈ రొమాంటిక్ ధోరణి చూడొచ్చు. నిజమయిన బాధలు అనుభవిస్తున్న దళితులూ, స్త్రీలూ, పేదవాళ్ళూ వీరంతా మాట్లాడే మాటలన్నీ కవిత్వమే అని చెప్పగలమా? నిజాయితీగా కోపాన్నీ, ఆవేశాన్నీ వెలిబుచ్చే అందరూ కవిత్వాన్ని చెయ్యగలుగుతున్నారా?

 నిజమయిన బాధ, నిజాయితీతో కూడిన ఆలోచనోద్వేగాలు కవిత్వానికి ముడిసరుకు మాత్రమేగానీ అవే కవిత్వం కావు. అవి కవిత్వం కావడానికి కళ, నేర్పరితనం కావాల్సుంటుంది. అయితే కవిత్వం నిర్మించటమనేది కేవలం పండితులకో తెలివిగలవారికో మాత్రమే పరిమితం కాదు. రోజు వారీ జీవితంలో మామూలు జనం తమ భావాల్ని కళాత్మకంగా బయటపెడుతూ ఉండటాన్ని తరచుగా గమనిస్తుంటాం. ‘బతుకు బస్టాండయ్యింది’, ‘ఎండ దంచుతుంది’ అని జనం రోజువారీగా మాట్లాడేదాంట్లో కవిత్వం ఉంది. ‘కంచే చేనుని మేస్తే ఇంకేముంది’, ‘పేగుల గోల పున్నీల్ల కెరుక’, ‘పడి లేచే నడక పించిమిప్పద్ది’- ఇలాంటి అసంఖ్యాకమయిన వ్యక్తీకరణల్లో కవిత్వముండటానికి కారణం వాటిలోని కళాత్మక నిర్మాణం అని అర్థంచేసుకుంటే, ఈ వాక్యాల్ని అనటానికి ఆత్మశుద్ధతా, నిజమయాన బాధా ఉండాలనే నియమం అవసరం లేదని తెలుస్తుంది. పామరులయినా పండితులయినా వాళ్ల ఆలోచనోద్వేగాల్ని వ్యక్తం చేసినప్పడు అవి కవిత్వమైనాయంటే వారు తెలిసో తెలియకో కవిత్వ మాధ్యమానికి చెందిన ప్రత్యేక నిర్మాణ పద్ధతుల్ని వాడారని అర్థం చేసుకోవాలి.
 
 (‘కవిత్వ నిర్మాణ పద్ధతులు’ లోంచి;వ్యాసకర్త 1995లో త్రిపురనేని శ్రీనివాస్‌తో కలసి ‘చిక్కనవుతున్న పాట’ దళిత కవితా సంకలనం తెచ్చారు.)

Advertisement
Advertisement