చాంద్‌ బాషాకు చంద్రబాబు షాక్‌ | Sakshi
Sakshi News home page

చివరి వరకూ ఊరించి ఇప్పుడు..

Published Sat, Mar 9 2019 9:42 AM

Chandrababu Shock To Kadiri MLA Chand Basha - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్‌ బాషాకు మరోసారి పోటీ చేసే అవకాశం కల్పించేందుకు చంద్రబాబు నిరాకరించారు. గత ఎన్నికల్లో బాషా చేతిలో ఓడిపోయిన కందికుంట ప్రసాద్‌కు ఈసారి సీటు ఖరారు చేశారు. చాంద్‌బాషాకు మంత్రి పదవి ఇస్తానని చివరి వరకూ ఊరించి ప్రభుత్వ విప్‌ పదవితో సరిపెట్టారు. ఇప్పుడు ఎమ్మెల్యే సీటు కూడా లేకుండా పోయింది.

హిందూపురం పార్లమెంట్‌ పరిధిలోని రాప్తాడు, ధర్మవరం, పెనుగొండ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, గోనుకుంట్ల సూర్యనారాయణ, బీకే పార్థసారథిలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. పుట్టపర్తిలో పల్లె రఘునాథ్‌రెడ్డిని పనిచేసుకోమని చెప్పినా ఖరారుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిందూపురం ఎంపీగా నిమ్మల కిష్టప్పను కూడా పనిచేసుకోవాలని సూచించినా ఆఖరి నిమిషంలో మారే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతుంది. అనంతపురం పార్లమెంట్‌ పరిధిలో అనంతపురం, రాయదుర్గం, ఉరవకొండ స్థానాలకు ప్రభాకర్‌ చౌదరి, కాల్వ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్‌లకు సీట్లు ఖరారు చేశారు.

నాలుగు ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులు ఖరారు!
నాలుగు పార్లమెంట్‌ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం ఎంపీ అభ్యర్థులుగా సిట్టింగ్‌లైన కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అశోక్‌గజపతిరాజు పేర్లను శుక్రవారం ఖరారు చేసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. చిత్తూరు పార్లమెంట్‌ అభ్యర్థిత్వాన్ని సిట్టింగ్‌ ఎంపీ శివప్రసాద్‌కు దాదాపు ఖరారు చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంట్‌ స్థానాన్ని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆయన పార్టీలో చేరకముందే సీటు ఖరారు చేయడం గమనార్హం. తిరుపతి ఎంపీ స్థానాన్ని జూపూడి ప్రభాకర్‌రావుకు కేటాయించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

గజపతినగరం ఎమ్మెల్యేపై టీడీపీ కేడర్‌ ఆందోళన
విజయనగరం పార్లమెంట్‌ స్థానం పరిధిలోని గజపతినగరం ఎమ్మెల్యే కె.అప్పలనాయుడికి వ్యతిరేకంగా అక్కడి టీడీపీ కేడర్‌ శుక్రవారం ఉండవల్లిలో సీఎం నివాసం వద్ద జరిగిన సమావేశంలో ఆందోళన వ్యక్తం చేసింది. అప్పలనాయుడు అవినీతికి పాల్పడ్డారని, పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని, ఆయనకు టికెట్‌ ఇస్తే ఓడిస్తామని తేల్చిచెప్పారు.

Advertisement
Advertisement