మొరాయింపు కుట్రపై ఈసీ సీరియస్‌!   | Sakshi
Sakshi News home page

మొరాయింపు కుట్రపై ఈసీ సీరియస్‌!  

Published Fri, Apr 19 2019 12:44 AM

Closely monitoring the Ap polling day voting starts late - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ భారీ కుట్రలో భాగంగానే రాష్ట్రంలో 30 శాతం ఈవీఎంలు పనిచేయలేదంటూ సీఎం చంద్రబాబు దుష్ప్రచారానికి దిగటాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌ తీవ్రంగా పరిగణిస్తోంది! ఓటర్లు టీడీపీకి ఓట్లు వేయడం లేదనే విషయాన్ని పసిగట్టిన చంద్రబాబు పోలింగ్‌ శాతాన్ని తగ్గించడమే లక్ష్యంగా కొన్నిచోట్ల ఈవీఎంలు పని చేయకుండా తాను ముందుగానే నియమించిన అధికారులతో కథ నడిపించారనే అభిప్రాయం ఇటు ఎన్నికల కమిషన్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల్లోనూ వ్యక్తమవుతోంది. చంద్రబాబు సూచనల మేరకు అధికారులు నడుచుకున్నా ప్రజలు మాత్రం ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేయడంతో ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని సచివాలయ ఉన్నతాధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులను నెల రోజుల ముందు నుంచే వడపోసి ఎంపిక చేసింది చంద్రబాబు అండ్‌ కో అని గుర్తు చేస్తున్నారు.
 
ప్రైవేట్‌ సిబ్బందిని తప్పించిన ద్వివేది: సీఎం చంద్రబాబు పర్యవేక్షణలో ఆయన కార్యాలయ ఉన్నతాధికారులు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్‌చార్జీలతో పలు దఫాలు చర్చించి అనంతరం రిటర్నింగ్‌ అధికారుల జాబితాను రూపొందించారు. తమకు అనుకూలంగా ఉండే వారినే రిటర్నింగ్‌ అధికారులుగా ఎంపిక చేసి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు జాబితా పంపారని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికలకు ముందే తమకు అనుకూలురైన కలెక్టర్లను, ఎస్పీలను నియమించుకుంది ముఖ్యమంత్రేనని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకే కలెక్టర్లు ప్రభుత్వ ఉద్యోగులను పక్కన పెట్టి నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెందిన ప్రైవేట్‌ ఉద్యోగులను ఎన్నికల విధుల కోసం ఎంపిక చేశారు. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తీవ్రంగా స్పందించారు. తక్షణం ప్రైవేట్‌ ఉద్యోగులను ఎన్నికల విధుల నుంచి తొలగించి ప్రభుత్వ ఉద్యోగులను నియమించాలని ఆదేశించారు. పోలింగ్‌కు నాలుగైదు రోజుల ముందు చోటు చేసుకున్న ఈ పరిణామం చంద్రబాబుకు మింగుడు పడలేదు. మూడు జిల్లాల ఎస్పీలను ఈసీ బదిలీ చేయడాన్ని కూడా చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారని, ఈ క్రమంలోనే పోలింగ్‌కు ముందు రోజు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది కార్యాలయానికి వెళ్లి బెదిరింపులకు దిగారని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.  

పోస్టల్‌ బ్యాలెట్‌ సరళితో బాబు అసహనం  
కేవలం తమకు వత్తాసు పలికితే చాలనే ఉద్దేశంతో ఎన్నికల నిర్వహణలో ఏమాత్రం అనుభవం లేని వారిని రిటర్నింగ్‌ అధికారులుగా చంద్రబాబు ఎంపిక చేశారని, దీంతో కొన్ని చోట్ల సమస్యలు తలెత్తాయనే అభిప్రాయాన్ని ఉన్నతాధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతోపాటు డీఎస్పీలను సైతం చంద్రబాబు తాను చెప్పినట్లు వినేవారిని ఎంపిక చేసుకుని మరీ నియమించారని, వారితోనే ఎన్నికల విధులు నిర్వర్తించాల్సి వచ్చిందని పలువురు ఐఏఎస్‌లు పేర్కొంటున్నారు. అధికారులు ఆయన డైరెక్షన్‌లోనే పనిచేసినా ఓటర్లు మాత్రం వ్యతిరేకంగా తీర్పు చెప్పడంతో చంద్రబాబుకు ఎక్కడలేని ఆగ్రహం, అసహనం పుట్టుకొచ్చిందని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పోస్టల్‌ బ్యాలెట్లలో 80 శాతం ఓట్లు వైఎస్సార్‌సీపీకి పోలైనట్లు జాయింట్‌ కలెక్టర్లు, కలెక్టర్లు ద్వారా సమాచారం తెలుసుకున్న చంద్రబాబులో అసహనం కట్టలు తెంచుకుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.  

రిటర్నింగ్‌ అధికారుల నిర్లిప్తతపై ఈసీ కన్నెర్ర 
ఎన్నికల రోజు పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభంకావడానికి చంద్రబాబు డైరెక్షన్‌లో నియమితులైన రిటర్నింగ్‌ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌ తీవ్రంగా పరిగణిస్తోందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. కొన్నిచోట్ల రిటర్నింగ్‌ అధికారులు కావాలనే పోలింగ్‌ ప్రారంభంకాకుండా జాప్యం చేశారని, ఇందుకు సంబంధించి స్పష్టమైన ఆధారాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌ సేకరిస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని జిల్లాల కలెక్టర్ల పాత్రపై ఆరా తీస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్‌ నివేదికలను తెప్పించుకుంటోందని, ఈవీఎంల్లో సాంకేతిక లోపాలు తలెత్తితే వెంటనే సరిచేయడం లేదా మార్చేందుకు నిపుణులను అందుబాటులో ఉంచినప్పటికీ కలెక్టర్లు, రిటర్నింగ్‌ అధికారులు వెంటనే ఎందుకు స్పందించలేదనే విషయంపైనా దృష్టి సారించిందని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

ఈనెల 11వతేదీన పోలింగ్‌ ప్రారంభమైన రెండు గంటలకే సీఎం చంద్రబాబు స్వయంగా మీడియా ముందుకు వచ్చి 30 శాతం ఈవీఎంలు పనిచేయడం లేదని వ్యాఖ్యానించారంటే ఆయన డైరెక్షన్‌లోనే ఇదంతా జరిగిందని, రిటర్నింగ్‌ అధికారులు కావాలనే జాప్యం చేశారనే అనుమానాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌ వ్యక్తం చేస్తోందని, ఈ కోణంలో కూడా విచారిస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులు, నేతలు, కార్యకర్తలపై దాడులు జరగడం కూడా చంద్రబాబు సూచనలమేరకేనని స్పష్టం చేస్తున్నారు. సీఎం పర్యవేక్షణలోనే గుంటూరు, అనంతపురం తదితర జిల్లాల్లో ఘర్షణలు తలెత్తాయని, వీటిని నివారించడంలో ఆయన నియమించిన యంత్రాంగం విఫలం కావడం వెనుక అనుమానాలున్నాయని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.  

Advertisement
Advertisement