145వ రోజు పాదయాత్ర డైరీ | Sakshi
Sakshi News home page

145వ రోజు పాదయాత్ర డైరీ

Published Thu, Apr 26 2018 2:54 AM

145th day padayatra diary - Sakshi

25–04–2018, బుధవారం
వెంకటరామాపురం, కృష్ణా జిల్లా

నిందితులకు కొమ్ముకాస్తుంటే.. మహిళలపై అకృత్యాలు మరిన్ని పెరగవా?!
చంద్రబాబు పాలన సహకార రంగ సంస్థలకు శాపం అనే దానికి మరో నిదర్శనం.. హనుమాన్‌ జంక్షన్‌ షుగర్‌ ఫ్యాక్టరీ. బాబుగారి హయాంలోనే తమకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు నన్ను కలిసిన చెరకు రైతులు. రైతు బాంధవుడు అడపా రంగయ్యగారి వంద ఎకరాల వితరణతో, దాదాపు మూడు వేల మంది రైతుల షేరు ధనంతో 1978లో హనుమాన్‌ కోఆపరేటివ్‌ షుగర్స్‌ ప్రారంభమైంది. 2002లో దీనిని కేవలం రూ.11 కోట్లకే ఓ ప్రయివేటు సంస్థకు అమ్మడం వెనుక చంద్రబాబు స్వప్రయోజనాలు దాగి ఉండటమన్నది జగమెరిగిన సత్యం. ఫ్యాక్టరీని కొన్న ప్రయివేటు సంస్థ నష్టాల సాకు చూపి లాకౌట్‌ ప్రకటించడం చెరకు రైతుల పాలిట అశనిపాతమైంది. ఇది కూడా గతేడాదే.. చంద్రబాబు పాలనలోనే జరగడం వెనుక మతలబు ఏంటో?! బాబుగారి నిర్వాకం వల్ల.. వేలాది మంది రైతుల షేరు ధనం, ఆ రైతుల కోసం వందల కోట్ల విలువైన భూమిని దానంగా ఇచ్చిన అడపా రంగయ్యగారి త్యాగం బూడిదలో పోసిన పన్నీరేనా?

ముంచుకొచ్చిన ప్రమాదం నుంచి.. ఆత్మవిశ్వాసంతో తనను తాను కాపాడుకున్న సోదరి జంగా లావణ్య. ఈ రోజు నాతోపాటు ప్రజా సంకల్ప యాత్రలో కాసేపు అడుగులో అడుగులేసింది. రాష్ట్రం కాని రాష్ట్రంలో ఓ మధ్యరాత్రి వేళ తనపై జరిగిన దాడి నుంచి తప్పించుకున్న తీరును ఆమె చెబుతుంటే ఆసక్తిగా విన్నాను. గత ఫిబ్రవరిలో జరిగిన ఆ భయానక దుస్సంఘటన తాలూకు గుర్తులు ఇంకా ఆమె ముఖంపై, చేతులపై కనిపిస్తున్నాయి. చెన్నై నగరంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న లావణ్య ఓ రోజు విధులు ముగించుకుని తిరిగొస్తున్న సమయంలో దుండగుల బారిన పడింది. ధైర్యంగా తిరగబడి, కత్తిపోట్లకు సైతం ఎదురొడ్డి పోరాడి తీవ్రంగా గాయపడినా.. ఆ అత్యంత విషమ పరిస్థితుల్లో సైతం అసాధారణ సమయస్ఫూర్తిని ప్రదర్శించి మరణం అంచుల్లోంచి బయటపడిన ధీర వనిత ఆ చెల్లెమ్మ. అంతులేని ఆత్మవిశ్వాసంతో అనతికాలంలోనే కోలుకుని, తిరిగి విధుల్లో చేరి, స్త్రీశక్తిని లోకానికి చాటిన ఆ చెల్లెమ్మను ‘సాహస వనిత’ అవార్డుతో పాటు పలు రివార్డులూ వరించాయి.

‘అన్నా.. తమిళ ప్రజల ఆదరణ, ఆ ప్రభుత్వ సహకారం మరువలేనివి. ఆ ప్రభుత్వం సత్వరం స్పందించి కేసును ఛేదించింది. ఈ విషయాలన్నీ మన ముఖ్యమంత్రిని కలిసి వివరించి.. తమిళనాడు రాష్ట్రానికి కృతజ్ఞతలు తెలియజేయమందామని రెండు నెలలుగా ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు’ అని చెప్పింది లావణ్య. రాష్ట్రంకాని రాష్ట్రంలో మన తెలుగుబిడ్డను అక్కడి ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలు, ప్రజలు అక్కున చేర్చుకుని, వెన్నుదన్నుగా నిలిచి, మనోధైర్యాన్నివ్వడం.. నిజంగా ప్రశంసనీయం. ‘నాపై అదే ఘటన మన రాష్ట్రంలో జరిగి ఉంటే.. బయట పడగలిగే దాన్నో లేదో!’ అంటూ ఆ చెల్లెమ్మ ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. మన రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలు, ప్రభుత్వ వైఖరి, స్పందిస్తున్న తీరు ఒక్కసారిగా గుర్తొచ్చాయి.

మహిళలపై నేరాలకు పాల్పడ్డ ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించి ఏడీఆర్‌ సంస్థ జాతీయ స్థాయిలో విడుదలచేసిన నివేదికలో.. ఇద్దరు మంత్రులతో సహా ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీ వారుండటం, దేశంలోనే మన రాష్ట్రం మూడో స్థానంలో నిలవడం ఆందోళనకర విషయం. కాల్‌మనీ కేసుల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే ప్రధాన భూమిక పోషించడం, వారికి ప్రభుత్వ పెద్దల అండదండలు, ప్రోత్సాహం పుష్కలంగా ఉండటం, రిషితేశ్వరి, వనజాక్షి ఘటనలతో పాటు.. పెందుర్తిలో దళిత మహిళను వివస్త్రను చేసిన ఘటనలోనూ నిందితులకు ప్రభుత్వ పెద్దలే కొమ్ముకాయడం చూస్తుంటే.. మన రాష్ట్రం ఎటుపోతోందో అనిపిస్తోంది! నిన్నటికినిన్న అమరావతిలో జరిగిన నిర్భయ తరహా ఘటన మనసును కలచి వేసింది. విషయం తెలిసిన వెంటనే.. నేను పాదయాత్రలో ఉండటంతో పార్టీ తరఫున వాసిరెడ్డి పద్మను పరామర్శకు పంపాను.

మహిళలపై జరుగుతున్న నేరాలపై సత్వరం స్పందించకుండా నిందితులకు కొమ్ముకాస్తుంటే.. అకృత్యాలు మరిన్ని పెరగవా? మానవ మృగాలు మరింతగా పేట్రేగిపోవా? ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం ఆగమేఘాలమీద స్పందించి.. దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించి.. బాధిత మహిళలకు అండగా నిలిస్తే.. మహిళలపై అఘాయిత్యాలు తగ్గుముఖం పట్టవా? మన అక్కచెల్లెమ్మల మనోస్థైర్యం పెరగదా?

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఏ టీవీలో చూసినా ‘బాబు వస్తున్నాడు.. ఇక మహిళలకేం భయం లేదు’ అని ప్రకటనల మీద ప్రకటనలిచ్చారు. కానీ నేడు గతంలో ఎన్నడూ లేనంతగా మహిళలపై దాడులు జరుగుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఈ అకృత్యాలకు మీ ఉదాసీన వైఖరి, నిందితులను వెనకేసుకురావడమే ప్రధాన కారణం కాదా? మీ పార్టీ ప్రజా ప్రతినిధులపై నమోదైన తీవ్రమైన కేసులు సైతం ఎత్తివేస్తూ జీవోలు జారీచేయడం దేనికి సంకేతం? 
- వైఎస్‌ జగన్‌

Advertisement
Advertisement