పోలవరం కాంగ్రెస్‌ ఘనతే.. | Sakshi
Sakshi News home page

పోలవరం కాంగ్రెస్‌ ఘనతే..

Published Tue, Jun 26 2018 2:24 AM

CM Chandrababu comments on Polavaram and Congress Party - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును తామే ఇచ్చినట్లు బీజేపీ నాయకులు చెబుతున్నారని.. కానీ దాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు చేసింది కూడా కాంగ్రెస్‌ పార్టీయేనని.. 90 శాతం డబ్బులిస్తామని విభజన చట్టంలో పెట్టింది కూడా ఆ పార్టీయే అని పేర్కొన్నారు. 2013లో వచ్చిన ఆర్‌ అండ్‌ ఆర్‌ చట్టం ప్రకారం డబ్బులిస్తామని గతంలో కాంగ్రెస్‌ పార్టీ చెప్పిందన్నారు. ఏడు ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే తాను ప్రమాణం స్వీకారం చేయనని చెబితే.. ఆ మేరకు మాత్రమే బీజేపీ నిర్ణయం తీసుకుందన్నారు. సోమవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో వీఆర్‌ఏలతో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను నీతి ఆయోగ్‌ చెబితే రాష్ట్రానికి అప్పగించారని, ఈ ప్రాజెక్టుకు సంబంధించి బీజేపీ చేసిందేమీ లేదన్నారు. అసలు ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు ఖర్చు పెట్టిన రూ.1,943 కోట్లను కూడా కేంద్రం ఇవ్వలేదన్నారు. డీపీఆర్‌ రెండు కూడా ఇంకా పూర్తిగా అమలు చేయలేదని, ఈ డబ్బులు వచ్చే పరిస్థితి కూడా కనబడడం లేదన్నారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లినా పట్టించుకోలేదని.. అందుకే కేంద్రంపై పోరాడుతున్నామని చెప్పారు. బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదా ఇప్పించాలని.. హోదా వచ్చే వరకూ వదిలిపెట్టబోమన్నారు. 

టీటీడీ వ్యవహరాలపై విచారణ..
తిరుమల తిరుపతి దేవస్థానంలో(టీటీడీ) జరుగుతున్న వ్యవహారాలపై న్యాయ విచారణ జరిపిస్తామని సీఎం  ప్రకటించారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి విచారణ జరిపించి.. అన్ని విషయాలను భక్తుల ముందు పెడతామని చెప్పారు. పూర్వకాలం నుంచి ఇప్పటివరకు ఏఏ నగలు ఉన్నాయి? తదితర విషయాన్నింటినీ న్యాయ విచారణ కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. రికార్డుల్లో లేని నగలు, వజ్రాల గురించి మాట్లాడుతున్నారని.. వీటిపై కూడా కమిటీ విచారణ జరుపుతుందన్నారు. శ్రీవారి నగలను ప్రజల ముందు ప్రదర్శనకు పెట్టడం సరికాదంటున్నారని.. ఈ అంశాన్ని కూడా జస్టిస్‌ ఆధ్వర్యంలోని విచారణ కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. 

జీతం పెంచాం.. ఇక ప్రజల్లోకి తీసుకెళ్లండి?
జీతాన్ని రూ.10,500కు పెంచిన రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవాలని వీఆర్‌ఏలను సీఎం కోరారు. డీఏ రూ.100 నుంచి రూ.300కు, టీఏ రూ.20 నుంచి రూ.100కు పెంచామని, బయోమెట్రిక్‌ నుంచి కూడా మినహాయింపు ఇచ్చామన్నారు. సర్వీస్‌ కమిషన్‌ ద్వారా నియమితులైన వీఆర్‌ఏలు తమను రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతున్నారని, అలాగే 65 ఏళ్ల వయసు వచ్చిన వీఆర్‌ఏలు తమ వారసులను ఈ పోస్టుల్లో కొనసాగించాలని కోరుతున్నారని.. ఈ డిమాండ్లను కూడా పరిశీలిస్తానని చంద్రబాబు చెప్పారు. వీఆర్‌ఏలు ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకిచ్చే మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచాలని వెంటనే ఉత్తర్వులిస్తామన్నారు. ఉద్యోగులు అడిగిన దానికన్నా ఎక్కువే చేశామని.. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.  

సన్మానం కోసం కాదు.. స్ఫూర్తి నింపేందుకే పిలిచా!
తానెప్పుడూ సన్మానాలు చేయించుకోలేదని.. స్ఫూర్తి నింపేందుకు మాత్రమే వీఆర్‌ఏలను ఇక్కడకు పిలిపించానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. వీఆర్‌ఏల్లో అర్హులైన వారికి వీఆర్‌వోలుగా పదోన్నతి కల్పించే విషయాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కైకాల గోపాలరావు మాట్లాడుతూ.. స్లాబ్‌ విధానంలో అందరికీ టీఏ ఇవ్వాలని, గ్రూపు ఇన్సూరెన్స్‌ మొత్తాన్ని రూ.15 నుంచి రూ.50కు పెంచాలని కోరారు. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ వీఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు ఉమామహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. తమను కూడా రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. కార్యక్రమంలో సీసీఎల్‌ఏ కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, సీఎం చంద్రబాబు రెండు గంటలు ఆలస్యంగా సభకు రావడంతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన వీఆర్‌ఏలు ఆయన వచ్చిన వెంటనే వెనుతిరిగారు. దీంతో సీఎం మాట్లాడుతుండగా ప్రాంగణంలోని కుర్చీలన్నీ చాలావరకు ఖాళీగా దర్శనమిచ్చాయి. 

Advertisement
Advertisement