అవినీతిలో సామాన్యుడు బాధితుడా? భాగస్వామా?! | Sakshi
Sakshi News home page

అవినీతిలో సామాన్యుడు బాధితుడా? భాగస్వామా?!

Published Sun, Oct 11 2015 1:53 AM

అవినీతిలో సామాన్యుడు బాధితుడా? భాగస్వామా?! - Sakshi

మన డ్రాయింగ్ రూమ్‌లలో, మీడియాలో చర్చలు ప్రధానంగా రాజకీయ పార్టీలపైనా, ప్రభుత్వంపైనా దృష్టిపెడుతుంటాయి కానీ మనపై అంటే ప్రజలపై అవి అరుదుగానే దృష్టి పెడతాయి. ఇక అవినీతిపై చర్చ విషయానికి వస్తే సగటుమనిషి బాధితుడు మాత్రమే కానీ ఆ అవినీతిలో అతడూ భాగస్వామే అని ఎవరూ భావించరు. సమాజ అభివృద్ధి అనేది అటు ప్రభుత్వం.. ఇటు రాజకీయ పార్టీల బాధ్యత మాత్రమే అని మనం భావిస్తుంటాం.  ఇలాంటి నైతికరాహిత్యం మన ఓటర్లలో కూడా కనిపిస్తుండటం చూస్తే పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. ఈ అంశాన్ని సరిగా విశ్లేషించగలిగితే రాజకీయాలను అవినీతిమయం చేస్తున్నది ఓటర్లే కానీ రాజకీయనేతలు కాదనే నిర్ధారణకే రావలసి ఉంటుంది.
 
 కొంతకాలం క్రితం ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తితో నేను నిజాయితీతో కూడిన బహిరంగ చర్చ చేశాను. అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్న ఆ వ్యక్తి నేడు మంత్రిగా ఉంటున్నారు. రాజకీయాల్లో అవినీతి, రాజకీయ నేతలు డబ్బును వెదజల్లడంపైనే అప్పట్లో మా మధ్య చర్చ జరిగింది. ఎన్నికల ప్రచారం కోసం అభ్యర్థి పెట్టే ఖర్చులో సగం వరకు ఓటర్లకు నేరుగా ముడుపుల రూపంలో ఇస్తుం టారని ఆయన తెలిపారు. ఓటర్లకు ఇచ్చే ఆ డబ్బులో 50 శాతం వరకు ఓటింగ్ రోజు మధ్యాహ్నం తర్వాత అభ్య ర్థులు వెచ్చిస్తుంటారట. ఆరోజు అప్పటివరకు ఉద్దేశపూర్వ కంగానే ఓటు వేయకుండా ఉండే ఓటర్లకు ఈ మొత్తాన్ని అందిస్తుంటారు.
 
 మధ్యాహ్నం దాకా పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓటెయ్యకుండా ఉంటేనే రాజకీయ పార్టీల నుంచి బాగా పిండుకోవచ్చని ఓటర్ల ఆలోచన. అందుకే, ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు, వారి అనుచరుల వద్ద భారీ మొత్తంలో డబ్బు పోగుపడుతోందని తరచుగా నివేదికలు వస్తుంటాయి.  బిహార్ ఎన్నికల ప్రధాన అధికారి నియమించిన ఒక కమిషన్ సర్వేలో తేలిన అంశాలు వార్తల్లో వచ్చినప్పుడు ఆనాటి మా సంభాషణ నాకు మళ్లీ గుర్తుకొచ్చింది. ఓటు వేయడానికి అభ్యర్థుల నుంచి డబ్బు లేదా ముడుపులను తీసుకోవడం అనేది లంచం కాదని, నైతికంగా కూడా అది తప్పు కాదని సర్వేలో పాల్గొన్న ఓటర్లలో 80 శాతం మంది భావించినట్లు ఆ సర్వే తెలిపింది.  సర్వే వివరాలు వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన కమిషన్ ప్రస్తుతం ఎన్నికలు జరుగనున్న బిహార్ ఓటర్లలో చోటు చేసుకున్న ఈ వైఖరికి అడ్డుకట్ట వేయడానికి పోస్టర్ల ద్వారా ప్రచారం చేయడం, రేడియో స్పాట్లు నెలకొల్పడం ప్రారంభించింది.
 
 ఈ సర్వేలో 4,500 మంది ఓటర్ల నుంచి డేటా సేకరించారు. ఈ సర్వే శాస్త్రీయమైనదేనని, గణాంకాలపరంగా కూడా అది పరిపుష్టంగానే ఉందని దాని వివరాలు సూచిస్తు న్నాయి. సర్వే సమతూకంగా ఉండటానికి నిర్దిష్టరీతిలో ఓటర్ల బృందాన్ని ఎంపిక చేసుకున్నారు. ఓటింగ్ అధికం గానూ, తక్కువగానూ నమోదయ్యే జిల్లాల నుంచి సమ సంఖ్యలో ఓటర్లను ఈ సర్వేలో భాగస్తులను చేశారు. ఎన్నికల కమిషన్ సైతం ఈ నివేదికను స్వీకరించిందంటే దాని డేటా విశ్వసనీయమైనదే అన్నమాట. అయితే ఆ నివే దిక వివరాలు నాకు దిగ్భ్రాంతి కలిగించలేదు. ఓటర్లలో ఈ వైఖరి ఒక్క బిహార్ కే పరిమితమని నేననుకోవడం లేదు.
 
 గతంలో నేను చర్చలు జరిపిన ఆ రాజకీయ నేత కర్ణాటకకు చెందినవారు. ఓటింగ్ రోజున తమిళ రాజకీయ పార్టీలు డబ్బును దినపత్రికలలో మడిచిపెట్టి పంచేవని కొద్ది సంవత్సరాల క్రితం ఒక కథనం వచ్చింది. ఆ రాష్ట్రంలో నిర్దిష్ట సిద్ధాంతాలను అనుసరించేవారు నిర్దిష్ట వార్తా పత్రిక లనే చదివేవారు. అంటే అక్కడ పార్టీలు కూడా తమ ఓట ర్లను సులువుగా గుర్తించేవారు. అక్కడి ఓటర్లకు రాజకీయ నేతలు బట్టలు, సారాయి, ఇతర ముడుపులను తరచుగా పంచిపెట్టడంపై పత్రికలు కథలు కథలుగా ప్రచురించేవి. అయితే మురికివాడల్లో ఉండే ఓటర్లను ఆకర్షించడానికే ఇలా చేసేవారని మధ్యతరగతి ప్రజలను పట్టించుకునేవారు కాదని ఆ వార్తలు వర్ణించేవి కానీ ఈ తరహా ముడుపులను పేద ప్రజలకు మాత్రమే పరిమితం చేసేవారని చూపడానికి డేటా కానీ, సాక్ష్యం కానీ ఉండేది కాదు.
 
 మన సమాజం గురించీ, దాని తప్పుల గురించీ మనవద్ద సరైన విశ్లేషణ లేదని బిహార్ ఎన్నికల కమిషన్ అధ్యయనం చెబుతోంది. మన డ్రాయింగ్ రూమ్‌లలో, మీడి యాలో చర్చలు ప్రధానంగా రాజకీయ పార్టీలపైనా, ప్రభు త్వంపైనా దృష్టిపెడుతుంటాయి కానీ మనపై అంటే ప్రజ లపై అవి అరుదుగానే దృష్టి పెడతాయి. ఇక అవినీతిపై చర్చ విషయానికి వస్తే సగటుమనిషి బాధితుడు మాత్రమే కానీ ఆ అవినీతిలో అతడూ భాగస్వామేనని ఎవరూ భావిం చరు. సమాజాభివృద్ధి అటు ప్రభుత్వం.. ఇటు రాజకీయ పార్టీల బాధ్యత మాత్రమే అని మనం భావిస్తుంటాం. మన ఓటర్లలోని ఇలాంటి ఆలోచనలు అత్యంత సహ జమైనవని బిహార్ ఉదంతం తాజాగా సూచిస్తోంది తప్పితే ఇది చాలా పాత విషయమే. తమ చౌర్యం, తమ అనైతికత ఎంతో సరైనవని భారతీయులు సర్వదా భావిస్తుంటారు.
 
 భారతీయుల్లో 3 శాతం మంది మాత్రమే ఆదాయ పన్ను కడుతుంటారు. పన్ను చెల్లింపుదారుల్లో ఎక్కువ మంది నగర, మధ్యతరగతి, వేతన జీవులే. వీరి పన్ను కూడా వారి కంపెనీ నుంచి తీసివేస్తుంటారు. ఇక్కడ సైతం పన్ను చెల్లింపుదారులు కూడా తమకు అన్వయం కాని పలు మినహాయింపులను ఉపయోగించుకుంటూ పన్ను చౌర్యా నికి, పన్ను ఎగవేతకు పాల్పడుతుంటారు. వాస్తవం ఏమిటంటే, కంపెనీల ద్వారా ఆటోమేటిక్‌గా పన్ను తీసివేతకు బదులుగా స్వచ్ఛందంగా పన్నును చెల్లిం చాలని కోరిన పక్షంలో పన్ను చెల్లింపు అనేది మరింతగా పడి పోతుంది. కోట్లాది రూపాయల సంపాదన ఉండేవారు సైతం అధికపన్నును చట్టబద్ధంగా చెల్లించకపోగా దాన్ని నష్టంగా భావిస్తుంటారనే విషయం నాతోపాటు మన మధ్య తరగతిలోని చాలామందికి తెలుసు.
 
  దీనికి సంబంధించి మరొక చిత్రమైన వాదన కూడా చేస్తుంటారు. ప్రభుత్వం డబ్బును సక్రమంగా వెచ్చించడం లేదు కాబట్టి వాణిజ్య వేత్తలు తాము పన్ను చెల్లించడాన్ని బాధ్యతగా భావించడం లేదని కొందరు భావిస్తుంటారు. ఇలాంటి సూత్రరాహిత్యం, నైతిక రాహిత్యం మన ఓట ర్లలో కూడా కనిపిస్తుండటం చూస్తే పెద్దగా ఆశ్చర్యం కలిగిం చదు. మనం ఈ అంశాన్ని సరైన రీతిలో విశ్లేషించగలిగితే రాజకీయాలను అవినీతమయం చేస్తున్నది ఓటర్లే కానీ రాజకీయనేతలు కాదని మనం తప్పనిసరిగా నిర్ధారణకు రాక తప్పదు.
 
అవినీతితో సంబంధంలేని స్వచ్ఛమైన ఎన్నికల ప్రచా రం కోసం ప్రయత్నించే రాజకీయ పార్టీలకు ఇండియా వంటి చోట వైఫల్యమే మిగులుతుంది. చివరకు ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులు కూడా లంచాలు తీసుకోవటం మొదలె ట్టారని ఆ పార్టీయే స్వయంగా అంగీకరిస్తోంది. వీరు స్విట్జ ర్లాండ్‌లో దాచి ఉంచడానికి కాకుండా ఓటర్లకు సమర్పించ డానికే లంచాలకు దిగుతున్నారు. ఇలాంటి తరహా విషవల యం ఇండియా వంటి చోట్ల మాత్రమే తయారవుతుం టుంది మరి..!
 (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత)
 - ఆకార్ పటేల్
 aakar.patel@icloud.com

Advertisement
Advertisement